Cristiano Ronaldo: పాపం రొనాల్డో.. 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. మళ్లీ రేసులో మెస్సీయే..-cristiano ronaldo misses the ballon d or nomination for 1st time in 20 years ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cristiano Ronaldo: పాపం రొనాల్డో.. 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. మళ్లీ రేసులో మెస్సీయే..

Cristiano Ronaldo: పాపం రొనాల్డో.. 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు.. మళ్లీ రేసులో మెస్సీయే..

Hari Prasad S HT Telugu
Sep 07, 2023 09:36 AM IST

Cristiano Ronaldo: పాపం రొనాల్డో.. 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రెండు దశాబ్దాల తర్వాత ప్రతిష్టాత్మక బ్యాలన్ డీ'ఓర్ అవార్డుల నామినేషన్లలో రొనాల్డో పేరు లేదు. అయితే మెస్సీ మాత్రం రేసులో ఉన్నాడు.

క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (AFP)

Cristiano Ronaldo: పోర్చుగల్ సూపర్ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో పేరు లేకుండానే ఈసారి బ్యాలన్ డీ'ఓర్ నామినేషన్లు వచ్చాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డు నామినేషన్లలో రొనాల్డో పేరు లేకపోవడం గత 20 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈసారి అవార్డు కోసం మొత్తం 30 మంది పోటీ పడుతుండగా అందులో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి చోటు దక్కింది.

మెస్సీతోపాటు ఎర్లింగ్ హాలాండ్, కైలియన్ ఎంబాపెలాంటి వాళ్లు కూడా నామినేషన్లలో ఉన్నారు. రొనాల్డో పేరు మాత్రం మిస్ అయింది. ఈ ప్రతిష్టాత్మక బ్యాలన్ డీ'ఓర్ అవార్డును మెస్సీ ఇప్పటి వరకూ ఏడుసార్లు గెలవగా.. రొనాల్డో ఐదుసార్లు గెలుచుకున్నాడు. 2003 తర్వాత ఈ అవార్డుల నామినేషన్లలో రొనాల్డో పేరు లేకపోవడం ఇదే తొలిసారి. రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా క్లబ్ అల్ నసర్ కు ఆడుతున్న విషయం తెలిసిందే. బ్యాలన్ డీ'ఓర్ అవార్డు విజేతను అక్టోబర్ 30న అనౌన్స్ చేయనున్నారు.

అసలేంటీ బ్యాలన్ డీ'ఓర్?

బ్యాలన్ డీ'ఓర్ అనేది ఫ్రాన్స్ కు చెందిన ఓ ప్రముఖ ఫుట్‌బాల్ మ్యాగజైన్. 1956 నుంచి ప్రతి ఏటా మెన్స్ కేటగిరీలో ఈ అవార్డు ఇస్తూ వస్తోంది. ఇక వుమెన్స్ కేటగిరీలో 2018 నుంచి అవార్డు ఇస్తోంది. 2020లో మాత్రం కరోనా కారణంగా ఈ అవార్డు ఇవ్వలేదు. మాంచెస్టర్ సిటీ క్లబ్ నుంచి ఈసారి అత్యధికంగా ఏడుగురు ప్లేయర్స్ నామినేషన్ల లిస్టులో ఉన్నారు.

ఈ క్లబ్ తరఫున 52 గోల్స్ చేసిన హాలాండ్ తోపాటు రోడ్రి, జులియన్ అల్వారెజ్, రూబెన్ డయాస్, జోస్కో గ్వార్డియోల్, కెవిన్ డి బ్రూయెన్, బెర్నాడో సిల్వా ఉన్నారు. ఇక బేయర్న్ మ్యూనిక్ క్లబ్ కు చెందిన ముగ్గురు ప్లేయర్స్ హ్యారీ కేన్, జమాల్ ముసియాలా, కిమ్ మిన్ జే కూడా బ్యాలన్ డీ'ఓర్ అవార్డు రేసులో ఉన్నారు. గతేడాది ఈ అవార్డు గెలిచిన కరీమ్ బెంజెమా కూడా ఈసారి నామినేట్ అయ్యాడు.

WhatsApp channel