Rohit Sharma: మ్యాచ్ అయితే గెలవనీ.. శార్దూల్ పని చెబుతా అని రోహిత్ అన్నాడు!
ఆస్ట్రేలియా గడ్డపై కనీవినీ ఎరగని అత్యద్భుతమైన విజయం సాధించిన టీమిండియాపై "బందోమే థా దమ్" పేరుతో వూట్ సెలక్ట్ ఓ డాక్యుమెంటరీ సిరీస్ రిలీజ్ చేసింది. ఇందులో అప్పుడు జరిగిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఆ టీమ్‌లోని సభ్యులు పంచుకుంటున్నారు.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో 2020-21 టూర్‌లో సంచలన విజయం సాధించింది టీమిండియా. నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్ ఓడినా.. చివరికి 2-1తో సిరీస్ గెలిచింది. అందులోనూ చివరిదైన గబ్బా టెస్ట్‌లో 32 ఏళ్లుగా ఆ గ్రౌండ్‌లో అజేయంగా ఉన్న ఆతిథ్య ఆస్ట్రేలియాను మట్టి కరిపించడం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది.
ఆ సిరీస్‌లో హనుమ విహారీ, అశ్విన్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్‌లాంటి యువ ఆటగాళ్లు ఈ ఊహకందని విజయాన్ని సాధించి పెట్టడం విశేషం. అయితే అదే సిరీస్‌లో, ఈ సంచలన విజయం సాధించిన గబ్బా టెస్ట్‌లోనే రోహిత్ శర్మకు తీవ్ర ఆగ్రహం తెప్పించాడు శార్దూల్ ఠాకూర్. ఈ ఆల్‌రౌండర్ ఎన్నోసార్లు టీమిండియాను తన బౌలింగ్, బ్యాటింగ్‌లతో ఆదుకున్నాడు.
గబ్బా టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ అతడు హాఫ్ సెంచరీ చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన సమయంలో ఓ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. ఇదే రోహిత్‌కు కోపం తెప్పించినట్లు తాజాగా ఈ డాక్యుమెంటరీలో రహానే వెల్లడించాడు. మయాంక్ అగర్వాల్, సుందర్‌ల వికెట్లు వెంటవెంటనే పడిన సందర్భంలో క్రీజులోకి వెళ్లిన శార్దూల్.. ఓ నిర్లక్ష్యపు షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు.
"సుందర్ ఔటవగానే శార్దూల్ క్రీజులోకి వెళ్తున్నాడు. ఆ సమయంలోనే నువ్వు హీరో అవడానికి ఇదే మంచి అవకాశం అని రోహిత్ అతనితో చెప్పాడు. అతడు తలాడించి వెళ్లిపోయాడు" అని రహానే చెప్పాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న అశ్విన్ అందుకుంటూ.. "శార్దూల్ వెళ్లే ముందు ఫినిష్ చేసెయ్ అని రోహిత్ చెప్పాడు. అయితే శార్దూల్ ఏం ఆలోచించాడో నాకు తెలుసు. ధోనీ సిక్స్ కొట్టి వరల్డ్‌కప్ అందించాడు అనే రవిశాస్త్రి మాటను శార్దూల్ గుర్తు చేసుకుని ఉంటాడు. అందుకే శార్దూల్ ఆ షాట్ ఆడాడు. అయితే అతడు ఔట్ కావడంతో అందరూ షాక్ తిన్నారు" అని చెప్పాడు.
ఇక ఆ తర్వాత రహానే మాట్లాడుతూ.. "రోహిత్ నా పక్కనే కూర్చున్నాడు. మ్యాచ్ ముగియని.. మనం గెలిచిన తర్వాత శార్దూల్‌కు గుణపాఠం చెబుతా అని అన్నాడు. వదిలెయ్.. మ్యాచ్ ముగిసిన తర్వాత చూసుకుందాం అని నేను అన్నాను" అని చెప్పాడు.
సంబంధిత కథనం