Devi navaratrulu 2024: భారత్ లోనే కాదు ఈ దేశాల్లోనూ నవరాత్రి వేడుకలు అద్భుతంగా జరుగుతాయి
Devi navaratrulu 2024: దేవి నవరాత్రులు మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ పండుగను భారతీయులు చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే దేవి నవరాత్రులు, దసరా పండుగను మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ జరుపుకుంటారు. అవి ఏ దేశాలో మీరు చూసేయండి.
Devi navaratrulu 2024: భారతీయులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా. దేవీ నవరాత్రులలో భాగంగా దుర్గాదేవిని తొమ్మిది రూపాలలో అలంకరించి విశేషమైన పూజలు చేస్తారు. అక్టోబర్ 3 నుంచి దేవి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి.
తెలంగాణలో దేవి నవరాత్రుల సమయంలోనే బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఇక ఈ పండుగ సంబరాలు పశ్చిమ బెంగాల్ లో అంబరాన్ని అంటుతాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరి రోజు రామ్ లీలా ప్రదర్శన చేసి రావణాసురిడి దిష్టి బొమ్మను దహనం చేసే ఆచారం చాలా ప్రాంతాల్లో ఉంది. అయితే భారతీయులు మాత్రమే ఈ పండుగ జరుపుకోరు. వివిధ దేశాల వాళ్ళు కూడా దుర్గాదేవి పూజలు నిర్వహించుకుంటారు. మన దగ్గర ఏర్పాటు చేసినట్టే దుర్గాదేవి మండపాలను ఏర్పాటు చేసి తొమ్మిది రోజులపాటు అమ్మవారిని భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఏ ఏ దేశాల్లో దుర్గాదేవి పూజలు జరుపుకుంటారో తెలుసుకుందాం.
నేపాల్
నేపాల్ లో దుర్గాదేవి పూజలను దశై అని కూడా పిలుస్తారు. ఈ పది రోజుల పండుగ నేపాల్ లో అత్యంత ముఖ్యమైన వేడుకలలో ఒకటి. భారతదేశం మాదిరిగానే అక్కడ కూడా జరుపుకుంటారు. పది రోజులపాటు విద్యాసంస్థలకు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తారు. సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తూ బంధువులతో కలిసి ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు.
బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ ప్రజలు దుర్గా పూజను ఎంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ ఆచారం ప్రతి నగరంలోనూ కనిపిస్తుంది. దుర్గాదేవి ఆలయాలు మొత్తం భక్తుల సందర్శనలతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక్కడ బెంగాలీలో ఎక్కువగా నివాసం ఉంటూ ఉంటారు. అందువల్ల బెంగాల్ వాతావరణం ఈ సమయంలో ప్రస్పుటంగా కనిపిస్తుంది.
యునైటెడ్ కింగ్ డమ్
భారతదేశం నుంచి వెళ్ళి స్థిరపడిన ప్రవాస భారతీయులు గ్రేట్ బ్రిటన్ లోను దుర్గా పూజలు జరుపుకుంటారు. అనేక మహిళా సంస్థలు ఈ పండుగలో పాల్గొంటాయి. దుర్గాదేవి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తారు. పండుగ సమయంలో అందరూ ఒక చోట చేరి దుర్గాదేవిని ఆరాధిస్తారు. ప్రేమ, ఐక్యతను చాటి చెప్తారు.
అమెరికా
1970 నుంచి అమెరికాలో దుర్గాపూజ ఉత్సవాలు జరగడం ప్రారంభమైంది. అది ఇప్పుడు కాలక్రమైణా వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. ప్రస్తుతం అమెరికాలోని 50 రాష్ట్రాలలో బెంగాలీ జనాభా ఉన్న ప్రదేశాలలో ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కొన్ని సంఘాలు ఐదు రోజుల పండుగను జరుపుకుంటారు. అందరూ ఒక చోటకు చేరి దుర్గాదేవిని ఆరాధిస్తారు.
ఆస్ట్రేలియా
1974లో న్యూ సౌత్ వెల్స్ లో నివసిస్తున్న 12 కుటుంబాలు ఆస్ట్రేలియాలో మొదటిసారిగా దుర్గాదేవి పూజను నిర్వహించారు. అప్పటినుంచి ఇది దేశంలోనే అన్ని ప్రధాన నగరాలకు విస్తరించింది. సిడ్నీలో నివసిస్తున్న బెంగాలీ వలసదారులు ఇతర ప్రవాస భారతీయులు దేవి నవరాత్రులను జరుపుకుంటారు. మెల్‌బోర్న్‌లో, దక్షిణ కీస్‌బరో ప్రాంతంలో వేడుకలు చురుకుగా జరుగుతాయి. ఇక్కడ ఉండే కొన్ని సంఘాలు ఈ ఆచారాలను పాటిస్తారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.