Simha Rasi 2025 Telugu: సింహ రాశి ఫలితాలు.. ఒక స్త్రీ కారణంగా ధన నష్టం
Simha Rasi 2025 Telugu: సింహ రాశి జాతకులకు 2025 నూతన సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ హిందుస్తాన్ టైమ్స్ తెలుగు పాఠకులకు అందిస్తున్న సింహ రాశి జాతక ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
2025 సంవత్సరం నందు సింహ రాశి జాతకులకు చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా రాశి ఫలాలను ఇక్కడ చూడొచ్చు. బృహస్పతి మే నుండి లాభ స్థానము నందు సంచరించనున్నాడు. శని 8వ స్థానమునందు (అష్టమ శని ప్రభావం) సంచరించనున్నాడు. రాహువు మే నుండి ఏడవ స్థానము నందు, కేతువు మే నుండి ఒకటో స్థానము నందు సంచరించనున్నారు.
ఆయా గ్రహాల సంచారం నేపథ్యంలో సింహరాశి వారికి 2025 సంవత్సరంలో మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. సింహరాశి జాతకులు ఆవేశపూరిత నిర్ణయాల వల్ల నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. కుటుంబ సమస్యలు, గొడవలు అధికమగు సూచన.
అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించండి. జన్మ కేతువు ప్రభావం చేత పనుల యందు చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడును. లాభ స్థానములో గురుడి అనుకూలత వలన ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికి మనోధైర్యముతో ముందుకు వెళ్ళి పూర్తి చేసెదరు.
ఎవరెవరికి ఎలా ఉండబోతోంది?
సింహరాశి విద్యార్థులు కష్టపడవలసిన సమయం. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. స్త్రీలు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యహరించడం మంచిది. రాజకీయ నాయకులకు అంత అనుకూలంగా లేదు. సింహ రాశి జాతకులకు కోర్టు విషయాలు, వ్యవహారాలు అనుకూల ఫలితములు ఇచ్చును.
సింహరాశి రైతాంగానికి సమస్యలు అధికముగా ఉండును. సినీరంగం, మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి. సింహరాశి వారికి అష్టమ శని ప్రభావంచేత పనుల యందు చికాకులు, అనారోగ్య సమస్యలు అధికమయ్యే సూచనలు కనబడుచున్నాయి. రాహు కేతువుల ప్రభావం చేత కుటుంబ సమస్యలు, ఆందోళనలు, ఒత్తిడులు అధికమగును. పనుల యందు ఆచితూచి వ్యవహరించాలని సూచన.
పాటించాల్సిన పరిహారాలు
గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. సింహ రాశి జాతకులు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందడం కోసం శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. విఘ్నేశ్వరుని, దుర్గాదేవిని పూజించండి.
జనవరి 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. మానసిక క్షోభ, భయాందోళనలు ఏర్పడును. స్త్రీ మూలక ధన నష్టాలు ఉంటాయి. దూరపు ప్రయాణాలు ఉంటాయి. నూతన ప్రయత్నములు చేస్తారు. కుటుంబ అనుకూలత. ప్రమోషన్లుంటాయి.
ఫిబ్రవరి 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. బంధువులతో విరోధములుంటాయి. మనోధైర్యము, సంతాన మోసం. శుభకార్యాలు కలసివచ్చును. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. నూతన ప్రయత్నములు చేస్తారు. మతధార్మిక విషయాలలో కీలకపాత్ర.
మార్చి 2025:
ఈ మాసం సింహ రాశి జాతకులకు అనుకూలంగా లేదు. దేవాలయ దర్శనములు చేస్తారు. భార్య వలన ఇబ్బందులు ఏర్పడతాయి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. విపరీతమైన ఖర్చులు ఉంటాయి. మరణవార్తలు వింటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆదాయం అంతగా ఉండదు.
ఏప్రిల్ 2025:
ఈ మాసం కొంత అనుకూలం. మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారములు అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల సమయం. తీర్థయాత్రలు చేస్తారు. అపవాదులు వచ్చును. మానసికానందము లభిస్తుంది. పెద్దవారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.
మే 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ఇంటియందు శుభకార్యములు చేయుదురు. ఆకస్మిక ధనలాభములు ఉంటాయి. భార్య వలన సౌఖ్యం. అలంకార ప్రాప్తి. అధికారులతో ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. ఖర్చులు అధికమగును.
జూన్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి. సాధ్యం కాని పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారములయందు ఇబ్బందులు ఏర్పడును. వాహన ప్రమాదం. శ్రద్ధతో పని చేస్తారు. కొత్త పరిశ్రమలు ప్రారంభించేందుకు అనుకూల సమయం
జూలై 2025:
ఈ మాసం సింహ రాశి జాతకులకు అనుకూలంగా లేదు. ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు చేస్తారు. కీర్తిప్రతిష్ఠలు పెరుగును. అనుకొన్న పనులు ఆలస్యంగా పూర్తి చేయుదురు. శుభవార్తలు వింటారు.
ఆగస్టు 2025:
ఈ మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కొత్తవారితో పరిచయాలు ఉంటాయి. సంఘములో మంచి గౌరవముంటుంది. ఉద్యోగ ప్రయత్నములు చేస్తారు. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీ మూలక ధనలాభముంటుంది. తలపెట్టిన పనులు పూర్తగును.
సెప్టెంబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. ఆనందముగా గడిపెదరు. వస్త్రములు, ఆభరణములు కొంటారు. ఖర్చులు అధికమగును. మీరు మొదలుపెట్టిన పనులు ఫలించును. వ్యాపారం గూర్చి ఆలోచనలు చేస్తారు. కొత్త ప్రారంభములకు తపనపడతారు.
అక్టోబర్ 2025:
ఈ మాసం సింహ రాశి జాతకులకు అనుకూలంగా లేదు. బంధువుల వలన ధనవ్యయమగును. స్త్రీ సౌఖ్యము. ప్రయాణములలో చోరభయము. విదేశీయానం. ప్రముఖుల ద్వారా కలసివచ్చును. పనులు సకాలంలో పూర్తి కావు. ధనాదాయము బాగుండును.
నవంబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. అనుకోని ఖర్చులు ఉంటాయి. వస్త్ర లాభములు. భూమి కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ప్రమాద సూచనలు ఉన్నాయి. ఇంటర్వ్యూలలో వైఫల్యం. స్నేహితుల ద్వారా జాగ్రత్త అవసరం.
డిసెంబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబములో కలహాలు. శుభ కార్యములకు ఆటంకములు. స్త్రీ విరోధములు. విలువ గల వస్తువులు కొంటారు. వ్యాపార, ఉద్యోగపరంగా అంత అనుకూలంగా లేదు. కోర్టు వ్యవహారాలలో నిరాశ.ధనవ్యయం.
- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త
సంబంధిత కథనం