Crystal tortoise: క్రిస్టల్ తాబేలు ఇంట్లో ఏ దిక్కున పెట్టుకుంటే మంచిది
Crystal tortoise: తాబేలు చిహ్నం ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఎటువంటి సమస్యలకి ఎలాంటి తాబేలు చిహ్నం పెట్టుకుంటే మేలు జరుగుతుంది.
crystal tortoise: చాలా మంది ఇల్లు, షాపులు, ఆఫీసు టేబుల్ మీద క్రిస్టల్ తాబేలు పెట్టుకుని ఉండటం చూస్తూనే ఉంటారు. నీళ్ళు పోసి క్రిస్టల్ తాబేలు పెట్టి అందులో కొంతమంది గులాబీ రేకులు వేస్తారు. చూసేందుకు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో తాబేలు ప్రతిమ పెట్టుకుంటే చాలా మంచిది. ఫెంగ్ షూయిలో తాబేలు చిహ్నానికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. పురాణాల ప్రకార సాగర మథనం సమయంలో విష్ణువు తాబేలు అవతారాన్ని తీసుకున్నాడు. అందుకే కూర్మావతారంలో ఉన్న విష్ణువుని పూజిస్తారు. తాబేలు ఇంటికి ఆనందం, విజయాన్ని అందిస్తుందని నమ్ముతారు. ఒక్కో రకమైన తాబేలుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంది. ఇల్లు లేదా ఆఫీసు ప్రవేశ ద్వారం వల్ల తాబేలు ఉంచినట్టయితే ప్రతికూల శక్తి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఎటువంటి తాబేలు పెట్టుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారో తెలుసుకుందాం.
క్రిస్టల్ తాబేలు
తాబేలు సంపదని సూచిస్తుంది. ఇంట్లో లేదంటే దుకాణాల్లో క్రిస్టల్ తాబేలు ఉంచడం వల్ల ఆర్థిక అడ్డంకులని తొలగించడంలో సహాయపడుతుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుంది. క్రిస్టల్ తాబేలు ఇంట్లో పెట్టుకుంటే ఏవైనా వాస్తు దోషాలు ఉన్నా తొలగిపోయేలా చేస్తుంది. వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తర దిశలో తాబేలు బొమ్మ పెట్టుకోవాలి. ఈ దిక్కుని కుబేరుడు పరిపాలిస్తాడు. అందుకే అటువైపు పెట్టుకుంట ఆర్థికంగా బలపడతారు.
మెటల్ తాబేలు
మెటల్ తాబేలు ఉత్తరం లేదా వాయువ్య దిశలో అమార్చాలి. ఉత్తరాన ఉంచినప్పుడు పిల్లల జీవితం బాగుంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. వాయువ్య దిశలో ఉంటే మనసు చదువు మీద దృష్టి పెట్టేందుకు సహకరిస్తుంది.
చెక్క తాబేలు
వాస్తు శాస్త్రం ప్రకారం చెక్క తాబేలు తూర్పు లేదా ఆగ్నేయ మూలలో ఉంచాలి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మీ జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. విజయాలు సాధిస్తారు.
నిద్రలేమి తొలగిస్తుంది
జీవించి ఉన్న తాబేలు ఇంట్లో ఉంచుకుంటే చాలా శుభప్రదం. సమృద్ధిని సూచిస్తుంది. తాబేళ్లు విష్ణువు అవతారం. సజీవ తాబేలు మీ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే అది తిరిగేందుకు అవసరమైన విధంగా ఉండే ట్యాంక్ దాని కోసం ఏర్పాటు చేయాలి. అందులో కొన్ని నీటి మొక్కలు, ఇసుక ఉండేలా చూసుకోవాలి. తాబేలుకి సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య భాగంలో జీవించి ఉన్న తాబేలు పెట్టుకోవచ్చు.
ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. పడకగదిలో తాబేలు బొమ్మ పెట్టుకుంటే నిద్రలేమి సమస్యల నుంచి బయట పడతారు. కెరీర్ లో వృద్ధి సాధించాలనుకుంటే తాబేలు బొమ్మ ఉత్తర దిశలో పెట్టుకోండి. ఫెంగ్ షూయి ప్రకారం తాబేలు జ్ఞానం, ఓర్పు, దీర్ఘాయువుని సూచిస్తుంది.
తాబేలు ఎప్పుడు కొనుగోలు చేయవచ్చు
బుధ, గురు, శుక్రవారాలు ఇంట్లో తాబేలు విగ్రహాలు తెచ్చి పెట్టుకోవచ్చు. మంచి ముహూర్తం చూసి వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. దానికి కుంకుమ లేదా పసుపు పువ్వులు సమర్పించాలి.
రంగుల తాబేళ్ళ ప్రాముఖ్యత
పిల్లలు చదువులో వెనకబడి ఉంటున్నారా? అయితే వాళ్ళు చదువు మీద దృష్టి పెట్టాలంటే ఆకుపచ్చ రంగు తాబేలు వాళ్ళ స్టడీ రూమ్ లో పెట్టండి. చదువు పట్ల ఏకాగ్రత పెరుగుతుంది. నల్ల తాబేలు వ్యాపారంలో శ్రేయస్సు తీసుకురావడంతో సహాయపడుతుంది. కెరీర్ వృద్ధి చెందుతుంది. తెల్లని తాబేలు అధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరుస్తుంది.