Navratri Colours 2023 । నవరాత్రులలో ధరించాల్సిన తొమ్మిది రంగులు ఇవే!
Navratri Colours 2023: తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో హిందువులు జరుపుకునే దసరా- నవరాత్రి ఉత్సవాలకు వేళయింది. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రంగులు ధరించి పూజిస్తే అమ్మవారు ప్రసన్నం అవుతారు. ఆ రంగుల విశిష్టత ఇక్కడ తెలుసుకోండి.
భారతదేశంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండగలలో దసరా- విజయదశమి ఒకటి. మొత్తంగా పది రోజులు, తొమ్మిది రాత్రుల పాటు వేడుకలు జరుగుతాయి. అందుకే వీటిని నవరాత్రులు అని పిలుస్తారు. ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో పరాశక్తి అవతారమైన దుర్గాదేవిని ఆరాధిస్తారు. మహిషాసురుడిని అంతం చేసిన మహిషాసురమర్ధినిగా అమ్మవారిని కొలుస్తారు. చెడుపై శక్తి సాధించిన విజయానికి ప్రతీకగా పదోరోజున విజయదశమిని జరుపుకుంటారు.
గతించిన పూర్వీకులకు అంకితం ఇచ్చే పక్షం రోజుల పితృ పక్షం ముగిసిన తర్వాత దేవి పక్షం ప్రారంభమవుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో పితృ పక్షం ముగింపుతో, ఆశ్వయుజ మాసం ప్రారంభం అవుతుంది. ఆ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. శరద్ ఋతువులో ప్రారంభమవుతాయి కాబట్టి శరద్ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తారు.
దుర్గామాత రాకతో తొమ్మిది రాజుల పాటు తల్లిని ఆరాధిస్తూ భక్తులు ఉపవాసం పాటిస్తారు, పూజలు చేస్తారు. దేవీ మాత ఈ రోజులలో తొమ్మిది రూపాలలో దర్శనం అందిస్తుందని నమ్ముతారు. అందుకని ప్రతి రూపానికి అనుగుణంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దుష్టశక్తుల ప్రభావం నుంచి తమను రక్షించమంటూ మాతను స్తుతిస్తారు.
తొమ్మిది రోజులలో ప్రతీరోజూ దేనికదే ప్రత్యేకమైనది. దేవికి చెందిన తొమ్మిది రూపాలు మనల్ని ప్రభావితం చేసే వివిధ గుణాలను ప్రతిబింబిస్తాయి. అందుకు తగినట్లుగా వివిధ రంగులను ధరించి, మాతను ఆరాధిస్తే.. ఆ తల్లి చల్లని చూపు తమపై ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
శరన్నవరాత్రులలో మొదటి రోజు నుంచి తొమ్మిదవ రోజు వరకు ఏ రంగు దుస్తులు ధరించాలో ఈ కింద పేర్కొన్నాము, గమనించండి.
నవరాత్రి మొదటిరోజు - తెలుపు రంగు:
అమ్మవారు శైలపుత్రి రూపంలో దర్శనమిస్తారు. తెలుపు రంగు వస్త్రం సమర్పించాలి. ఈ తెలుపు రంగు శాంతి, ప్రశాంతత, స్వచ్ఛతను సూచిస్తుంది
నవరాత్రి రెండవ రోజు - ఎరుపు రంగు:
భ్రమచారిణి రూపంలో పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఎరుపు రంగు శక్తికి ప్రతీక
నవరాత్రి మూడవరోజు- నీలం రంగు:
నవరాత్రి మూడవ రోజున అమ్మవారిని చంద్రఘంట రూపంలో పూజిస్తారు. ఈరోజు ప్రకాశవంతమైన నీలం రంగును ధరించాలి. ఈ రంగు దైవిక శక్తిని సూచిస్తుంది.
నవరాత్రి నాల్గవ రోజు- పసుపు రంగు:
నవరాత్రులలో నాల్గవ రోజు అమ్మవారు కూష్మాండ దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రంగు ఆనందం, ఉత్సాహాన్ని నింపే వెచ్చని రంగు.
నవరాత్రి ఐదవ రోజు- ఆకుపచ్చ రంగు:
ఐదవ రోజు స్కంద మాత రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రం సమర్పించాలి. ఇది ప్రకృతిని సూచిస్తుంది. సంతానోత్పత్తి, ఎదుగుదల, ప్రశాంతత భావాలకు ఆకుపచ్చ రంగు ప్రతీక. జీవితంలో కొత్త ప్రారంభాలను కూడా ఇది సూచిస్తుంది.
నవరాత్రి ఆరవరోజు - బూడిద రంగు:
ఆరవ రోజు మాత కాత్యాయనీ రూపంలో దర్శనమిస్తుంది. ఈరోజు బూడిద రంగు ధరించాలి. ఈ రంగు సమతుల్య భావోద్వేగాలకు ప్రతీక.
నవరాత్రి సప్తమి- నారింజ రంగు:
ఏడవ రోజున అమ్మవారిని కాళరాత్రిగా దర్శనమిస్తుంది. ఈరోజు దేవిని నారింజ రంగు ధరించి పూజించండి. ఈ రంగు ప్రకాశం, జ్ఞానాన్ని సూచిస్తుంది.
నవరాత్రి అష్టమి- నెమలి ఆకుపచ్చ రంగు:
ఎనిమిదవ రోజు దుర్గాష్టమి నాడు మహాగౌరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. నెమలి ఆకుపచ్చ రంగు ప్రత్యేకత, వ్యక్తిత్వానికి ప్రతీక
మహర్ననవమి- గులబీ రంగు:
నవరాత్రి తొమ్మిదవ రోజున అమ్మవారు సిద్ధిధాత్రి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజున గులాబీ రంగు సార్వత్రిక కరుణ, ఆప్యాయత, సామరస్యాన్ని సూచిస్తుంది.