Chess World Cup Prize Money: చెస్ వరల్డ్ కప్.. గెలిస్తే ప్రజ్ఞానంద ఎంత సంపాదిస్తాడో తెలుసా?
Chess World Cup Prize Money: చెస్ వరల్డ్ కప్ గెలిస్తే ప్రజ్ఞానంద ఎంత సంపాదిస్తాడో తెలుసా? గురువారం (ఆగస్ట్ 24) జరగబోయే టై బ్రేకర్ లో అతడు మాగ్నస్ కార్ల్‌సన్ తో తలపడనున్నాడు.
Chess World Cup Prize Money: చెస్ వరల్డ్ కప్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన ఇండియన్ చెస్ సెన్సేషన్ ప్రజ్ఞానంద ఒకవేళ టైటిల్ గెలిస్తే భారీగా ప్రైజ్ మనీ అందుకోనున్నాడు. ఇప్పటికే ఫైనల్లో జరగిన తొలి రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగియడంతో గురువారం (ఆగస్ట్ 24) టైబ్రేకర్ నిర్వహించనున్నారు. ర్యాపిడ్ ఫార్మాట్ లో జరగనున్న ఈ గేమ్ గెలిచిన వారు టైటిల్ అందుకుంటారు.
అయితే ఈ చెస్ వరల్డ్ కప్ గెలిచిన వారికి ప్రైజ్ మనీ రూపంలో భారీ మొత్తం అందనుంది. విజేతకు 1.1 లక్షల డాలర్లు (సుమారు రూ.90.93 లక్షలు), రన్నరప్ కు 80 వేల డాలర్లు (సుమారు రూ.66.13 లక్షలు) అందుతాయి. చెస్ వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ మనీ రూ.15.13 కోట్లు. ఈ వరల్డ్ కప్ టైటిల్ కోసం 32 ఏళ్ల కార్ల్‌సన్, 18 ఏళ్ల ప్రజ్ఞానంద తలపడబోతున్నారు.
నిజానికి ఈ ఇద్దరూ చెస్ వరల్డ్ కప్ లో తొలిసారి ఆడుతూనే ఫైనల్ చేరడం విశేషం. ఈ ఇద్దరి మధ్య జరిగిన తొలి గేమ్ 35 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. ఇక రెండో గేమ్ లో కూడా 30 ఎత్తుల తర్వాత ఇద్దరు ప్లేయర్స్ డ్రాకు అంగీకరించారు. క్లాసికల్ గేమ్స్ లో విజేత తేలకపోవడంతో ర్యాపిడ్ ఫార్మాట్ నిర్వహించనున్నారు. ఒకవేళ ఇందులోనూ విజేత తేలకపోతే బ్లిట్జ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.
ఈ టైబ్రేకర్ ర్యాపిడ్ ఫార్మాట్లో జరుగుతుంది. ఒక్కో ప్లేయర్ కు 25 నిమిషాల టైమ్ కంట్రోల్ ఉంటుంది. ఒక్కో ఎత్తుకు 10 సెకన్ల పెంపును అందుకుంటారు. ఒకవేళ ఇందులోనూ విజేత తేలకపోతే బ్లిట్జ్ గేమ్ ద్వారా విజేతను తేలుస్తారు. సెమీఫైనల్లో వరల్డ్ నంబర్ 3 అయిన ఫాబియానో కారువానాకు షాకిచ్చిన ప్రజ్ఞానంద.. చెస్ ప్రపంచాన్ని షాక్ కు గురి చేశాడు. ప్రస్తుతం అతడు 2707 ఫిడే రేటింగ్ తో 29వ ర్యాంకులో ఉన్నాడు.
టాపిక్