EPIC:డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి-all you need to know and how to download your digital voter id card ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Epic:డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

EPIC:డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Manda Vikas HT Telugu
Jan 24, 2022 08:50 PM IST

భారత ఎన్నికల సంఘం (ECI) డిజిటల్ ఓటరు ID కార్డుల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (e-EPIC) అని పిలిచే ఈ డిజిటల్ ఓటర్ ID కార్డ్ PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది.

<p>Digital Voter Card</p>
Digital Voter Card (Stock Photo)

భారతీయ ఎన్నికల కమిషన్ వ్యవస్థాపక దినమైన జనవరి 25వ తేదీకి గుర్తుగా ప్రతి ఏడాదీ ఆ రోజున 'జాతీయ ఓటర్ల దినోత్సవం' కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రోత్సహించడం, అందుకు తగిన సదుపాయాలు కల్పించి, గరిష్ఠ స్థాయిలో ఓటర్ల నమోదును చేపట్టడం జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రధాన ధ్యేయం. దేశంలోని ఓటర్లందరికీ ఈ కార్యక్రమాన్ని అంకితం చేశారు. ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాల్సిన ఆవశ్యకతను తెలియజెప్పేందుకు ఈ ఓటర్ల దినోత్సవాన్ని వినియోగించుకుంటున్నారు.

ఆన్‌లైన్ ద్వారే ఓటరు కార్డు

ఓటర్ల దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా భారత ఎన్నికల సంఘం (ECI) డిజిటల్ ఓటరు ID కార్డుల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ (e-EPIC) అని పిలిచే ఈ డిజిటల్ ఓటర్ ID కార్డ్ PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది. ఓటరు ఫొటో గుర్తింపు కార్డుల డిజిటల్ రూపమైన e-EPICను ఓటర్లు ఆన్ లైన్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫిజికల్ కార్డ్‌లను ప్రింట్ చేయడానికి, వాటిని డెలివరీ చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి ఓటర్ కార్డు కోసం నమోదు చేసుకొని, కార్డును ఇంకా పొందలేని పక్షంలో పోలింగ్ సమయంలో ఓటరుకు ఎలాంటి జాప్యం జరగకుండా చూసేందుకు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్ కార్డులను ఇలా డిజిటలైజ్ రూపంలో అందిస్తున్నారు.

డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డులను దశల వారీగా ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

1. voterportal.eci.gov.in కి వెళ్లి, మీ వివరాలతో ఒక అకౌంట్ క్రియేట్ చేయండి.

2. అనంతరం, లాగిన్ చేసి, “e-EPICని డౌన్‌లోడ్ చేయండి” అనే సెక్షన్ పై క్లిక్ చేయండి

3. ఇక్క మీ EPIC నంబర్ లేదా ఫామ్ రిఫరెన్స్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది.

4. ఆ ఓటిపీ నమోదు చేసిన తర్వాత “డౌన్‌లోడ్ EPIC”పై క్లిక్ చేయండి. అంతే! మీ డిజిటల్ ఓటర్ ID కార్డ్‌ని డౌన్‌లోడ్ అవుతుంది.

ఒకవేళ మొబైల్ నంబర్ భిన్నంగా ఉన్నట్లయితే మీరు (KYC) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. KYC ద్వారా నంబర్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు డిజిటల్ ఓటర్ ID కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇదే కాకుండా, Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోగలిగే ఓటర్ మొబైల్ యాప్ నుండి కూడా మీరు మీ డిజిటల్ ఓటరు ID కార్డ్‌ని పొందవచ్చు.

జనవరి 25, 1950న ఏర్పాటైన ఎన్నికల సంఘం జ్ఞాపకార్థం e-EPICలు ప్రారంభించారు. ఫిజికల్ కార్డ్‌లను ప్రింట్ చేయడానికి, వాటిని డెలివరీ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఎలాంటి జాప్యం జరగకుండా చూసేందుకు ఓటర్ కార్డులు ఇలా డిజిటలైజ్ రూపంలో అందిస్తున్నారు.

జాతీయ ఓటర్ల దినోత్సవం

1950 సంవత్సరంలో జనవరి 25న భారతీయ ఎన్నికల సంఘం ఏర్పాటైంది. దీని జ్ఞాపకార్థం 2011 నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ జాతీయోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉత్తమమైన, ప్రతిభావంతమైన సేవలు అందించిన అధికారులకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను అందిస్తారు. 

జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ, భద్రతా నిర్వహణ, విపత్తు సమయంలో ఎన్నికల నిర్వహణ, ఓటరు అవగాహన కార్యక్రమాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ అవార్డులు కేవలం ప్రభుత్వ అధికారులకు మాత్రమే కాకుండా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్య వర్గాలుగా పరిగణించే వ్యక్తులకు, విలువైన సేవలందించిన మీడియా గ్రూపులకు కూడా ఈ జాతీయ పురస్కారాలు అందిస్తారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం