Sri rama navami 2024: 14 ఏళ్ల వనవాసం సమయంలో శ్రీరాముడు నడయాడిన ఈ ప్రదేశాల గురించి మీకు తెలుసా?
Sri rama navami 2024: శ్రీరాముడు వనవాసం సమయంలో నడయాడిన కొన్ని ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. అక్కడ శ్రీరాముడికి సంబంధించిన అనేక ఆనవాళ్ళు కనిపిస్తాయి. దానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.
Sri rama navami 2024: శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దశరథ మహారాజు పెద్ద కుమారుడుగా శ్రీరాముడు చైత్ర శుక్ల నవమి నాడు అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. విష్ణువు ఏడో అవతారంగా శ్రీరాముడు భూమిపై జన్మించి ప్రజలను సత్యమార్గాన్ని అనుసరించమని ఆచరించి చూపించాడు.
సీతా స్వయంవరం నుంచి అయోధ్య రాజుగా పట్టాభిషేకం వరకు శ్రీరాముని జీవితంలో అనేక ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. శతాబ్దాలు గడిచిన రామాయణ కాలానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి.
శ్రీరాముడు సీత, లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. రాజ భోగాలను విడనాడి తండ్రికి ఇచ్చిన మాట కోసం సాధారణ మానవుడిగా అరణ్యంలో జీవనం సాగించాడు. ఈ 14 సంవత్సరాల శ్రీరాముడు అనేక ప్రదేశాలను సందర్శించాడని, కొన్ని చెట్ల బస చేసినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి.
అయోధ్య నుంచి లంక వరకు శ్రీరాముడు చేసిన ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నుంచి మొదలుకొని శ్రీరాముడు వనవాసం చేసిన అనేక ముఖమైన ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయి. వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం.
అయోధ్య
శ్రీరాముడు సరయూ నది ఒడ్డున ఉన్న అయోధ్య నగరంలో జన్మించాడు. దశరథ మహారాజు కౌసల్య దేవి పెద్ద కుమారుడే శ్రీరాముడు. ఈ ప్రదేశం రామ జన్మభూమిగా ప్రసిద్ధి చెందినది. అయోధ్యలో సుమారు 500 సంవత్సరాల తర్వాత రామమందిరాన్ని నిర్మించారు. ఈ ఏడాది అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా తన మొదటి శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నాడు.
చిత్రకూట్, మధ్యప్రదేశ్
శ్రీరాముడు వనవాసం చేసిన సమయంలో చిత్రకూట్ లో ఎక్కువగా నివసించినట్లు చెబుతారు. సీతా లక్ష్మణులతో కలిసి శ్రీరాముడు ఇక్కడ 11 సంవత్సరాలు వనవాసం చేశాడు. ఇక్కడే ఎక్కువ సమయాన్ని గడిపినట్లు చెబుతారు. సోదరుడైన భరతుడు శ్రీరాముని కలవడానికి ఇక్కడికే వచ్చాడు. ఈ ప్రాంతం యూపీ, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉంది.
నాసిక్, పంచవటి
రామాయణంలో నాసిక్ గురించి మాట్లాడేటప్పుడు పంచవటిగా పిలుస్తారు. చిత్రకూట్ నుంచి వచ్చిన రాముడు పంచవటికి వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడే లక్ష్మణుడు రావణుడి సోదరి సూర్పణఖ ముక్కుని కోసేశాడు.
లేపాక్షి, ఆంధ్ర ప్రదేశ్
రావణుడు సీతాదేవిని పంచవటి నుంచి అపహరించి తీసుకువెళ్తాడు. అప్పుడు జటాయువు రావణుడితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం చేసిన ప్రదేశమే ఈ లేపాక్షి. రావణుడితో చేసిన యుద్ధంలో గాయపడిన జటాయువు ఇక్కడే పడినట్టు స్థలపురాణం చెబుతుంది. శ్రీరాముల వనవాసం మార్గంలో లేపాక్షికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
రామసేతు
తమిళనాడులోని రామేశ్వరం, శ్రీలంక వాయువ్య భాగంలో ఉన్న మన్నార్ ద్వీపం మధ్య సముద్రంలో రోడ్డు లాంటి భూభాగం ఉంది. దీనిని రామసేతు అంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకు వెళ్ళినప్పుడు రాముడు తన వానర సైన్యంతో లంకకు బయలుదేరతాడు. రామేశ్వరం తీరం నుంచి లంకకు సముద్రం ఉన్నందున శ్రీరాముడి కోసం హనుమంతుడు రామసేతుని ఏర్పాటు చేశాడు. లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు రామేశ్వరంలో శివుడిని పూజించాడు. ఇక్కడ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసినట్టుగా చెప్తారు.
జనక్ పురి
శ్రీరాముడి ధర్మపత్ని సీతాదేవి జనక్ పురిలో జన్మించింది. జనకమహారాజు కుమార్తె సీతాదేవి ఇక్కడే శ్రీరాముడిని వివాహం చేసుకుంది. సీతా స్వయంవరం సమయంలో రాముడు శివధనస్సు విరగ్గొట్టాడు. భారత్ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపాల్లోని జనక్ పురి అప్పుడు సీతాదేవి పుట్టిల్లు. ఇక్కడ నగరానికి సమీపంలో ఉత్తర దనుష అనే ప్రదేశం ఉంది. ఇక్కడ రాతి ముక్కలు విల్లు అవశేష రూపంలో ఉంటాయి. సీతారాముల వివాహం జరిగిన మంటపాన్ని నిర్మించారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజల సందర్శించేందుకు ఇక్కడికి వస్తారు.
కిష్కింద
రామాయణంలో కిష్కిందకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడే శ్రీరాముడు హనుమంతుడితో సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని లంకకు వెళ్లి రావణుడిని ఓడించాడు. ప్రస్తుతం కర్ణాటకలోని హంపి పరిసర ప్రాంతాలను కిష్కిందగా భావిస్తారు. తుంగభద్రా నది ఒడ్డున బలి, సుగ్రీవుడు గుహలు కూడా ఉన్నాయి. ఇక్కడే అంజనాద్రి పర్వతం ఉందని హనుమంతుడు జన్మించాడని చెబుతారు. పంపా సరస్సు ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉంటుంది. అడవి ప్రయాణంలో శ్రీరామ లక్ష్మణులు ఇక్కడ బస చేశారు.
తలైమన్నార్, శ్రీలంక
శ్రీలంకలోని ఈ ప్రదేశంలోణే రామ రావణ యుద్దం జరిగిందని చెబుతారు. రావణుడి చెర నుంచి సీతమ్మను విడిపించాడు. ఆ తర్వాత సీతా లక్ష్మణులతో కలిసి అయోధ్య వెళ్ళిపోయాడు.
ఇవే కాకుండా రామాయణ కాలానికి చెందిన ఆనవాళ్లు ఇప్పటికీ వివిధ ప్రాంతాల్లో కనిపిస్తాయి. అటవీ ప్రయాణంలో శ్రీరాముడు కేవలం గంగానది మీదుగా వెళ్ళినట్లు చెబుతారు. ఈ ప్రదేశం ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ సమీపంలోని శృంగేరి పురిలో ఉందని నమ్ముతారు.