Cristiano Ronaldo on Manchester United: నమ్మక ద్రోహం చేశారు.. మాంచెస్టర్‌పై రొనాల్డో సంచలన ఆరోపణలు-cristiano ronaldo on manchester united says he felt betrayed ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cristiano Ronaldo On Manchester United Says He Felt Betrayed

Cristiano Ronaldo on Manchester United: నమ్మక ద్రోహం చేశారు.. మాంచెస్టర్‌పై రొనాల్డో సంచలన ఆరోపణలు

Hari Prasad S HT Telugu
Nov 14, 2022 02:17 PM IST

Cristiano Ronaldo on Manchester United: నన్ను మోసం చేశారు అంటూ మాంచెస్టర్‌ యునైటెడ్‌పై క్రిస్టియానో రొనాల్డో సంచలన ఆరోపణలు చేశాడు. పియర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన రొనాల్డో ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనం రేపుతోంది.

క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (REUTERS)

Cristiano Ronaldo on Manchester United: పోర్చుగల్‌, మాంచెస్టర్‌ యునైటెడ్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రకంపనలు రేపుతోంది. తాను ఇప్పుడున్న మాంచెస్టర్‌ టీమ్‌, ఆ టీమ్‌ మేనేజర్‌, సహచర ప్లేయర్స్‌పై రొనాల్డో సంచలన ఆరోపణలు చేశాడు. తనకు నమ్మకం ద్రోహం చేశారని అతడు అనడం గమనార్హం.

తనను మాంచెస్టర్‌ యునైటెడ్‌ టీమ్‌ నుంచి బయటకు పంపించేయడానికి చూశారనీ రొనాల్డో ఆరోపించాడు. ఇక ప్రస్తుత మేనేజర్‌ ఎరిక్‌ టెన్‌ హాగ్‌పైనా తీవ్ర విమర్శలు చేశాడు. పియర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రొనాల్డో ఈ ఆరోపణలు చేయగా.. దానికి సంబంధించిన టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ ఇంటర్వ్యూ ఈ వారంలోనే బ్రిటన్‌కు చెందిన టాక్‌టీవీలో బ్రాడ్‌కాస్ట్‌ కానుంది.

ఆదివారం (నవంబర్ 13) ఫుల్హామ్‌తో మ్యాచ్‌లో 2-1తో గెలిచిన తర్వాత రొనాల్డో ఈ ఇంటర్వ్యూ ఇచ్చాడు. వరుసగా రెండో మ్యాచ్‌కు కూడా మాంచెస్టర్‌ యునైటెడ్‌ అతన్ని పక్కన పెట్టింది. రొనాల్డో అనారోగ్యంతో బాధపడుతున్నాడని టీమ్‌ చెప్పినా.. అతని ఇంటర్వ్యూని బట్టి చూస్తే టీమ్‌తో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూ తర్వాత మాంచెస్టర్‌ టీమ్‌లో అతడు కొనసాగడం అనుమానమే.

ఆ మధ్య టోటెన్‌హామ్‌ హాట్‌స్పర్‌తో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా రావాల్సిందిగా మేనేజర్‌ టెన్‌ హాగ్‌ కోరినా రొనాల్డో నిరాకరించాడు. దీంతో అతన్ని సస్పెండ్‌ చేశాడు. దీనిపై రొనాల్డో స్పందిస్తూ.. "నాకు టెన్‌ హాగ్‌పై గౌరవం లేదు. ఎందుకంటే అతడు నన్ను గౌరవించడు. నాపై గౌరవం లేనప్పుడు నేను గౌరవించను" అని స్పష్టం చేశాడు.

గతేడాది రొనాల్డో మాంచెస్టర్‌ యునైటెడ్‌కు తిరిగి వచ్చాడు. 12 ఏళ్ల పాటు రియల్‌ మాడ్రిడ్‌, జువెంటస్‌ టీమ్స్‌కు ఆడిన తర్వాత 2021లో అతడు మళ్లీ తన పాత టీమ్‌తో చేరాడు. అయితే ఏడాదిలోపే అతడు వేరే క్లబ్స్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాడన్న ఆరోపణలు వచ్చాయి. కానీ ఇది మేనేజర్‌ టెన్‌ హాగ్‌ పనేనని రొనాల్డో ఆరోపించాడు. తనను బలవంతంగా బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించాడు.

మేనేజర్‌ ఒక్కడే కాదని, మరో ఇద్దరు, ముగ్గురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో ఉన్న వాళ్లు కూడా అదే పనిలో ఉన్నట్లు చెప్పాడు. తనకు నమ్మక ద్రోహం చేశారని, కొంతమందికి తాను టీమ్‌లో ఉండటం ఇష్టం లేదని ఆరోపించాడు. ఇక తాను క్లబ్‌ను వీడి తిరిగి వచ్చినా కూడా టీమ్‌లో మాత్రం ఎలాంటి పురోగతి లేదని, ఏ మార్పూ కనిపించడం లేదని కూడా అన్నాడు.

WhatsApp channel

టాపిక్