Mahalaya pakshalu: మహాలయపక్షాల ప్రాధాన్యత ఏంటి? ఈరోజు ఏం చేయాలి?
Mahalaya pakshalu: సెప్టెంబర్ 17 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభం అవుతాయి. వీటి ప్రాధాన్యత ఏంటి? మహాలయ పక్షాల రోజుల్లో ఏం చేయాలి అనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Mahalaya pakshalu: భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు, బహుళ పక్షం పితృ దేవతా పూజకు విశిష్టమైనది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అనంటారు. అలాగే ఈ పక్షాన్ని 'మహాలయ పక్షం' అని కూడా అంటారు.
ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాన్నీ చేయరు. ఈ రోజు నుండి ఈ పక్షం ముగిసేంతవరకు ప్రతిరోజూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను నిర్వహించాలని శాస్త్రవచనం. ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారో, ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయినవారైతే ఈ పక్షం నవమినాడు తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ పదిహేను రోజులూ నియమ పూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి. మాతాపితృ వర్జితులైన వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి. ఆ ఒక్కరోజు కూడా అన్నశ్రాద్ధం చేయలేనివారు హిరణ్య శ్రాద్ధం చేయాలి. ఏమీ చేయలేని నిష్ఠ దరిద్రుడు, అరణ్యంలోకి వెళ్లి, ముళ్లకంచెను హత్తుకొని, పితృదేవతలనుద్దేశించి కన్నీరైనా కార్చవలెనని ధర్మశాస్త్రం చెప్తోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్