Asian Games Badminton: చరిత్ర సృష్టించిన సాత్విక్, చిరాగ్.. స్వర్ణం కైవసం
Satwik - Chirag: ఏషియన్ గేమ్స్‌లో భారత్‍కు మరో స్వర్ణ పతకం వచ్చింది. భారత బ్యాడ్మింటన్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ గోల్డ్ సాధించి.. చరిత్ర సృష్టించారు.
Satwik - Chirag Asian Games: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి చరిత్ర సృష్టించారు. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకంతో మెరిశారు. బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో చిరాగ్ - సాయిరాజ్ ద్వయం స్వర్ణ పతకంతో సత్తాచాటింది. నేడు (అక్టోబర్ 7) జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‍లో చిరాగ్ శెట్టి - సాత్విక్ సాయిరాజ్ జోడీ 21-18, 21-16 తేడాతో వరుస గేమ్‍ల్లో కొరియా ద్వయం చోయి సోల్ గ్యు, కిమ్ వోన్ హొను చిత్తు చేసింది. ఏషియన్ గేమ్స్ చరిత్రలో బ్యాడ్మింటన్‍లో భారత్ స్వర్ణ పతకం సాధించడం ఇదే తొలిసారి. ఈ ఘనతను సాధించి చరిత్ర సృష్టించారు చిరాగ్ శెట్టి - సాత్విక్ సాయిరాజ్.
బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఫైనల్‍లో భారత ద్వయం చిరాగ్ - సాత్విక్ తొలి గేమ్‍లో ఓ దశలో 15-18తో వెనుకబడ్డారు. అయితే, ఆ దశలో పుంజుకున్నారు. కొరియా జోడీకి చెమటలు పట్టించారు. వరుస పాయింట్లతో సత్తాచాటారు. దీంతో 21-18తో తొలి గేమ్‍ను చిరాగ్ - సాత్విక్ సొంతం చేసుకున్నారు. ఇక రెండో గేమ్‍లో ఆరంభం నుంచే భారత షటర్లు జోరు చూపించారు. ఆసాంతం ఆధిపత్యం చూపారు. చివరికి 21-16తో గేమ్ గెలిచారు. వరుస గేమ్‍ల్లో ఫైనల్ గెలిచి.. స్వర్ణ పతకాన్ని చిరాగ్ - సాత్విక్ జోడీ కైవసం చేసుకుంది. చరిత్ర సృష్టించింది.
చిరాగ్ శెట్టి - సాత్విక్ సాయిరాజ్ పురుషుల డబుల్స్‌లో రెండేళ్లుగా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. కామన్‍వెల్త్ క్రీడల్లో స్వర్ణం, థామస్ కప్ గోల్డ్, 2022 ప్రపంచ చాంపియన్‍షిప్‍లో కాంస్య పతకం సాధించారు. అలాగే, చాలా టోర్నీల్లో గెలిచి రికార్డులు సృష్టించింది చిరాగ్ - సాత్విక్ జోడీ.
ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఇప్పటి వరకు (అక్టోబర్ 7, మధ్యాహ్నం) 101 పతకాలు సాధించింది. ఇందులో 26 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలు ఉన్నాయి.