వరలక్ష్మీ వ్రతం రోజు అలంకరణ.. లక్ష్మీదేవికి ఇలా ఆహ్వానం పలకండి
వరలక్ష్మీ వ్రతం రోజు ఇంటిని అందంగా అలంకరించడం చాలా ముఖ్యం. కొన్ని కొత్త ఐడియాలతో అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి.
మహిళలకు ముఖ్యమైన పండుగలలో వరలక్ష్మీ వ్రతం ఒకటి. శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహమైన స్త్రీలు తమ భర్తల శ్రేయస్సుకోసం, సకల సౌభాగ్యాల కోసం అమ్మవారిని పూజించి.. ప్రార్థిస్తారు. ఈ సమయంలో ఇంటిని అందంగా అలంకరించడం చాలా ముఖ్యం. అయితే కొన్ని కొత్త ఐడియాలతో అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించండి.
అలంకరణ ఇలా
భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆహ్వానిస్తే.. మనమీద ప్రేమతో అమ్మవారు ఇంటికి వచ్చేస్తారు. కానీ అమ్మవారు ఇంటికీ వస్తే మనం ఎంత శుభ్రంగా ఇంటిని సర్దుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. ఎవరైనా అతిథి ఇంటికి వస్తున్నారంటేనే.. ఇళ్లంతా సర్దేస్తాము. అలాంటిది అమ్మవారి కటాక్షం కోసం చేసే ఈ వ్రత సమయంలో ఇంటిని ఇంకెంత శుభ్రంగా, ఇంకెంత అందంగా తీర్చిదిద్దుకోవాలనేది మీ చేతుల్లోనే ఉంది.
ముందుగా ఇంట్లోని ప్రతి మూలను శుభ్రం చేసుకోవాలి. ఇది అందరూ చేసేదే. అయితే అలంకరణలో మాత్రం ఎవరికి వారిదే ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ముఖ్యంగా వరలక్ష్మీ వ్రతాల్లో అలంకరణే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అమ్మవారి అలంకరణ దగ్గర్నుంచి.. దేవుడి గది, పూజా సామాగ్రి, పెట్టే నైవేద్యాలు కూడా ఇంపుగా కనిపిస్తాయి. అందుకే ఈ సమయంలో మీ ఇంటిని అందంగా అలంకరించేందుకు ఇక్కడ కొన్ని ఐడియాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని.. ఆచరించి మీరు అమ్మవారిని ఇంటికి ఆహ్వానించేయండి.
ముఖద్వారం..
ఇంటికి ముఖద్వారం చాలా ముఖ్యం. పూజగదిని అలంకరిస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నారేమో. ఎవరైనా ఇంటికి వస్తే ముఖద్వారం నుంచే లోపలికి వస్తారు కాబట్టి.. ఇంటి ప్రవేశ ద్వారాన్ని కచ్చితంగా అలంకరించండి. సాంప్రదాయంగా దానిని తీర్చిదిద్దాలనుకుంటే మీరు బంతిపువ్వుల దండలు, మామిడాకులు కట్టవచ్చు. డోర్ ఫ్రేములు, మెట్లు, హాలు గోడలపై పువ్వుల దండలు వేలాడదీయవచ్చు. దానికి మరింత మెరుపు జోడించాలనుకుంటే లైట్లు, దియాలు అదనంగా పెట్టవచ్చు. ఇది మొత్తం ఇంటి రూపునే మార్చేస్తుంది.
లివింగ్ రూమ్ డెకరేషన్
లివింగ్ రూమ్ అలంకరణలో కాస్త సృజనాత్మకతను జోడించండి. మరీ హెవీగా వెళ్లకుండా జస్ట్ సింపుల్, ఇన్నోవేటివ్ గా ఉండేలా చూడండి. అధునాతమైన, నిర్థిష్టమైన థీమ్‌లు ఫాలో అవ్వొచ్చు. కుర్చునే ప్రదేశాలకు కాస్త పండుగ కళ వచ్చేలా ఎలక్ట్రిక్ లైట్స్ తో ట్విస్ట్ ఇవ్వొచ్చు. సోఫాలపై ట్రెడీషనల్ క్లాత్స్ వేయొచ్చు. కాఫీ టేబుల్‌ను పువ్వులతో అలంకరించి దానిపై సాంప్రదాయ స్వీట్లు, దియాలతో అలంకరించవచ్చు.
పూజ తెరలతో..
అమ్మవారిని చూసిన వెంటనే పండుగ శోభ ఉట్టిపడేలా చేయాలంటే మీరు సరైన పూజ తెరలు ఎంచుకోవాలి. అమ్మవారి చిత్రాలు, రంగవల్లులూ, అరిటాకులూ, దీపాలు వంటి రకరకాల డిజైన్లతో ఎన్నో కర్టెన్స్ లభిస్తున్నాయి. అవి సగం పండుగ శోభను తీసుకువచ్చేస్తాయి. దానికి మీరు మరింత క్రియేటివిటీ ఉపయోగించి.. రకరకాల పూలు, ఆకులు కట్టవచ్చు. ఎలక్ట్రిక్ లైట్స్ ఏర్పాటు చేయవచ్చు. మీకు అలంకరించే సమయం లేకపోయినా ఇవి క్షణాల్లో గదిలో మార్పును తీసుకువచ్చేస్తాయి.
పూజ మండపంలో..
పూజా మండపాన్ని పూలతో, అరటి చెట్టుతో అలంకరించవచ్చు. బియ్యపు పిండి ఉపయోగించి రంగోలి డిజైన్లు వేయొచ్చు. పసుపు, కుంకుమలతో చుట్టూ బొట్లు పెట్టి కలశాన్ని అందగా తయారు చేసుకోవచ్చు. నీళ్లూ, మామిడాకులూ, కొబ్బరికాయతో కలశాన్ని ముస్తాబు చేయవచ్చు. మార్కెట్లో ఎన్ని ట్రెండీ కలశాలు వచ్చినా.. రాగీ, ఇత్తడి కలశాలు పండుగ వైబ్ తీసుకువస్తాయి.
అమ్మవారి అలంకరణ
వరలక్ష్మీ వ్రతం రోజు సాధారణంగా పీటపైన ఉంచిన కలశాన్నే అమ్మవారిగా కొలుస్తూ వ్రతం చేస్తాము. పసుపు ముద్దతో అమ్మవారిని చేసి పూజలు చేస్తాము. అయితే ఇప్పుడు అమ్మవారి ముఖాలూ, నిలువెత్తు రూపాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. అమ్మవారు నిజంగానే ఇంట్లో కొలువు తీరారా అన్నట్లు ప్రతిమలు ఉంటున్నాయి. వాటికి తలపై కిరీటం, మెడలో నగలు, పట్టుచీర కట్టి అమ్మవారిని మీరే స్వయంగా తయారు చేసుకోవచ్చు.
వీటన్నింటితో పాటు మీరు చేసే నైవేధ్యాలు, పూజా సామాగ్రి.. ముఖ్యంగా అమ్మవారికి చేసే దీపారాధన ఇంటికి కొత్త కళను తీసుకువస్తుంది. ఈ చిట్కాలతో మీ ఇంటిని అందంగా అమ్మవారిలా ముస్తాబు చేసి.. సకల సంపదలు ప్రసాదించే అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించేయండి.
సంబంధిత కథనం