CM KCR Esha Singh: ఆసియా క్రీడల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డ.. సీఎం కేసీఆర్ ప్రశంసలు
CM KCR About Esha Singh: చైనా వేదికగా జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్స్ సత్తా చాటుతున్నారు. తాజాగా తెలంగాణ క్రీడాకారిణి ఇషా సింగ్ మరో రెండు సిల్వర్ మెడల్స్ సాధించగా.. ఆమెపై ప్రశంసలు కురిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
CM KCR About Esha Singh Asian Games 2023: చైనాలో కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో తెలంగాణ క్రీడాకారిణి ఇషా సింగ్ మరో రెండు సిల్వర్ మెడల్స్ దక్కించుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ విభాగంలో రెండు వెండి పథకాలను సాధించి, ఆసియా క్రీడల్లో వరుసగా మొత్తం నాలుగు పథకాలను దక్కించుకున్న క్రీడాకారిణిగా ఇషా సింగ్ చరిత్ర సృష్టించిందని సీఎం అన్నారు.
ఈ సందర్భంగా ఇషా సింగ్‌ను తెలంగాణ బిడ్డ ఘనత సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఏషియా క్రీడల్లో ఇషా సింగ్ రాణిస్తూ, తెలంగాణతో పాటు దేశ ఖ్యాతిని మరోసారి చాటారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇషా సింగ్ తెలంగాణకు గర్వకారణం అని కొనియాడారు. ఇషా సింగ్ బృందం 1759 పాయింట్లతో భారత్‌కు స్వర్ణం తీసుకొచ్చి సత్తా చాటడమే కాకుండా, వ్యక్తిగత ఈవెంట్‍లో రజతం సాధించడం ఆమె ప్రతిభకు నిదర్శణమని ప్రశంసించారు.
అలాగే తెలంగాణ క్రీడాకారులు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని సీఎం కేసీఆర్ ఆకాక్షించారు. కాగా 18 ఏళ్ల ఇషా సింగ్ హైదరాబాద్‍కు చెందిన సచిన్ సింగ్, శ్రీలతల కుమార్తె. ఇషాకు షూటింగ్ కంటే ముందు గో కార్టింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, స్కేటింగ్ క్రీడల్లో కూడా ప్రవేశం ఉంది. గచ్చిబౌలి స్టేడియంలో షూటింగ్ రేంజ్‌ను చూసిన తర్వాత ఆ క్రీడ పట్ల ఆసక్తి చూపి కెరియర్‌గా ఎంచుకున్నారు.
ఇదిలా ఉంటే ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 30 పతకాలు సాధించింది. వీటిలో 8 స్వర్ణాలు, 12 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో భారత్ ఆసియన్ గేమ్స్ 2023లో ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇక మొదటి ప్లేసులో చైనా, రెండో స్థానంలో జపాన్, మూడో ర్యాంకింగ్‍లో సౌత్ కొరియా ఉన్నాయి.