Asian Games Day 8: ఒకే రోజు భారత్‍కు 15 పతకాలు.. హాఫ్ సెంచరీ దాటిన మెడల్స్
Asian Games Day 8: ఏషియన్ గేమ్స్‌లో 8వ రోజే భారత పతకాల సంఖ్య 50 దాటింది. ఏకంగా ఒకే రోజు 15 పతకాలను భారత కైవసం చేసుకుంది.
Asian Games October 1: ఏషియన్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. చైనాలో హాంగ్జౌలో జరుగుతున్న 19వ ఏషియన్ క్రీడల్లో ఇండియా ప్లేయర్లు దూసుకెళుతున్నారు. గేమ్స్ 8వ రోజైన నేడు (అక్టోబర్ 1) ఇండియాకు మూడు స్వర్ణాలు సహా 15 పతకాలు వచ్చాయి. దీంతో ఏషియన్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య హాఫ్ సెంచరీ దాటి.. 53 (13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలు)కు చేరుకుంది. ఈసారి ఆసియా క్రీడల్లో 100 పతకాలు సాధించాలన్న భారత్ టార్గెట్ నెలవేరేలా కనిపిస్తోంది. అక్టోబర్ 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. నేడు భారత్ సాధించిన 15 పతకాల వివరాలివే..
నేడు భారత్‍కు వచ్చిన పతకాలు
- నేడు (అక్టోబర్ 1) షూటింగ్ పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‍లో ఇండియాకు స్వర్ణ పతకం వచ్చింది. జోర్వార్ సింగ్, కినన్ డరియస్ చెనై, పృథ్వి రాజ్ తొండిమాన్‍తో కూడిన భారత జట్టు గోల్డ్ గెలిచింది.
- 3000 మీటర్ల స్టీపుల్‍చేజ్‍లో భారత అథ్లెట్ అవినాశ్ సేబల్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
- షార్ట్ పుట్‍లో ఇండియా అథ్లెట్ తేజిందర్ పాల్ సింగ్ తూర్.. గోల్డ్ మెడల్ సాధించాడు. చివరి త్రోలో 20.36 మీటర్లు విసిరి బంగారు పతకం దక్కించుకున్నాడు.
- గోల్ఫ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ప్లేయర్ అదితి అశోక్ రజత (సిల్వర్) పతకం సాధించింది.
- మహిళల 100 మీటర్ల హర్డుల్స్ విభాగంలో భారత అథ్లెట్, తెలంగాణ అమ్మాయి జ్యోతి ఎర్రాజీ రజత పతకాన్ని కైవసం చేసుకుంది.
- బ్యాడ్మింటన్ పురుషుల టీమ్ ఈవెంట్‍లో భారత్‍కు వెండి పతకం దక్కింది.
- పురుషుల లాంగ్ జంప్‍లో భారత అథ్లెట్ శ్రీశంకర్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్‍లో 8 మీటర్లు జంప్ చేసి మెడల్ దక్కించుకున్నాడు.
- 1500 మీటర్ల మహిళల పరుగులో భారత అథ్లెట్ హర్మిలన్ బైన్స్ వెండి పతకాన్ని సాధించింది.
- షూటింగ్ మహిళల ట్రాప్ ఈవెంట్‍లో భారత్‍కు రజత పతకం దక్కింది. రాజేశ్వరి కుమారి, మనీశా కీర్, ప్రీతి రజక్‍తో కూడిన ఇండియన్ టీమ్ వెండి మెడల్ దక్కించుకుంది.
- పురుషుల 1500 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ అజయ్ కుమార్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
- మహిళల హెప్టథ్లాన్‍లో ఇండియన్ అథ్లెట్, తెలంగాణ అమ్మాయి అగసర నందిని కాంస్య (Bronze) పతకాన్ని కైవసం చేసుకుంది.
- భారత స్టార్ బాక్సర్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. 50 కేజీల బాక్సింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. సెమీస్‍లో ఓడిన తెలంగాణ బాక్సర్ నిఖత్.. బ్రాంజ్‍తోనే సరిపెట్టుకుంది.
- మహిళల డిస్కస్ త్రోలో భారత ప్లేయర్ సీమా పునియా కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
- పురుషుల 1500 మీటర్ల పరుగులో ఇండియన్ అథ్లెట్ జిన్సన్ జాన్సర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
- షూటింగ్ పురుషుల ట్రాప్ వ్యక్తిగత ఈవెంట్‍లో భారత షూటర్ కినాన్ డరియుస్ చెనై కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
ఇలా.. అక్టోబర్ 1న ఒక్క రోజే భారత్‍కు ఇప్పటి వరకు 15 పతకాలు వచ్చాయి. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఇండియాకు ఒకే రోజు 15 పతకాలు రావడం ఇదే తొలిసారి.
ప్రస్తుత ఏషియన్ గేమ్స్‌లో ఇండియా ఇప్పటి వరకు (అక్టోబర్ 1, సాయంత్రం) 53 పతకాలు గెలుచుకొని.. మెడల్స్ టేబుల్‍లో నాలుగో స్థానంలో ఉంది. 242 పతకాలతో చైనా టాప్‍లో ఉంది. 100 పతకాలు గెలువాలన్న లక్ష్యంతో 19వ ఏషియన్ క్రీడల్లోకి భారత్ అడుగుపెట్టింది. అక్టోబర్ 8వ తేదీ వరకు క్రీడలు జరగనుండటంతో అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.