శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతార విశిష్టత.. అమ్మవారికి ఎలా పూజ చేయాలి?-navaratri 9th day goddess rajarajeshwari devi avatar worship puja vidhi ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతార విశిష్టత.. అమ్మవారికి ఎలా పూజ చేయాలి?

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతార విశిష్టత.. అమ్మవారికి ఎలా పూజ చేయాలి?

HT Telugu Desk HT Telugu
Oct 23, 2023 03:02 PM IST

Navaratri 2023 : ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తారు. ఈ అవతారం గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

దుర్గామాత
దుర్గామాత

శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ దశమి(విజయ దశమి) రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తుంది. నవరాత్రులలో ఈరోజే ఆఖరిరోజు. విజయవాడ కనక దుర్గ ఆలయంలో అమ్మవారు ఈ రూపంలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకూ దర్శనమిస్తారు. ఈరోజును విజయదశమిగా జరుపుకుంటామని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అమ్మవారు చిద్రూపిణి. పరదేవతగా అలరారుతుంది.

పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని, చేతిలో చెరకుగడతో, చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించుకోవాలి. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి శ్రీ చక్రవానికి అధిష్టాన దేవత. త్రిపురత్రయంలో తృతీయ దేవత. ఈరోజున శ్రీ రాజరాజేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు, సువాసినీ పూజలు, శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారు. వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలు అలంకరించి పూజల చేస్తారు.

శమీ వృక్షానికి పూజలు చేస్తారు. ఈరోజే పాండవులు యుద్ధములో విజయం సాధించారు. అందుచేత విజయదశమినాడు శమీ వృక్షానికి పూజలు, ప్రదక్షిణలు చేసి క్రింది శ్లోకాన్ని పఠించుకుంటూ సర్వత్ర విజయం సాధించాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శమీ పూజ చేస్తూ చదవాల్సిన శ్లోకం..

శమీ శమయతే పాపం, శమీ శత్రువినాసినీ! అర్జునస్య ధనుర్దారీ, రామస్య ప్రియదర్శినీ!

మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రము నుంచి అమృతభాందము బయటపడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెబుతారు. శ్రేతాయుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజునే విజయదశమిరోజుగా పండుగ చేసుకుంటాము. ద్వాపర యుగంలో శమీ వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తరువాత ఆ శమీ వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకుని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు విజయదశమి రోజు.

ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి విజయములు కలుగుతాయని దేవీపురాణం తెలియచేస్తుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. నవరాత్రులలో తుది పూజ విజయదశమి పూజ. అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తరంతో అన్ని పూజలు జరిపి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బూందీ, లడ్డూతో పాటు షడ్రసోపేతమైన భోజన పదార్థాలతో మహానివేదన చేస్తారని చిలకమర్తి తెలిపారు.

విజయదశమిరోజు విజయముహూర్తం అని ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కలశం పెట్టి అమ్మవారి మూర్తిని పెట్టి సామూహికంగా చేసుకున్నవారు దశమిరోజున భక్తిశద్ధలతో ఉద్దాపన పలికి, నిమజ్జనం చేస్తారని చిలకమర్తి వెల్లడించారు. ఈరోజు ధరించవలసిన వర్ణం ఆకుపచ్చ రంగు.

Whats_app_banner