Blockchain Technology | బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఏంటి? భవిష్యత్తు దీనిదేనా?-what is blockchain technology and how strong is it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Blockchain Technology | బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఏంటి? భవిష్యత్తు దీనిదేనా?

Blockchain Technology | బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఏంటి? భవిష్యత్తు దీనిదేనా?

Hari Prasad S HT Telugu
Jan 24, 2022 09:26 PM IST

బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీ అయినా, నాన్‌-ఫంజిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీ)కు అయినా ఈ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీయే మూలం. ఈ నేపథ్యంలో అసలేంటీ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ? ఇది అంత శక్తివంతమైందా? ఇది ఎలా పనిచేస్తుంది?

<p>బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీలు పనిచేసేది ఈ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీపైనే..</p>
బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీలు పనిచేసేది ఈ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీపైనే.. (AP)

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ( Blockchain Technology ) : ప్రస్తుతం ఈ టెక్నాలజీదే హవా. బిట్‌కాయిన్‌లాంటి క్రిప్టోకరెన్సీ అయినా, నాన్‌-ఫంజిబుల్‌ టోకెన్స్‌ (ఎన్‌ఎఫ్‌టీ)కు అయినా ఈ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీయే మూలం. అసలేంటీ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ? ఇది అంత శక్తివంతమైందా? ఇది ఎలా పనిచేస్తుంది? దీని ద్వారా ట్రాన్సాక్షన్లు ఎలా చేయవచ్చు అన్న విషయాలు ఇప్పడు చూద్దాం.

ఏంటీ బ్లాక్‌చెయిన్?

సమాచారాన్ని రికార్డు చేసే ఒక వ్యవస్థ ఇది. సాధారణంగా బ్యాంకుల్లో లెడ్జర్లు ఉంటాయి కదా. అందులో అన్ని లావాదేవీలకు సంబంధించిన సమాచారమంతా ఉంటుంది. ఈ బ్లాక్‌చెయిన్‌ అనేది ఒక డిజిటల్‌ లెడ్జర్‌. అయితే ఆ లెడ్జర్లను సులువుగా మార్చడం, హ్యాక్‌ చేయడం చేయవచ్చేమోకానీ ఈ బ్లాక్‌చెయిన్‌ వ్యవస్థలో ఉన్న సమాచారాన్ని మార్చడం, హ్యాక్‌చేయడం, అసలు వ్యవస్థనే మోసం చేయడం అసాధ్యం.

బ్లాక్‌చెయిన్‌ ఎలా పని చేస్తుంది?

పేరుకు తగినట్లే ఈ బ్లాక్‌చెయిన్‌ కొన్ని బ్లాక్‌ల సమూహం. ప్రతి బ్లాక్‌లో కొన్ని ట్రాన్సాక్షన్లు ఉంటాయి. వీటిని డూప్లికేట్‌ చేసి బ్లాక్‌చెయిన్‌లో ఉన్న అన్ని కంప్యూటర్‌ సిస్టమ్‌ల నెట్‌వర్క్‌కు పంపిణీ చేస్తుంది. అంటే బ్లాక్‌చెయిన్‌లో ఓ కొత్త లావాదేవీ జరిగిన ప్రతిసారీ దానికి సంబంధించిన రికార్డు అందులోని ప్రతి పార్టిసిపెంట్‌ లెడ్జర్‌కు యాడ్‌ అవుతుంది. 

మన బ్యాంకుల వ్యవస్థ కేంద్రీకృతం. ఈ బ్లాక్‌చెయిన్‌ మాత్రం వికేంద్రీకరణ జరిగి ఉంటుంది. బ్యాంకుల్లో మనం జరిపిన లావాదేవీలు మాత్రమే మన లెడ్జర్‌లో రికార్డవుతాయి. కానీ బ్లాక్‌చెయిన్‌లో మాత్రం ప్రపంచంలో ఏ మూలన ఎవరు ఏ లావాదేవీ జరిపినా.. అది ఆ బ్లాక్‌చెయిన్‌లో ఉన్న అందరి లెడ్జర్లలో రికార్డు అవుతుంది. ఆ లెక్కన ఈ వికేంద్రీకృత డేటాబేస్‌ ఒక్కరి చేతిలో ఉండదు. దీనినే డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ (డీఎల్‌టీ) అంటారు.

బ్లాక్‌చెయిన్.. పూర్తి పారదర్శకం

బ్లాక్‌చెయిన్‌ కూడా ఓ డీఎల్‌టీయే. ఈ డీఎల్‌టీలో ఒక్కసారి ధృవీకరించిన ట్రాన్సాక్షన్లు వెనక్కి తీసుకోవడం కానీ, మార్పులు చేయడం కానీ కుదరదు. అలాంటి హ్యాష్‌ అనే క్రిప్టోగ్రఫిక్‌ సిగ్నేచర్‌తో ఈ ట్రాన్సాక్షన్లు రికార్డవుతాయి. అంటే ఒక చెయిన్‌లోని ఒక్క బ్లాక్‌ మారినా అది నెట్‌వర్క్‌ మొత్తానికి తెలిసిపోతుంది. ఆ లెక్కన హ్యాకర్లు ఓ బ్లాక్‌చెయిన్‌ను మార్చాలంటే.. అందులోని ప్రతి బ్లాక్‌నూ మార్చాలి. బిట్‌కాయిన్‌, ఎథెరియంలాంటి బ్లాక్‌చెయిన్‌లలో బ్లాకులు పెరుగుతూనే ఉంటాయి. ఇలా పెరిగిన బ్లాక్‌లు ఆ చెయిన్‌కు మరింత రక్షణ అందిస్తాయి. ఇక నెట్‌వర్క్‌లోని అందరు పార్టిసిపెంట్స్‌కు ఈ లెడ్జర్‌ కాపీ అందుబాటులో ఉంటుంది కాబట్టి.. ఇది పూర్తి పారదర్శకంగా ఉంటుంది.

బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీకి ఎందుకింత క్రేజ్‌?

గతంలో డిజిటల్‌ కరెన్సీని క్రియేట్‌ చేయడానికి చాలా మంది ప్రయత్నించి ఫెయిలయ్యారు. దీనికి కారణం నమ్మకం లేకపోవడం. కొత్త కరెన్సీని తీసుకుంటే దానిని సృష్టించిన వ్యక్తి మన సొమ్మును దొంగిలించడన్న గ్యారెంటీ ఏంటి అన్న అనుమానాలు సహజమే. కానీ బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీతో వచ్చిన బిట్‌కాయిన్‌ ఈ సమస్యకు పరిష్కారం చూపించింది. 

సాధారణ డేటాబేస్‌లను వాటిని పర్యవేక్షించే వ్యక్తి ఈజీగా మార్చగలరు. కానీ ఈ బ్లాక్‌చెయిన్‌ను పర్యవేక్షించడానికి ఓ ఇన్‌చార్జ్‌ అంటూ ఎవరూ ఉండరు. ఇందులోని ప్రతి పార్టిసిపెంట్‌ దీనిని నడిపిస్తారు. ఇక బిట్‌కాయిన్లకు నకిలీలు సృష్టించడం, హ్యాక్‌ చేయడం, ఒక కాయిన్‌ను ఒకటి కంటే ఎక్కువసార్లు ఖర్చు చేయడం కుదరదు. దీంతో వీటిని కొనే వారికి నమ్మకం కుదిరింది.

బ్లాక్‌చెయిన్‌లో ట్రాన్సాక్షన్లు ఎలా?

ఓ ట్రాన్సాక్షన్‌ బ్లాక్‌చెయిన్‌కు యాడ్‌ అవ్వాలంటే కొన్ని కీలక దశలను దాటాల్సి ఉంటుంది. ముందుగా ఓ ట్రాన్సాక్షన్‌ను రిక్వెస్ట్ చేసి దానిని ప్రామాణికరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి ఓ బ్లాక్‌ క్రియేట్‌ అవుతుంది. ఆ బ్లాక్‌ను నెట్‌వర్క్‌లో ఉన్న ప్రతి నోడ్‌ (పార్టిసిపెంట్‌)కు వెళ్తుంది. ఆ నోడ్స్‌ అందరూ ఈ ట్రాన్సాక్షన్‌ను ధృవీకరిస్తారు. దీనికి బదులుగా క్రిప్టోకరెన్సీ రూపంలో నోడ్స్‌కు ఓ రివార్డు లభిస్తుంది. ఆ తర్వాత సదరు బ్లాక్‌ అప్పటికే ఉన్న బ్లాక్‌చెయిన్‌కు యాడ్‌ అవుతుంది. ఈ అప్‌డేట్‌ నెట్‌వర్క్‌లో ఉన్న అందరికీ వెళ్తుంది. ఆ తర్వాతే ట్రాన్సాక్షన్‌ పూర్తవుతుంది.

బ్లాక్‌చెయిన్‌లో ట్రాన్సాక్షన్ల ప్రామాణీకరణ, ఆమోదం ఎలా?

బ్యాంకు లేదా రెగ్యులేటర్‌ వంటి కేంద్ర వ్యవస్థ ఏదీ లేకుండానే ఈ బ్లాక్‌చెయిన్‌ వ్యవస్థ రూపొందింది. మరి అలాంటి వ్యవస్థలో ట్రాన్సాక్షన్లను ఎలా ప్రామాణీకరిస్తారు? దీనికోసం పాస్‌వర్డ్‌లాంటి క్రిప్టోగ్రఫిక్‌ కీస్‌ ఉంటాయి. ఇవి యూజర్‌ను గుర్తించి, సిస్టమ్‌లో వారి అకౌంట్‌ లేదా వాలెట్‌కు యాక్సెస్‌ ఇస్తుంది. ప్రతి యూజర్‌కు ఓ ప్రైవేట్‌ కీ, ఓ పబ్లిక్‌ కీ ఉంటాయి. 

ఈ పబ్లిక్‌ కీని ఎవరైనా చూడొచ్చు. ఈ రెండు కీలు డిజిటల్‌ సంతకాల ద్వారా యూజర్‌కు ఓ డిజిటల్‌ గుర్తింపును ఇవ్వడంతోపాటు వాళ్లు చేయాలనుకుంటున్న ట్రాన్సాక్షన్‌ను అన్‌లాక్‌ చేస్తాయి. ఒక ట్రాన్సాక్షన్‌ను యూజర్లంతా అంగీకరించిన తర్వాత దానిని ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అది బ్లాక్‌కు యాడ్‌ అవుతుంది. చెయిన్‌లో ఉన్న మెజార్టీ నోడ్స్‌ (పార్టిసిపెంట్స్‌) ట్రాన్సాక్షన్‌ను అంగీకరిస్తేనే అది చెల్లుబాటు అవుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం