BITS in AP: అమరాతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ.. భూమి పరిశీలనలో బిట్స్, యాభై ఎకరాల్లో ఏపీ క్యాంపస్
BITS in AP: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటు కానుంది. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఏపీ క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం భూ పరిశీలన జరుగుతోంది.
BITS in AP: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటు కానుంది. 2016లోనే అమరావతిలో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలు తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయి. 2019 తర్వాత ఐదేళ్ల పాటు అమరావతిలో ప్రతిష్టంభన ఏర్పడింది. రాజధాని తరలింపు కోసం వైసీపీ పలు ప్రయత్నాలు చేసింది.
రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ప్రముఖ విద్యా సంస్థలకు భూములు కేటాయించిన ప్రాంతంలో దాదాపు 50 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి బిట్స్ ఆసక్తి చూపుస్తోంది. ఇప్పటికే నవులూరు పరిసర ప్రాంతాల్లో రెండు చోట్ల బిట్స్ ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలించారు.
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) క్యాంపస్ అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సిఆర్‌డిఏ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రముఖ సంస్థలను ఆహ్వానిస్తోంది. విద్యా సంస్థలను ఏర్పాటు చేసేందుకు వచ్చే వారికి ఉన్న అవకాశాలను ప్రభుత్వం వివరిస్తోంది. రాజధానిలో ఏర్పాటైన విద్యా సంస్థలు విజయవంతంగా నడుస్తుండటంతో బిట్స్ కూడా క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
బిట్స్ క్యాంపస్ కోసం ఏపీలో ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న బిట్స్‌కు ఇప్పటికే గోవా, హైదరాబాద్, దుబాయ్ క్యాంపస్‌లు ఉన్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో నాలుగో క్యాంపస్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఏపీ రాజధానిలో 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ ఏర్పాటుకు అనువైన స్థలాలను ఆ సంస్థ పరిశీలిస్తోంది.
బుధవారం సీఆర్డీఏ అధికారులతో కలసి బిట్స్ ప్రతినిధులు కురగల్లులోని ఎస్ఆర్ఎం వర్శిటీ సమీపంలో ఉన్న స్థలంతో పాటు, వెంకటపాలెంలోని బైపాస్ వద్ద స్థలాలను చూశారు. బిట్స్ యాజమాన్యంతో చర్చించిన తర్వాత క్యాంపస్ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని బిట్స్ ప్రతినిధులు సిఆర్‌డిఏ వర్గాలకు వివరించారు. బిట్స్ క్యాంపస్ ఏర్పాటైతే రాజధాని ప్రాంతం విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.