Ugadi Rasi Phalalu 2024: తులా రాశి ఉగాది రాశి ఫలాలు.. ఆదాయం 2, వ్యయం 8 పాళ్లు-tula rasi ugadi 2024 rasi phalalu krodhi nama samvatsara telugu year horoscope for libra zodiac sign ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Rasi Phalalu 2024: తులా రాశి ఉగాది రాశి ఫలాలు.. ఆదాయం 2, వ్యయం 8 పాళ్లు

Ugadi Rasi Phalalu 2024: తులా రాశి ఉగాది రాశి ఫలాలు.. ఆదాయం 2, వ్యయం 8 పాళ్లు

HT Telugu Desk HT Telugu
Mar 29, 2024 09:05 AM IST

Ugadi Rasi Phalalu 2024: తులా రాశి ఉగాది రాశి ఫలాలు పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. ప్రేమ జీవితం, ఆరోగ్యం, ఆర్థికం, కెరీర్ వంటి విషయాల్లో తెలుగు నూతన సంవత్సరం మీకు ఏవిధంగా ఉండబోతోందో తెలుసుకోండి. అలాగే నెలవారీ రాశి ఫలాలు, పరిహారాలు చదవండి.

Tula Rasi ugadi 2024 rasi phalalu: తులా రాశి ఉగాది రాశి ఫలాలు 2024
Tula Rasi ugadi 2024 rasi phalalu: తులా రాశి ఉగాది రాశి ఫలాలు 2024 (Pixabay)

2024-25 తులా రాశి వారికి శ్రీ కోధి నామ సంవత్సర ఫలితములు మధ్యస్తం నుంచి అనుకూలంగా ఉంటాయని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులా రాశి పరిధిలోకి వస్తారు.

శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరంలో తులా రాశి వారికి ఆదాయం 2 పాళ్లు, వ్యయం 8 పాళ్లు, రాజపూజ్యం 1 పాలు, అవమానం 5 పాళ్లు ఉన్నట్టు చిలకమర్తి వివరించారు.

ఈ సంవత్సరం బృహస్పతి 6వ స్థానమునందు సంచరించుటచేత, శని 5వ స్థానమునందు సంచరించుట చేత, రాహువు 6వ స్థానము యందు సంచరించుట చేత మరియు కేతువు వ్యయ స్థానమునందు సంచరించుట చేత తులారాశి వారికి శ్రీ క్రోధి సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నట్టు చిలకమర్తి వివరించారు.

పంచమ స్థానములో శని, ఆరవ స్థానములో రాహువు, వ్యయస్థానములో కేతువు అనుకూలంగా వ్యవహరించడం వలన తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి అష్టమ స్థానంలో గురుడి ప్రభావం చేత తులారాశి వారికి ఈ సంవత్సరం అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, చికాకులు వేధించును.

ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పని ఒత్తిళ్ళు అధికమగును. అయినప్పటికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన ఉద్యోగంలో అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి.

వ్యాపారంలో లాభములు కలిగినప్పటికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించు సూచన. రైతాంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి.

సినీ మరియు మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం పని ఒత్తిళ్ళు అధికముగా ఉంటాయి. అరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు అనుకూలించును. స్త్రీలు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలని సూచన. కుటుంబ సౌఖ్యం కలుగును.

తులా రాశి వారి ప్రేమ జీవితం 2024-25

తులా రాశి వారికి అష్టమ గురుని ప్రభావం వలన శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు, వ్యవహారాలకు అంత అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయములు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన.

తులా రాశి వారి ఆర్థిక భవిష్యత్తు 2024-25

తులారాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికపరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. అనవసర ఖర్చులు, చికాకులు అధికమగును. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు.

తులా రాశి వారి కెరీర్ 2024-25

తులారాశి వారికి ఈ సంవత్సరం కెరియర్‌పరంగా మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కెరీర్‌లో రాజకీయ ఒత్తిళ్ళు, సమస్యలు అధికమగును. అష్టమ గురుడి వలన కెరీర్‌లో సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏర్పడు సూచన.

తులారాశి వారి ఆరోగ్యం 2024-25

తులరాశి వారు ఈ సంవత్సరం అష్టమ గురుని ప్రభావం వలన అరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. రాజకీయ ఒత్తిళ్ల వల్ల మానసిక వేధన, అనారోగ్య సమస్యలు ఏర్చడు సూచన. ఆరోగ్యం కొరకు గురు దక్షిణామూర్తిని పూజించండి.

చేయదగిన పరిహారాలు

తులారాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే గురు దక్షిణామూర్తిని పూజించాలి. ప్రతిరోజు లేదా కనీసం గురువారం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, గురువారం రోజు శనగలను దానం ఇవ్వడం వలన మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దత్తాత్రేయుని పూజించాలని, నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించాలని సూచించారు.

ధరించాల్సిన నవరత్నం: తులారాశి వారు ధరించవలసిన నవరత్నం వజ్రం.

ప్రార్థించాల్సిన దైవం: తులా రాశి వారు ఆరాధించవలసిన దైవం లక్ష్మీదేవి.

తులా రాశి నెలవారీ రాశి ఫలాలు 2024-25

ఏప్రిల్‌: ఈ మాసం మీకు మధ్యస్థం నుండి అనుకూలం. అనుకోని చిక్కులలో పడతారు. మానసిక బాధలు ఏర్పడును. సంతాన సమస్యలు. శారీరక శ్రమ కలుగును.

మే: ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. శుభపరమైన ఖర్చులు. వ్యాపార అనుకూలత. నూతన వస్తువులు కొంటారు. కుటుంబపరమైన ఖర్చులు పెరుగుట. వాహనపరమైన ఇబ్బందులు. రుణ ప్రయత్నాలు ఫలించకపోవుట. మానసిక ఒత్తిళ్ళు.

జూన్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. పాత సమస్యలు తిరిగి సమస్యగా మారుట. బంధు విరోధము కలిగించును. ప్రయాణముల వలన అలసట. కోర్టు వ్యవహారాలు తేలకపోవుట. వ్యాపార, వృత్తి, ఉద్యోగాలలో కొంత అనుకూలం. వివాహ పరమైన లాభములు కలుగును.

జూలై: ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు. ధన వ్యయము పెరుగుట. భార్య యొక్క ఆరోగ్యము మందగించుట. నీటి సంబంధిత హాని. అభివృద్ధి కుంటుపడుట. స్త్రీ మూలక ధనాదాయము. ఎక్కువ ప్రేమించే పనులయందు లాభము. అనవసరపు ఆందోళన పెరుగును.

ఆగస్టు: ఈ మాసం తుల రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. శుభపరమైన ఖర్చులు. రాజకీయ నాయకులకు ఒత్తిళ్ళు. మిత్రుల వలన పెద్ద వారితో కలయిక. వివాహాది శుభకార్యములు ముందుకు సాగుట. సంఘంలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడును.

సెప్టెంబర్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. భూ సంబంధమైన వ్యవహారములలో జాగ్రత్త వహించుట మంచిది. ప్రేమ వ్యవహారములు ఫలించవు. అనుకోని సమస్యల వలన ఇంట కలహములు. కొన్ని వ్యాపారములు వృద్ధిగా సాగును. బంధుమిత్రుల కలయిక.

అక్టోబర్‌: ఈ మాసం మీకు మధ్యస్థ సమయం. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొంత అనుకూల సమయం. ప్రేమ వ్యవహారములు ఫలించవు. రాజకీయ నాయకులు నూతన పార్టీలో చేరే అవకాశం. స్థిరాస్తుల విషయములో కొంత జాగ్రత్త అవసరం.

నవంబర్‌: ఈ మాసం మీకు మధ్యస్థం. ఆదాయం బాగున్నప్పటికి వ్యాపారపరంగా ఇబ్బందులు కలుగును. పెద్దవారి ఆరోగ్యము ఆందోళన కలిగించును. దైవపరమైన యాత్రలు. ఇంట శుభకార్యక్రమ ఆలోచనలు సిద్ధిస్తాయి.

డిసెంబర్‌: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అధిక శ్రమచే కొన్ని పనులు పూర్తగును. బంధు విరోధములేర్పడు సూచన. వ్యాపారరంగం కొంత అనుకూలం. గృహ పనులు ముందుకు సాగుతాయి. ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించుట మంచిది.

జనవరి: ఈ మాసం తుల రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు. ఆర్థికపరమైన ఆటంకములు. పనులయందు ఒత్తిడి. మనోవిచారము. ఇష్ట స్త్రీ సాంగత్యం. నూతన గృహ విషయమై కొంత ఇబ్బంది. రోగములు ఇబ్బందిపెట్టును. ఇతరులతో మాటపడాల్సి వస్తుంది.

ఫిబ్రవరి: ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. గృహములకు సంబంధించిన ఇబ్బందులు. వ్యాపార, వృత్తి రంగాల వారికి కొంత అనుకూలం ఉన్నప్పటికి ఊహించిన లాభము లేకపోవుట.

మార్చి: ఈ మాసం తులా రాశి వారికి అనుకూలంగా లేదు. విద్యార్థులు కష్టపడాల్సిన సమయం. శుభ కార్యక్రమ ఆలోచనలు సిద్ధిస్తాయి. ఊహించని సంఘటనలు మనోధైర్యంతో ఎదుర్కొంటారు. దాయాదుల చర స్థిర ఆస్తి విషయములు చర్చకు వస్తాయి.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner