నవరాత్రి ఏడో రోజు సరస్వతీ దేవి అలంకారం- నేటి నుంచి త్రిరాత్ర వ్రతం ఆరంభం
నవరాత్రులలో ఏడో రోజు కనకదుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈరోజు నుంచి నవరాత్రి చివరి మూడు రోజు త్రిరాత్ర వ్రతం చేస్తారు. ఈరోజు పూజా విధానం, ధరించాల్సిన రంగు గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
ఏడవ రోజున సప్తమి తిథి నాడు సాధారణంగా మూలా నక్షత్రం వస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆ రోజున అమ్మవారిని వాగ్దేవీ అలంకారంలో ఉపచారాలు చేస్తారని చిలకమర్తి తెలిపారు.
మూలా నక్షత్రము రోజున మనమందరం అమ్మవారిని శ్వేత పద్మాన్ని అధిష్టించి, వీణ, కమండలం, అక్షరమాలను ధరించి, అభయ ముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీ దేవిని హృదయంలో ముద్రించుకుని ఆ దేవిని పూజించుకుందామని ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి తెలిపారు. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదా దేవి అతి విశిష్టమైనది. తల్లితండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్దులకై సరస్వతీ పూజ తప్పక చేయిస్తారు. కొంతమంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేస్తారు. ఇదే రోజున దేవీ నవరాత్రులలో చివరి మూడు రాత్రులూ చేసే త్రిరాత్రవ్రతం ఈ రోజే ఆరంభిస్తారు.
వీణాధరే! విపుల మంగళ దానశీలే! భక్తార్తినాశిని! విరించి హరీశ వంద్యే!
కీర్తిప్రదే! అఖిల మనోరదే! మహరే! విద్యాప్రదాయిని సరస్వతి! నౌమి నిత్యం!
అని మనసారా స్తుతిస్తే భక్తుల అజ్ఞాన తిమిరాలను తొలగించి, వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తుందని చిలకమర్తి తెలిపారు. వాక్ శక్తిని, స్ఫూర్తిని ప్రసాదిస్తుందని అన్నారు. సరస్వతీదేవి త్రిశక్తి రూపాల్లో మూడవ రూపం. ప్రాణకోటి జిహ్వాగ్రంపై నివసిస్తుంది. వ్యాసుడు, వాల్మీకి, కాళిదాసులను అనుగ్రహించి, వారి వాక్ వైభవాన్ని విశ్వవిఖ్యాతి చెందేలా చేసింది ఈ వీణా పుస్తకధారిణి. మనమందరం కూడా శ్రీ సరస్వతీదేవిని శక్తి కొలది అర్చించి, షోడశోపచారాలతో అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ గావించి, వడపప్పు, చలిమిడి, పానకం, అటుకులు, బెల్లం, అన్నం పరమాన్నం, దద్ధ్యోదనం నివేదన చేసి, మన విద్యాబుద్దులను పెంపొందిచుకుందామని చిలకమర్తి తెలిపారు. ఈరోజు ధరించాల్సిన రంగు తెలుపు అని అధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.