Xi Jinping: జిన్‍పింగ్ మూడోసారి.. తిరుగులేని ఆధిపత్యం!-xi jinping elected chinese president for third time ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Xi Jinping: జిన్‍పింగ్ మూడోసారి.. తిరుగులేని ఆధిపత్యం!

Xi Jinping: జిన్‍పింగ్ మూడోసారి.. తిరుగులేని ఆధిపత్యం!

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 10, 2023 10:50 AM IST

Chinese President Xi Jinping: చైనా ప్రెసిడెంట్‍గా షి జిన్‍పింగ్ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఎలాంటి తిరుగులేకుండా ఏకగ్రీవంగా ఆయన ఎంపికయ్యారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న జిన్‍పింగ్
ప్రమాణ స్వీకారం చేస్తున్న జిన్‍పింగ్ (REUTERS)

China President Xi Jinping : చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు షి జిన్‍పింగ్ (Xi Jinping). దేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన ఆయన మరోసారి చైనా (China) అధ్యక్ష పీఠాన్ని అధిష్టించారు. చైనా ‘రబ్బర్ స్టాంప్’ పార్లమెంటు.. షి జిన్‍పింగ్‍ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. గతేడాది అక్టోబర్‌లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (CCP) జనరల్ సెక్రటరీగా మరో ఐదేళ్లు ఎంపికైనప్పుడే.. అధ్యక్షుడిగా మూడోసారి జిన్‍పింగ్ ఎంపిక లాంఛనమైంది. దీనికి పార్లమెంట్ ఇప్పుడు ఆమోదం తెలిపింది.

China President Xi Jinping: నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (NCP)లోని 2,952 మంది ప్రతినిధులు షి జిన్‍పింగ్‍కు మద్దతుగా ఓటేశారు. దీంతో ఎలాంటి ఎదురులేకుండా మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టారు జిన్‍పింగ్. తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నారు. చైనా అధ్యక్షుడికి దేశంలో విశేష అధికారాలు ఉంటాయి. సెంట్రల్ మిలటరీ కమిషన్ (CMC) చైర్మన్‍గానూ ఉంటారు.

రూల్‍ను మార్చి మరీ..

China President Xi Jinping: చైనా అధ్యక్షుడిగా రెండు హయాంలు మాత్రమే ఉండాలని, 10 సంవత్సరాల తర్వాత వేరే వారికి అధికారం ఇవ్వాలనే నిబంధన 1982 నుంచి చైనాలో ఉండేది. అయితే 2018లో ఆ రూల్‍ను షి జిన్‍పింగ్ తొలగించారు. ఈ నిర్ణయానికి కూడా అప్పట్లో చైనా పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీంతో జిన్‍పింగ్ ఎంతకాలమైనా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం వచ్చింది. ఇప్పుడు వరుసగా మూడోసారి ఆయన అధికారం చేపట్టారు. 2013లో తొలిసారి ఆయన చైనా అధ్యక్ష పదవిని చేపట్టారు.

సవాళ్లు బోలెడు

China President Xi Jinping: కరోనా వైరస్ విలయం నుంచి చైనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. అయితే ఆ దేశంలో వృద్ధి ప్రస్తుతం తగ్గుతోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా తిరోగమన దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ సెక్టార్ సంక్షోభంలో ఉంది. జననాల రేటు కూడా ఆందోళనకరంగా తగ్గుతోంది. అమెరికాతో సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు దేశాలతో జగడాలు కొనసాగుతున్నాయి. ఇలా జిన్‍‍పింగ్ ముంగిట చాలా సవాళ్లు ఉన్నాయి.

జీరో-కొవిడ్ పాలసీని అమలు చేయటంతో గతేడాది షి జిన్‍పింగ్‍ ప్రభుత్వంపై చైనా ప్రజలు తిరగబడ్డారు. జీరో-కొవిడ్ పాలసీని రద్దు చేయాలంటూ ఉద్ధృతంగా ఉద్యమాలు చేశారు. చైనాలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరిగాయి. అయితే కొంతకాలానికి జీరో-కొవిడ్ పాలసీని జిన్‍పింగ్ సర్కార్ ఎత్తేసింది. అనంతరం కొవిడ్ మరణాలు చైనాలో కొద్దికాలం ఎక్కువగా నమోదయ్యాయి.

Whats_app_banner