Holi colors: హోలీ వేడుకలలో ఉపయోగించే ప్రతి రంగుకు ఒక అర్థం ఉంది.. ఏ రంగు దేనికి ప్రతీక-every color used in holi celebrations has a meaning which color symbolizes what ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Every Color Used In Holi Celebrations Has A Meaning..which Color Symbolizes What

Holi colors: హోలీ వేడుకలలో ఉపయోగించే ప్రతి రంగుకు ఒక అర్థం ఉంది.. ఏ రంగు దేనికి ప్రతీక

Gunti Soundarya HT Telugu
Mar 15, 2024 04:26 PM IST

Holi colors: హోలీ పండుగ వచ్చిందంటే రంగులతో ఆటలాడుకుంటారు. అయితే ఏ రంగు దేనికి ప్రతీకగా నిలుస్తుందనే విషయం మాత్రం తెలియదు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఏ రంగు దేనికి ప్రతీకగా నిలుస్తుందో తెలుసుకుందాం.

హోలీ పండుగ రంగుల అర్థాలు
హోలీ పండుగ రంగుల అర్థాలు (pixabay)

Holi colors: హోలీ అంటే రంగుల పండుగని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరోజు ప్రతీ ఒక్కరూ ఎంతో ఆనందంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరు మీద మరొకరు రంగులు చల్లకుంటూ సంతోషంగా గడుపుతారు. రంగులు మొహాలకు చల్లుకుంటూ ఉంటారు కానీ ఆ రంగులకున్న ప్రాముఖ్యత మాత్రం ఎవరికి తెలియదు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఒక్కో రంగుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంది.

ట్రెండింగ్ వార్తలు

హిందూమతంలో రంగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రంగులు ఆనందాన్ని వ్యాప్తి చేస్తాయి. హిందూమతంలో అనేక వేడుకలలో ఉపయోగించే కొన్ని రంగులు వాటి ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం.

ఎరుపు

ఇంద్రియాలు, స్వచ్ఛత రెండింటిని ఎరుపు రంగు సూచిస్తుంది. హిందూ మతంలో ఎరుపు రంగుకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. వివాహాలు, పండుగలు మొదలైన సందర్భాల్లో తరచుగా ఉపయోగించే రంగు ఇది. వేడుకలు ముఖ్యమైన సందర్భాల్లో నుదుటిపై ఎరుపు రంగు తిలకం ధరిస్తారు. వివాహానికి సంకేతంగా స్త్రీలు ఎరుపు రంగు బొట్టు పెట్టుకుంటారు. పెళ్లి, వ్రతం అనేటప్పుడు ఎరుపు రంగు చీరలు కట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. దేవతలకు కూడా ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు పూలు, చిమ్నీ సమర్పిస్తారు. ఈ రంగు శక్తి, ధైర్యం, ధార్మికం, పరాక్రమానికి సూచికగా భావిస్తారు.

కాషాయం

హిందూమతంలో అత్యంత పవిత్రమైన రంగుగా కాషాయం ఉంటుంది. ఇది అగ్నిని సూచిస్తుంది. శరీరం, మనసులోని మలినాల నుంచి ప్రక్షాళన చేసుకున్నామనే దానికి సూచికగా ఈ రంగుని భావిస్తారు. అందుకే సన్యాసులు ఎక్కువగా కాషాయ రంగు దుస్తులు ధరిస్తారు. ఆంజనేయ స్వామికి కాషాయ జెండా ఉంటుంది. హనుమంతుడి శరీరం మొత్తం కూడా ఇదే రంగు ఉంటుంది. దీని వెనుక ఒక చిన్న కథ కూడా ఉంది. ఒకరోజు సీతాదేవి తన నుదుటి మీద సింధూరం పెట్టుకుంటుంటే ఎందుకని హనుమంతుడి అడుగుతాడు. శ్రీరాముని రక్షణ, క్షేమాన్ని ఇది సూచిస్తుందని చెప్పడంతో అప్పటి నుంచి హనుమంతుడు తన శరీరం మొత్తం ఈ రంగు పులుముకుంటాడు.

ఆకుపచ్చ

ఆకుపచ్చ ఒక ప్రకృతిని సూచిస్తుంది. జీవితంలో ఆనందం, కొత్త ఆరంభానికి, సంతోషానికి ప్రతీకగా భావిస్తారు. ప్రకృతిని సూచించే రంగు ఆకుపచ్చ అందుకే ఈ రంగుకి కూడా ప్రాముఖ్యత ఇస్తారు.

పసుపు

పసుపు అనేది జ్ఞానం, అభ్యాసం సూచిస్తుంది. ఆనందం, శాంతి, ధ్యానం, సామర్థ్యం, మానసిక అభివృద్ధికి ప్రతీక. వసంత రుతువు సూచిస్తుంది. మనసుని ఉత్తేజపరుస్తుంది. విష్ణువు, శ్రీకృష్ణుడు, వినాయకుడికి ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు మిఠాయిలు సమర్పిస్తారు. వసంతోత్సవాలు పసుపు రంగులోనే ప్రారంభమవుతాయి. దుష్టశక్తులను దూరంగా ఉంచేందుకు పసుపు రంగు ధరిస్తారు. అమ్మాయిలు తమ సహచరులు ఆకర్షించేందుకు ఈ రంగు ఎక్కువగా ఎంచుకుంటారు. పసుపు పవిత్రమైనది.

తెలుపు

తెలుపు అనేది ఏడు వేరువేరు రంగుల మిశ్రమం. ఇది స్వచ్ఛతను, నాణ్యత, పరిశుభ్రత, శాంతిని, జ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞానదేవత సరస్వతి ఎప్పుడు తెలుపు రంగు దుస్తులు ధరించి తామరపై కూర్చున్నట్లు చూపిస్తారు. ఆధ్యాత్మికతను సూచిస్తుంది. సంతానానికి కూడా ప్రతీక. అయితే హోలీ వేడుకల్లో తెలుపు మాత్రం ఉపయోగించకూడదు.

నీలం

సృష్టికర్త ప్రకృతికి నీలం రంగుని ఇచ్చాడు. ఆకాశం, సముద్రం, నదులు, సరస్సులో నీలి రంగులోనే కనిపిస్తాయి. ధైర్యం, పౌరుషం, ధృఢ సంకల్పం, క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోగల సామర్థ్యం, స్థిరమైన మనసు వంటి లక్షణాలను నీలం రంగు సూచిస్తుంది. కృష్ణుడు నీలం రంగు శరీరాన్ని కలిగి ఉన్నాడు.

గులాబీ రంగు

హోలీ వేడుకల్లో ఎక్కువగా వినియోగించే రంగు పింక్. యవ్వనం, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. హోలీ వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకునే కళను ఇస్తుంది. అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే రంగు ఇది.

WhatsApp channel