Tirumala News: హనుమంత వాహనంపై గోవిందుడి కటాక్షం
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఉదయం గోవిందుడు వరద హస్తంతో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి బ్రహ్మోత్సవాల్లోగోవిందుడు వరద హస్తంతో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది.
ఉదయం 9-30 గంటల నుండి 10-30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు.
మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆలయంలో వసంతోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ప్రారంభమైన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఉదయం 7 నుండి 7.30 గంటల వరకు మిధున లగ్నంలో వైఖానసాగమోక్తంగా ధ్వజారోహణ ఘట్టం జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అంతకుముందు ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేషపూజా కార్యక్రమాలు జరిగాయి. అంతకుముందు భేరితాడనం, భేరిపూజ, ధ్వజపటం, నవసంధి నిర్వహించారు. మిధున లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి నూతన వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు.