Cristiano Ronaldo Fined: రొనాల్డో టైమ్ అస్సలు బాలేదు.. 50 లక్షల ఫైన్‌, రెండు మ్యాచ్‌ల నిషేధం-cristiano ronaldo fined for rude behaviour with a fan ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cristiano Ronaldo Fined: రొనాల్డో టైమ్ అస్సలు బాలేదు.. 50 లక్షల ఫైన్‌, రెండు మ్యాచ్‌ల నిషేధం

Cristiano Ronaldo Fined: రొనాల్డో టైమ్ అస్సలు బాలేదు.. 50 లక్షల ఫైన్‌, రెండు మ్యాచ్‌ల నిషేధం

Hari Prasad S HT Telugu
Nov 24, 2022 03:07 PM IST

Cristiano Ronaldo Fined: రొనాల్డో టైమ్ అస్సలు బాలేనట్లు కనిపిస్తోంది. ఈ మధ్యే మాంచెస్టర్‌ యునైటెడ్ అతన్ని సాగనంపగా.. ఇప్పుడు రొనాల్డోకు సుమారు రూ.50 లక్షల ఫైన్‌, రెండు మ్యాచ్‌ల నిషేధం విధించారు.

క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (AP)

Cristiano Ronaldo Fined: ఫిఫా వరల్డ్‌కప్‌లో తన తొలి మ్యాచ్ ఆడే ముందు పోర్చుగల్ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డోకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఈ మధ్యే తన క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్‌పై ఓ ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేసి.. కాంట్రాక్ట్‌ ముగియక ముందే ఉద్వాసనకు గురైన అతడికి తాజాగా మరో షాక్‌ తగిలింది.

రొనాల్డోకు 50 వేల పౌండ్ల (సుమారు రూ.49.4 లక్షలు) జరిమానా, రెండు మ్యాచ్‌లపై నిషేధం విధించారు. గత సీజన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్ తర్వాత ఓ అభిమాని చేతుల్లోని ఫోన్‌ను విసిరేసిన నేరానికిగాను రొనాల్డోకు ఈ శిక్ష విధించారు. ప్రస్తుతం రొనాల్డో ఏ క్లబ్‌లోనూ లేకపోవడంతో అతడు ఒప్పందం కుదుర్చుకోబోయే కొత్త క్లబ్‌లో చేరిన తర్వాత ఇది అమలవుతుంది.

అయితే ఫిఫా వరల్డ్‌కప్‌కు మాత్రం ఈ నిషేధం వర్తించదు. ఒక రకంగా ఇది పోర్చుగల్‌తోపాటు రొనాల్డోకు పెద్ద ఊరట. యునైటెడ్‌ తనను వదిలేసిన తర్వాత ప్రస్తుతం రొనాల్డో ఫ్రీ ఏజెంట్‌గా ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న ఓ మ్యాచ్‌లో ఓడిన తర్వాత రొనాల్డో.. ఓ అభిమానితో దురుసుగా ప్రవర్తించాడు. అప్పుడే పోలీసులు అతన్ని హెచ్చరించి వదిలేశారు. ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్ అసోసియేషన్‌ దీనిపై విచారణ జరిపి జరిమానా, రెండు మ్యాచ్‌ల నిషేధం విధించింది.

రొనాల్డో ప్రవర్తన సరి కాదని, దురుసుగా ఉన్నదని ఓ స్వతంత్ర రెగ్యులేటరీ కమిషన్‌ తేల్చినట్లు ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. తాను తన భద్రత కోసమే ఇలా చేయాల్సి వచ్చిందని నవంబర్‌ 8 న ఈ కమిషన్‌ ముందు హాజరై రొనాల్డో చెప్పాడు. కానీ భయంతో కాకుండా ఓడిన ఫ్రస్ట్రేషన్‌లో అతడు ఇలా చేసినట్లు కమిషన్‌ గుర్తించింది.

మరోవైపు గురువారమే (నవంబర్‌ 24) పోర్చుగల్‌ తన తొలి మ్యాచ్‌ను ఘనాతో ఆడబోతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో రొనాల్డో ఈ మ్యాచ్‌లో ఎలా ఆడబోతోన్నాడన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే అర్జెంటీనా, జర్మనీలాంటి టీమ్స్‌కు తొలి మ్యాచ్‌లలోనే షాక్‌లు తగిలిన పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌ ఉత్కంఠ రేపుతోంది.

WhatsApp channel