Narendra Modi: పీఎం మోదీని కలిసిన కామన్వెల్త్ గేమ్స్ విజేతలు.. ప్రధాని ప్రశంసలు-commonwealth games indian medalists meets with prime minister narendra modi ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Narendra Modi: పీఎం మోదీని కలిసిన కామన్వెల్త్ గేమ్స్ విజేతలు.. ప్రధాని ప్రశంసలు

Narendra Modi: పీఎం మోదీని కలిసిన కామన్వెల్త్ గేమ్స్ విజేతలు.. ప్రధాని ప్రశంసలు

Maragani Govardhan HT Telugu
Aug 13, 2022 03:13 PM IST

కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులు శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. తన నివాసంలో కలిసిన క్రీడాకారులపై ప్రశంసల వర్షం కురింపించారు పీఎం. దేశానికి గర్వంగా నిలిచారని, ఇది ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కామన్వెల్త్ గేమ్స్ పతకాల విజేతలు
ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన కామన్వెల్త్ గేమ్స్ పతకాల విజేతలు (PTI)

బర్మింగ్హామ్ వేదికగా ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ 61 పతాకలతో నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు 23 కాంస్యాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ గడ్డపై అదిరిపోయే ప్రదర్శనతో దిగ్విజయంగా పోటీలను ముగించుకున్న భారత అథ్లెట్లకు.. మనదేశంలో సాదర స్వాగతం లభించింది. తాజాగా కామన్వెల్త్ గేమ్స్ పతకాల విజేతలు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. శనివారం నాడు ఆయన నివాసంలో క్రీడాకారులను కలుసుకున్న ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వారితో కలిసి కాసేపు ముచ్చటించారు.

“మీరందరూ మీ షెడ్యూల్‌ను వదులుకుని కుటుంబ సభ్యుల వలే నా నివాసానికి విచ్చేసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. మిగిలిన భారతీయలందరి మాదిరిగానే నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మీ అందరికీ సాదరం స్వాగతం పలుకుతున్నాను. ఈ విజయం మన యువశక్తికి ఆరంభం మాత్రమే. భారతదేశ క్రీడల స్వర్ణయుగం ఇప్పుడే ప్రారంభమైంది. గత కొన్ని వారాల్లో మననదేశం క్రీడారంగంలో రెండు ప్రధాన విజయాలను అందుకుంది. కామన్వెల్త్ ప్రదర్శనే కాకుండా చారిత్రాత్మక చెస్ ఒలింపియాడ్‌కు కూడా మనదేశం నిర్వహించింది. ఆతిథ్యమివ్వడమే కాకుండా చెస్ గొప్ప సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేశారు మన క్రీడాకారులు. చెస్ ఒలింపియాడ్‌లో పతకాలు సాధించినవారందరికీ అబినందిస్తున్నాను." అని మోదీ స్పష్టం చేశారు.

కామన్వెల్త్ పతకాల వీరులు మోదీని కలిసిన విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్ వేదికగా షేర్ చేసింది.

ఈ కామన్వెల్త్ గేమ్స్‌లో తొలిసారిగా పాల్గొన్న మహిళల క్రికెట్ జట్టు రజతం పతకం సాధించింది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. పీవీ సింధు, బజరంగ్ పునియా, వినీశ్ ఫొగాట్ లాంటి స్టార్ క్రీడాకారులు గోల్డ్ కైవసం చేసుకోవడం ఈ సారి ప్రత్యేకం. పతకాల వారీగా చూస్తే భారత్ మొత్తం 61 మెడల్స్ గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది. 22 స్వర్ణాలు, 15 రజతాలు, 23 కాంస్యాలు దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన కామన్వెల్త్ పోటీల్లో చూసుకుంటే ఇది ఐదో అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు 2010లో 101 పతకాలతో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం