Siraj rested: సిరాజ్‌కు రెస్ట్.. ఇండియాకు తిరిగొచ్చేసిన స్టార్ బౌలర్
Siraj rested: సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చింది ఇండియన్ టీమ్ మేనేజ్‌మెంట్. దీంతో అతడు వెస్టిండీస్ నుంచి ఇండియాకు తిరిగొచ్చేశాడు. అతనిపై పనిభారం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Siraj rested: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు వెస్టిండీస్ తో వన్డే సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చారు. ప్లేయర్స్ పై పనిభారాన్ని తగ్గించే ఉద్దేశంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఎస్పీఎన్‌క్రికిన్ఫో రిపోర్ట్ వెల్లడించింది. నిజానికి సీనియర్ బౌలర్లు బుమ్రా, షమి లేకపోవడంతో వన్డే సిరీస్ లో సిరాజే పేస్ బౌలింగ్ దాడిని లీడ్ చేస్తాడని భావించారు.
కానీ సిరాజ్ కు విశ్రాంతినివ్వాలన్న టీమ్ నిర్ణయం ఆశ్చర్యపరిచింది. వెస్టిండీస్ తో జరిగిన రెండు టెస్టుల్లోనూ అతడు ఆడాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీసుకున్నాడు. టీమ్ లోని సీనియర్ పేస్ బౌలర్ గా సిరాజ్ తన పాత్రను సరిగ్గా పోషించాడు. వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వడంతో సిరాజ్ ఇండియాకు తిరిగి వచ్చేశాడు.
సిరాజ్ స్థానంలో ఎవరన్నదానిపై సెలక్టర్లు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కూడా ఆ రిపోర్టు వెల్లడించింది. ఇప్పుడీ హైదరాబాదీ బౌలర్ లేకపోవడంతో ప్రస్తుతం వెస్టిండీస్ లో ఉన్న జట్టులో జైదేవ్ ఉనద్కట్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, ముకేశ్ కుమార్ ఉన్నారు. సిరాజ్ ను ఇప్పటికే విండీస్ తో జరగబోయే ఐదు టీ20ల సిరీస్ కు ఎంపిక చేయలేదు.
వచ్చే నెల 30 నుంచి ఆసియా కప్, తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్, వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కీలకమైన ప్లేయర్స్ కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. సిరాజ్ ఈ ఏడాది మొదటి నుంచీ శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో అన్ని వన్డేలు ఆడాడు. తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నాలుగు టెస్టులు, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్, వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్.. ఇలా గ్యాప్ లేకుండా ఆడుతూనే ఉండటంతో సిరాజ్ కు బ్రేక్ ఇచ్చారు.
మరోవైపు బుమ్రా తిరిగి వస్తున్నాడన్న వార్తల నేపథ్యంలో ఆసియా కప్ కు టీమిండియా పేస్ బౌలింగ్ అటాక్ మరింత బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. బుమ్రా, షమి, సిరాజ్ కలిస్తే ఆసియా కప్, వరల్డ్ కప్ లలో ఇండియన్ టీమ్ కు తిరుగుండదు. ఒకవేళ బుమ్రా వచ్చే అవకాశాలు లేకపోతే సిరాజ్ పూర్తి ఫిట్ గా, ఫ్రెష్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సంబంధిత కథనం