Cristiano Ronaldo out: రొనాల్డోను సాగనంపిన మాంచెస్టర్‌ యునైటెడ్.. క్లబ్‌పై సంచలన ఆరోపణల ఫలితం-cristiano ronaldo out of manchester united after explosive interview ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cristiano Ronaldo Out Of Manchester United After Explosive Interview

Cristiano Ronaldo out: రొనాల్డోను సాగనంపిన మాంచెస్టర్‌ యునైటెడ్.. క్లబ్‌పై సంచలన ఆరోపణల ఫలితం

Hari Prasad S HT Telugu
Nov 23, 2022 10:42 AM IST

Cristiano Ronaldo out: రొనాల్డోను సాగనంపింది పాపులర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ మాంచెస్టర్‌ యునైటెడ్. ఓ ఇంటర్వ్యూలో క్లబ్‌పై అతడు సంచలన ఆరోపణలు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (REUTERS)

Cristiano Ronaldo out: ఊహించిందే జరిగింది. మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్ క్రిస్టియానో రొనాల్డోకు గుడ్‌బై చెప్పింది. ఓల్డ్‌ ట్రాఫర్డ్‌ను వీడి వెళ్లిపోవాలని రొనాల్డోకు సూచించింది. పరస్పర అంగీకారంతో రొనాల్డో వెంటనే క్లబ్‌ను వీడనున్నట్లు మాంచెస్టర్‌ యునైటెడ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మాంచెస్టర్‌ మేనేజర్‌ ఎరిక్‌ టెన్‌ హాగ్‌తోపాటు క్లబ్‌పైనా ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రొనాల్డో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. క్లబ్ తనకు నమ్మక ద్రోహం చేసిందని అతడు అన్నాడు.

తాను టెన్‌ హాగ్‌ను ఎప్పుడూ గౌరవించలేదని అతడు చెప్పాడు. ఓ మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా రావడానికి రొనాల్డో నిరాకరించడంతో ఆ తర్వాత చెల్సీతో మ్యాచ్‌లో అతన్ని మేనేజర్‌ టెన్‌ హాగ్‌ పక్కన పెట్టాడు. తనను రెచ్చగొట్టేలా టెన్‌ హాగ్‌ వ్యవహరించాడని కూడా రొనాల్డో ఆరోపించాడు. దీంతో క్లబ్‌ అతనిపై వేటు వేసింది. తమకు ఇన్నాళ్లూ సేవలు అందించినందుకు కృతజ్ఞతలు చెప్పింది.

"ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో రెండుసార్లు రొనాల్డో అందించిన సేవలకుగాను కృతజ్ఞతలు. క్లబ్‌ తరఫున 346 మ్యాచ్‌లలో 145 గోల్స్‌ చేశాడు. భవిష్యత్తులో అతనికి, అతని కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఎరిక్‌ టెన్‌ హాగ్‌ నేతృత్వంలోనే మిగతా వాళ్లంతా టీమ్‌ భవిష్యత్తు కోసం కలిసి పని చేస్తారు. ఫీల్డ్‌లో సక్సెస్‌ సాధిస్తారు" అని మాంచెస్టర్‌ యునైటెడ్‌ తన ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం రొనాల్డో తన టీమ్ పోర్చుగల్‌ తరఫున ఫిఫా వరల్డ్‌కప్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. మాంచెస్టర్‌ యునైటెడ్ తనను రిలీజ్‌ చేయడంపై రొనాల్డో కూడా ఒక ప్రకటన విడుదల చేశాడు. తమ కాంట్రాక్ట్‌ను ముందుగానే ముగించడానికి క్లబ్‌తో పరస్పర అంగీకారం కుదిరిందని రొనాల్డో చెప్పాడు. "నాకు మాంచెస్టర్‌ యునైటెడ్ అంటే ఇష్టం. అక్కడి ఫ్యాన్స్‌ ఇష్టం. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదు. కానీ ఓ కొత్త సవాలును స్వీకరించడానికి ఇదే సరైన సమయం అని నాకు అనిపించింది" అని రొనాల్డో తెలిపాడు.

WhatsApp channel

టాపిక్