Who is Vivrant Sharma: వివ్రాంత్ శర్మ ఎవరు? సన్‌రైజర్స్ అతడిని భారీ మొత్తానికి ఎందుకు కొనుగోలు చేసింది?-all you need to know about this vivrant sharma who sold for rs 2 6 cr for srh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Who Is Vivrant Sharma: వివ్రాంత్ శర్మ ఎవరు? సన్‌రైజర్స్ అతడిని భారీ మొత్తానికి ఎందుకు కొనుగోలు చేసింది?

Who is Vivrant Sharma: వివ్రాంత్ శర్మ ఎవరు? సన్‌రైజర్స్ అతడిని భారీ మొత్తానికి ఎందుకు కొనుగోలు చేసింది?

Maragani Govardhan HT Telugu
Dec 23, 2022 06:19 PM IST

Who is Vivrant Sharma: ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అన్ క్యాప్డ్ ప్లేయర్‌పై భారీగా ఖర్చు చేసింది. జమ్మూ-కశ్మీర్ ఆల్ రౌండరైన ఈ ప్లేయర్‌పై రూ.2.6 కోట్లు వెచ్చించింది.

వివ్రాంత్ శర్మ
వివ్రాంత్ శర్మ

Who is Vivrant Sharma: ఐపీఎల్ 2023 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంతమంది ఆటగాళ్లపై భారీ మొత్తాన్ని వెచ్చించింది. ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్‌పై రూ.13.25 కోట్ల ఖర్చు చేసిన హైదరాబాద్ జట్టు.. భారత ఆటగాడు మయాంక్ అగర్వాల్‌పై రూ.8.25 కోట్లను ఖర్చు చేసింది. అయితే వీరంతా అంతర్జాతీయ క్రికెటర్లు ఆ రేటు పలికే అవకాశముంది. కానీ ఓ అన్ క్యాప్డ్ ప్లేయర్‌పై ఆరెంజ్ ఆర్మీ ఏకంగా రూ.2.6 కోట్లు ఖర్చు చేసింది. జమ్ము, కశ్మీర్‌కు చెందిన ఆల్ రౌండర్ వివ్రాంత్ శర్మను ఈ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇంత వరకు అంతర్జాతీయ అనుభవం లేని ఇతడిపై ఇంత ఎందుకు ఖర్చు చేసిందాని హైదరాబాద్ అభిమానులు శోధిస్తున్నారు.

24 ఏళ్ల ఈ యువ ఆల్ రౌండర్ జమ్మూ, కశ్మీర్ స్టేట్ టీమ్ తరఫున 2 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు, 14 లిస్ట్-ఏ మ్యాచ్‌లు సహా 9 టీ20లు ఆడాడు. ఓ వారం క్రితమే రంజీల్లో అరంగేట్రం చేసిన వివ్రాంత్ మధ్యప్రదేశ్‌తో తన తొలి మ్యాచ్ ఆడాడు. లిస్ట్-ఏ కెరీర్‌ను 2021లో ప్రారంభించగా.. టీ20 కెరీర్‌ను కూడా అదే ఏడాది హైదరాబాద్‌తో ఆడాడు.

రెండు రంజీ మ్యాచ్‌లు ఆడిన వివ్రాంత్ 72 పరుగులు చేశాడు. 50 ఓవర్ల క్రికెట్‌లో 14 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. అంతేకాకుండా 9 టీ20లు ఆడి 191 పరుగులు సహా 6 వికెట్లు పడగొట్టాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. గత నెల 23న లిస్ట్-ఏ ఓ మ్యాచ్‌లో జమ్మూ-కశ్మీర్ తరఫున అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. 124 బంతుల్లోనే 154 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. అంతేకాకుండా ఓ వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ దృష్టిని ఆకర్షించి వేలంలో భారీ మొత్తానికి అమ్ముడుపోయాడు.

వివ్రాంత్ శర్మ కనీస ధర రూ.20 లక్షలు కాగా.. సన్‌రైజర్స్ జట్టు అతడిని ఏకంగా రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో సన్ రైజర్స్ అభిమానులు ఈ క్రికెటర్ గురించి నెట్టింట ఆరా తీయడం ప్రారంభించారు. మరి ఇంత భారీ మొత్తానికి దక్కించుకున్న వివ్రాంత్ వచ్చే ఐపీఎల్‌లో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.

Whats_app_banner

సంబంధిత కథనం