PMVVY | నెలనెలా రూ. 1000 నుంచి రూ. 10 వేల పెన్షన్ ఇచ్చే స్కీమ్
ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY).. 60 ఏళ్ల వయసు నిండి నెలనెలా పెన్షన్ వచ్చేలా ఏవైనా పెన్షన్ స్కీమ్ కోసం చూసే వారికి ఈ స్కీమ్ నచ్చుతుంది. వృద్ధాప్యంలో సోషల్ సెక్యూరిటీ ఇచ్చే ఉద్దేశంతో కేంద్రం తెచ్చిన ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసీ) నిర్వహిస్తోంది.
PMVVY ఒక పెన్షన్ పథకం. 2017లో ఈ పథకం ప్రారంభమైంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించగలిగితే నెలనెలా పెన్షన్ రావడంతో పాటు, పదేళ్లు పూర్తయ్యాక మీరు ప్రీమియం కోసం వెచ్చించిన మొత్తం మీకు తిరిగి లభిస్తుంది.
అంటే మీ పెట్టుబడిపై నిర్ధిష్ట మొత్తంలో వడ్డీకి కేంద్ర ప్రభుత్వం హామీగా ఉంటుందన్నమాట. బ్యాంకు వడ్డీతో పోల్చితే ఇది మెరుగైన పొదుపు పథకం అని చెప్పొచ్చు.
PMVVYకి ఎవరు అర్హులు?
60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ అర్హులే. భారత పౌరులై ఉండాలి. గరిష్ట వయో పరిమితి ఏదీ లేదు.
పాలసీ పదేళ్లపాటు ఉంటుంది. మీకు నెలనెలా రూ. 1,000 పెన్షన్ కావాలంటే మీరు రూ. 1,50,000 చెల్లించి పీఎం వయ వందన యోజన పరిధిలో పాలసీ తీసుకోవాలి. పాలసీ కాలంలో మీకు నెలనెలా రూ. 1,000 పెన్షన్ వస్తుంది. అలాగే పాలసీకాలం పూర్తయితే మీరు కొనుగోలు చేసిన అసలు మొత్తం తిరిగి లభిస్తుంది.
ఎక్కువ మొత్తంలో పెన్షన్ కావాలంటే మీ పాలసీ కొనుగోలు ప్రీమియం పెరుగుతుంది. ఉదాహరణకు మీకు నెలకు రూ. 10 వేల పెన్షన్ కావాలంటే.. ఒకేసారి రూ. 15 లక్షలు వెచ్చించి ఈ పెన్షన్ పాలసీ కొనుగోలు చేయాలి.
PMVVY ప్రయోజనాలు..
– పాలసీదారు వెచ్చించిన మొత్తంపై హామీతో కూడిన వడ్డీ రేటుతో పెన్షన్ అందిస్తారు. 2021–22 ఆర్థిక సంవత్సరం హామీ గల వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. అంటే 31 మార్చి 2022తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న పాలసీకి ఆ పాలసీ కాలం మొత్తం 7.40 శాతం మేర వడ్డీ లభిస్తుంది. దీనిని పెన్షన్ రూపంలో ఇస్తారు.
– పాలసీకాలం పూర్తయ్యాక పాలసీ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం తిరిగి చెల్లింపు
– పాలసీకాలం మూడేళ్లు పూర్తయితే ఎమర్జెన్సీ అవసరాల కోసం 75 శాతం రుణం తీసుకోవచ్చు.
– పాలసీదారు గానీ, పాలసీదారు భార్య లేదా భర్త కోసం ఆరోగ్య అత్యవసరాలు ఉన్నప్పుడు పాలసీ సరెండర్ చేయడం ద్వారా 98 శాతం వెనక్కి వస్తుంది.
– పాలసీకాలంలో పాలసీదారుడు మరణిస్తే.. పాలసీ కొనుగోలు చేసిన మొత్తాన్ని నామినీలకు చెల్లిస్తారు.
పీఎంవీవీవైకి కావాల్సిన డాక్యుమెంట్లు ఇవీ..
వయస్సు రుజువు
ఆధార్ కార్డు
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
రెసిడెన్స్ రుజువు
పీఎంవీవీవైకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో పెన్షన్ పాలసీ విభాగంలో ఈ వయ వందన యోజనను ఎంచుకుని దరఖాస్తు నింపాలి.
లేదా దగ్గరలోని ఎల్‌ఐసీ ఏజెంట్‌ను గానీ, ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను గానీ సంప్రదించి దరఖాస్తు ఫారం నింపి సమర్పించవచ్చు.
సంబంధిత కథనం