భగవంతుణ్ని పూజించడానికి దేవాలయాలకు వెళ్తారు. అలాగే ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు చేస్తారు. హిందూ మతంలో పూజలు, ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నిత్యం తాము భగవంతునికి చేరువలో ఉన్నాం, తమకు భగవంతుని రక్షణ ఉంది అనే నమ్మకాన్ని ఇవి కలిగిస్తాయి. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి పూజలు చేస్తారు. భగవంతుని ముందు దీపం వెలిగిస్తారు, ధూపం వేస్తారు, హారతి నిర్వహిస్తారు. పండ్లు, ఫలం, పుష్పం , పత్రం సమర్పిస్తారు.
ఇంట్లో కొవువుదీర్చిన దేవతామూర్తులకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం అంటే ఆ దేవతలకు మీ ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం లాంటింది. ఇది మిమ్మల్ని ఆధ్యాత్మిక భావనలతో, శుద్ధమైన మనసుతో ఉంచుతుంది, మీలో సానుకూల శక్తిని నింపుతుంది.
వేళకు తగినట్లుగా పూజించే విధానంలో మార్పులు ఉండాలని వేద పండితులు చెబుతారు. ప్రాతఃకాలంలో చేసే పూజ ఎంతో విశేషమైనది. ఈ సమయంలో చేసే పూజలకు తప్పకుండా పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం.
సాయంకాలంలో చేసే పూజలకు కూడా ప్రాధాన్యత ఉంది. రోజు ముగింపున భగవంతునికి కృతజ్ఞత చెప్పే సందర్భం ఇది. మీరు రోజంతా పని చేసి సాయంత్రం పూజ చేయడం వలన మీలో ఒత్తిడి తగ్గుతుంది. సానుకూలతతో రోజును ముగించగలరు. ఇది మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయం చేస్తుంది.
హిందూ మతం ఆచరించే ఇళ్లల్లో ప్రాత:కాలంలో, సాయంకాలంలో రెండుసార్లు పూజలు చేస్తారు. కానీ ఉదయం చేసే పూజా విధానానికి, సాయంత్రం పూజా విధానానికి చాలా తేడా ఉంటుందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సాయంత్రం పూజ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
ఇంట్లో లేదా గుడిలో సూర్యాస్తమయం తర్వాత పూజా సమయంలో శంఖం ఊదడం గానీ, గంట మోగించడం గానీ చేయరాదని శాస్త్రాలలో పేర్కొనడమైనది. సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారు, అటువంటి సమయంలో వారిని మేల్కొలపడం సరికాదని నమ్ముతారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆలయంలో గంట లేదా శంఖాన్ని మోగించకూడదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
పూజలో తులసి ఆకులు, తులసి దళాలను వినియోగించడం మనకు తెలుసు. తులసి ఆకులను విష్ణు పూజలో ప్రత్యేకంగా ఉపయోగిస్తారని గ్రంథాలలో పేర్కొనడమైనది. అయితే సాయంత్రం వేళలో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు. ఒకవేళ తులసి ఆకులను ఉపయోగించాల్సి వస్తే వాటిని సూర్యాస్తమయానికి ముందే సమకూర్చుకోవాలి. సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను తాకరాదు, ఆకులను తీసుకోకూడదు.
పురాతన గ్రంథాల ప్రకారం, సూర్య భగవానుని ఆవాహన, ఆరాధన తప్పనిసరి. సూర్యోదయం నుంచి పగటి వరకు సూర్య భగవానుడిని ఎప్పుడైనా ఆరాధించవచ్చు. అయితే పొరపాటున కూడా రాత్రి వేళలో స్యూర్య భగవానుడి పూజ చేయకూడదని శాస్త్రం చెబుతుంది.
భగవంతుని అనుగ్రహం కోసం రోజుకు కనీసం రెండుసార్లు పూజ చేయడం మంచిది. సాయంత్రం వేళ భగవంతునికి చేసే ఏ పూజ అయినా ప్రత్యేక సందర్భాల్లో మినహాయించి, మిగతా అన్ని రోజులలో రాత్రి 9 గంటలకే పూజను ముగించాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసివేయాలి అని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ మతవిశ్వాసాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని సమాచారం పూర్తిగా నిజం అని చెప్పలేం, అందుకు ఎలాంటి కచ్చితమైన ఆధారాలు కూడా లేవు.
టాపిక్