Devi Navaratri 2024: ఈ నవరాత్రులకు తప్పకుండా సందర్శించాల్సిన ప్రముఖ విశిష్ట దేవాలయాలు ఇవే-these are the famous unique temples that must be visited this navaratri ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Devi Navaratri 2024: ఈ నవరాత్రులకు తప్పకుండా సందర్శించాల్సిన ప్రముఖ విశిష్ట దేవాలయాలు ఇవే

Devi Navaratri 2024: ఈ నవరాత్రులకు తప్పకుండా సందర్శించాల్సిన ప్రముఖ విశిష్ట దేవాలయాలు ఇవే

Gunti Soundarya HT Telugu
Sep 30, 2024 01:51 PM IST

Devi Navaratri 2024: మరో రెండు రోజుల్లో దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ దసరా పండుగ సందర్భంగా మీరు ప్రముఖ ఆలయాలను సందర్శించాలని అనుకుంటే వీటికి వెళ్ళండి. ఇక్కడ నవరాత్రుల ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. మన దేశంలో ఉన్న వివిధ ఆలయాల జాబితా ఇది.

వైష్ణో దేవి ఆలయం
వైష్ణో దేవి ఆలయం (PTI)

Devi Navaratri 2024: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటారు. దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరించి భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ తొమ్మిది రోజులు దేశమంతా ఆధ్యాత్మిక భావనలో మునిగిపోతుంది.

ఈ నవరాత్రుల వేడుకలు ఒక్కో ప్రాంతంలో విభిన్న ఆచారాలు పాటిస్తారు. ఈ సందర్భంగా మీరు వివిధ ప్రదేశాలలో ఉన్న దుర్గాదేవి ఆలయాలను సందర్శించుకోవచ్చు. అక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలు తిలకించవచ్చు. మన దేశంలో ఉన్న ప్రాముఖ్య దుర్గాదేవి ఆలయాలు, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం.

ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయం 

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు దీరిన కనకదుర్గ ఆలయం అత్యంత ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ నవరాత్రుల ఉత్సవాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో దుర్గాదేవి భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు బారులు తీరాటారు. కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. అమ్మలగన్న అమ్మగా భక్తుల కోరికలు తీర్చే మూలపుటమ్మగా ఆదిపరాశక్తిని కొలుస్తారు. నవరాత్రుల సమయంలో ఆలయం విద్యుత్ దీపాల అలంకరణతో ధగధగలాడిపోతుంది. కొండ మీద నుంచి చూస్తే ఓ వైపు ప్రకాశం బ్యారేజ్, మరొకవైపు నగరం కనిపిస్తూ కనువిందు చేస్తుంది. 

శ్రీశైలం భ్రమరాంబిక దేవి ఆలయం 

దేశంలోనే అత్యంత మహిమాన్విత క్షేత్రాలలో ఒకటి శ్రీశైలం భ్రమరాంబిక దేవి ఆలయం. జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి ఇక్కడ కొలువై ఉండటం విశేషం. ఇక్కడ సతీదేవి మెడ భాగం పడినట్టు స్థల పురాణం చెబుతోంది. ఒక ప్రాంగణంలో జ్యోతిర్లింగం, భ్రమరాంబిక దేవి కొలువై ఉండటంతో ఇది ఎంతో విశేషకరమైనది. ఇక్కడ నవరాత్రుల ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి. భక్తులు వేలాది మంది అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తారు. నవదుర్గ అలంకారాలు తిలకించేందుకు భక్తులు తండోపాతండాలుగా వస్తారు. 

బాసర సరస్వతీ ఆలయం

తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న బాసరలోని ప్రముఖ సరస్వతీ ఆలయం దసరా శరన్నవరాత్రులకు సిద్ధమయ్యింది. నవరాత్రుల్లో ఆరో రోజు అమ్మవారి సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంలో తొమ్మిది రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. బాసరలో అక్షరాభ్యాసం చేయిస్తే చిన్నారులు విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. భారతదేశంలో ఉన్న రెండు ప్రధాన సరస్వతీ దేవి ఆలయాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

వైష్ణో దేవి ఆలయం, జమ్మూకశ్మీర్

జమ్మూ కశ్మీర్ లోని వైష్ణోదేవి స్వర్గధామ దేవాలయం. ఆధ్యాత్మికత, ప్రశాంతతను అందిస్తుంది. ఇక్కడ కొలువు దీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. నవరాత్రి సమయంలో ఇక్కడ వాతావరణంలో దైవికత ఉట్టిపడుతుంది. అమ్మవారి ఉత్సవాలను వైభవంగా జరిపే అద్భుతమైన ప్రదేశం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు 13 కి. మీ పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. పర్వతాల మధ్య ఉండే ఈ ఆలయం సుందర దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాయి.

ప్రధాన మందిరానికి మధ్యలో ఉన్న అర్ధకువారి గుహను తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం. వైష్ణో దేవి ఇక్కడ తొమ్మిది నెలల పాటు ధ్యానం చేసిందని నమ్ముతారు. యాత్రికులు తరచుగా ధ్యానం కోసం ఇక్కడ విరామం తీసుకుంటారు.

చాముండా దేవి ఆలయం, పాలంపూర్

చాముండా దేవి లేదా చాముండేశ్వరి ఆలయం పురాతన ఇతిహాసాలు, హిమాలయ అందాలు, ఆధ్యాత్మికత నెలకొన్న ప్రదేశం. హిమాచల్ వాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ చూడవచ్చు.. ఇది మరపురాని తీర్థయాత్ర అనుభవాన్ని మీకు ఇస్తుంది. చాముండా దేవి ఆలయం సుందరమైన పరిసరాల మధ్య ఉంది. ఆలయానికి పక్కనే మ్యూజియం కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి, ఆ ప్రాంత చరిత్రకు సంబంధించి కళాఖండాలు ఉంటాయి.

జ్వాలా జీ ఆలయం, హిమాచల్ ప్రదేశ్

ఈ పురాతన ఆలయం కాంతి దేవతకు అంకితం చేసింది. ఇక్కడ విగ్రహం లేదా దేవత ఉండదు. బదులుగా భక్తులు భూమినుంచి ఉద్భవించే సహజ జ్వాలలను పూజిస్తారు. నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి. ఈ జ్వాల శతాబ్దాలుగా నిరంతరం మండుతూనే ఉంటుందని నమ్ముతారు. నవరాత్రి సమయంలో ఆలయం ప్రత్యేక పూజలు, యజ్ఞాలు నిర్వహిస్తారు.

కర్ణి మాత ఆలయం, రాజస్థాన్

ఎలుకలు దేవుళ్ళుగా ఉండే దేవాలయం గురించి ఎప్పుడైనా విన్నారా? అది మరెక్కడో లేదు మన రాజస్థాన్ లో ఉంది. ఈ కర్ణి మాత ఆలయంలో సుమారు పాతిక వేలకు పైగా నల్ల ఎలుకలు ఉన్నాయి. వీటిని భక్తులు పూజిస్తారు. మీరు కనుక అదృష్టవంతులు అయితే వాటిలో ఉన్న నాలుగు తెల్ల ఎలుకలు మీకు కనిపిస్తాయి. ఇవి ప్రత్యేకంగా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ ఆలయం మొఘల్ వాస్తు శిల్పానికి అందమైన ఉదాహరణ. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కర్ణి మాత ఆలయం ప్రత్యేకమైన ఎలుక పూజకు ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలో వేల సంఖ్యలో ఎలుకలు స్వేచ్ఛగా సంచరిస్తు ఉంటాయి.

మహాకాళీ దేవి ఆలయం, ఉజ్జయిని

ఉజ్జయిని పురాణాలు, ఇతిహాసాలతో నిండిన నగరం. ఇక్కడ ఉన్న మహా కాళీ దేవి ఆలయం అద్భుతమైన మరాఠా నిర్మాణానికి అద్దం పడుతుంది. 726 స్తంభాలు మిణుకుమిణుకుమనే దీపాలతో అందంగా కనిపిస్తుంది. నవరాత్రుల సమయంలో తప్పక సందర్శించాల్సిన ఆలయాలలో ఇదీ ఒకటి. ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. జానపద నృత్యాలు, సంగీతం, పాట కచేరీలు ఉంటాయి.

అంబా మాత ఆలయం, గుజరాత్

ఈ ఆలయం అంబా దేవికి అంకితం చేశారు. దేశంలోని అత్యంత ముఖ్యమైన శక్తిపీఠాలలో ఒకటి. నవరాత్రి ఉత్సవాల సమయంలో గర్బా నృత్యం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. గర్బా నృత్యం లేకుండా గుజరాత్‌లో నవరాత్రులు అసంపూర్ణంగా ఉంటాయి.

మహాలక్ష్మీ దేవి ఆలయం, మహారాష్ట్ర

ముంబైలోని మహాలక్ష్మి దేవి ఆలయం చాలా పురాతనమైనది. నలుమూలల నుండి భక్తులు వచ్చి తమ ప్రార్థనలు చేసి కొబ్బరికాయలు, మిఠాయిలు, పువ్వులు సమర్పిస్తారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ధనానికి ఎటువంటి కొదువ ఉండదని నమ్ముతారు. ఆలయం లోపలి భాగం ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది.