WHO: “కొవిడ్-19 కంటే ప్రమాదకరమైన మహమ్మారి రానుంది”: ప్రపంచానికి డబ్ల్యూహెచ్‍వో హెడ్ హెచ్చరిక
WHO: కొవిడ్-19 కంటే ప్రమాదకరమైన మహమ్మారిని ప్రపంచం చూస్తుందని డబ్ల్యూహెచ్‍వో హెడ్ టెడ్రోస్ హెచ్చరించారు. అందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని సూచించారు.
WHO: ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation - WHO) హెడ్ టెడ్రోస్ అథనోమ్ (Tedros Adhanom).. హెచ్చరికలు జారీ చేశారు. తదుపరి మహమ్మారికి ప్రపంచం సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈసారి వచ్చే మహమ్మారి కొవిడ్-19 కన్నా ప్రమాదకరంగా, ప్రాణాంతకంగా ఉంటుందని చెప్పారు. కొవిడ్-19 నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే ప్రపంచం కుదురుకుంటున్న వేళ అథనోమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ మహమ్మారి ఏంటనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ప్రపంచం సిద్ధంగా ఉండాలని అన్నారు. స్విట్జర్లాండ్ జెనీవాలోని డబ్ల్యూహెచ్‍వో ప్రధాన కార్యాలయంలో జరిగిన యాన్యువల్ హెల్త్ అసెంబ్లీలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాలివే..
WHO: “గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కొవిడ్-19 ముగిసిందని ప్రకటించినంత మాత్రాన.. ప్రపంచ ఆరోగ్యానికి కొవిడ్-19 ముప్పు పూర్తిగా తొలగినట్టు కాదు” అని టెడ్రోస్ అన్నారు. “మరో వేరియంట్ ముప్పు పెరుగుతోంది. అది కొత్త వ్యాధికి, మరణాలకు కారణం కావొచ్చు. ప్రాణాంతకమైన మరొక వ్యాధికారక ముప్పు ఇంకా మిగిలి ఉంది” అని టెడ్రోస్ పేర్కొన్నారు. 76వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ రిపోర్టును కూడా డబ్ల్యూహెచ్‍వో హెడ్ టెడ్రోస్ ప్రెజెంట్ చేశారు.
WHO: “తర్వాతి మహమ్మారి తలెత్తినప్పుడు మనం (ప్రపంచమంతా) సమిష్టిగా, నిర్ణయాత్మకంగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలి. కలిసికట్టుగా ఎదుర్కోవాలి” అని టెడ్రోస్ సూచించారు. అన్ని రకాల అత్యవసర పరిస్థితులను పరిష్కరించే అంతర్జాతీయస్థాయి యంత్రాంగం అవసరం ఉందని అన్నారు. “భవిష్యత్తు మహమ్మారులను ఎదుర్కొనేందుకు మార్గాలను కనిపెట్టేందుకు ఈ తరం అంకిత భావం చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓ చిన్న వైరస్ ఎంత నష్టం చేయలదో ఈ తరమే చూసింది” అని టెడ్రోస్ అథనోమ్ సూచించారు.
WHO: ఆరోగ్యపరమైన లక్ష్యాలను సాధించే విషయంలో కొవిడ్-19 చాలా అవరోధాలను తెచ్చిపెట్టిందని టెడ్రోస్ చెప్పారు. 2017లో నిర్దేషించుకున్న ట్రిపుల్ బిలియన్ టార్గెట్‍పై ఆ మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పారు.
కొవిడ్-19 కారణంగా మూడేళ్ల పాటు ప్రపంచంపై తీవ్ర ప్రభావం పడింది. కొవిడ్-19 వల్ల ప్రపంచంలో సుమారు 70లక్షల మంది చనిపోయారని డబ్ల్యూహెచ్‍వో లెక్కలు చెబుతున్నాయి. అయితే, కనీసం 2 కోట్ల మంది మరణించి ఉంటారని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. కొవిడ్-19 కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.