రాజకీయ విశ్లేషణ: మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ చట్టం అమలెప్పుడు?-womens reservation bill what is it when it will be implemented a political analysis ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రాజకీయ విశ్లేషణ: మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ చట్టం అమలెప్పుడు?

రాజకీయ విశ్లేషణ: మ‌హిళా రిజ‌ర్వేష‌న్‌ చట్టం అమలెప్పుడు?

HT Telugu Desk HT Telugu
Sep 28, 2023 09:50 AM IST

‘ఓట్ల‌ కోస‌మో, మైలేజీ కోస‌మో, లేక స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డ కోస‌మో కానీ మహిళా బిల్లును పార్ల‌మెంట్ ఆమోదం పొందేందుకు బీజేపీ స‌ర్కార్ ప్రయత్నించింది..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చర్ జె.జగదీశ్వర్ విశ్లేషణ.

పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్
పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ (ANI )

లోక్‌స‌భ‌, రాష్ట్ర శాస‌న స‌భల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ ఉద్దేశించిన‌ మ‌హిళ రిజర్వేష‌న్ (రాజ్యాంగంలో 128వ సవరణ) బిల్లు చాలా కాలానికి పార్ల‌మెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లుకు "నారీశ‌క్తి వంద‌న్ అధినియ‌మ్" అని నామ‌క‌ర‌ణం కూడా చేశారు. ఈ బిల్లు కేవలం 24 గంటల కంటే తక్కువ వ్యవధిలోనే ఆమోదించి పార్లమెంట్‌ చరిత్ర సృష్టించింది. రానున్న ఎన్నిక‌ల్లో ఓట్ల‌ కోస‌మో, మైలేజీ కోస‌మో, లేక స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డ కోస‌మో కానీ పార్ల‌మెంట్ ఆమోదానికి కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ ముందుకొచ్చింది. ఒక పార్టీ త‌ప్ప అన్ని పార్టీలు ఏకోన్ముకంగా మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చాయి. అందుకే రాజ్య‌స‌భ‌లో 214 ఓట్ల‌తో ఏక‌గ్రీవంగానూ, లోక్‌స‌భ‌లో 454ః 2 ఓట్ల భారీ తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఇంతవ‌ర‌కు బాగున్న‌ప్ప‌టికీ, రిజ‌ర్వేష‌న్ల అమ‌లుపైనే అనేక సందేహాలు క‌లుగుతున్నాయి.

గత నాలుగు దశాబ్దాలుగా దేశంలోని రాజకీయ నాయకులందరూ చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇస్తూనే ఉన్నారు. సంఖ్యాపరంగా చూస్తే ఇది మహిళలకు బలం చేకూర్చే విషయమే. అయితే మహిళల బలం కేవలం సంఖ్య పైనే ఆధారపడి ఉంటుందా? అనేదే ప్రశ్న‌. అయితే చట్టసభల్లో మహిళల సంఖ్యను పెంచినంత మాత్రాన వారికి అధికారాలు లభించవు. ఇప్పటికీ రాజకీయాలలో పురుషుల పెత్తనమే కొనసాగుతోంది. మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవుతున్నప్పటికీ వారి భర్తలో, ఇతర కుటుంబ సభ్యులో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కాబట్టి కేవలం మహిళల ప్రాతినిధ్యం పెంచి చేతులు దులుపుకుంటే సరిపోదు. మహిళా సాధికారత స్ఫూర్తిని కొనసాగిస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. విధాన నిర్ణయాలలో మహిళలకు పురుషుల నుంచి సంస్థాగతమైన, నిర్మాణపరమైన అధికారాలు బదిలీ కావాలి. అప్పుడే మహిళా సాధికారతకు సార్థకత చేకూరుతుంది. కారణాలు, ఉద్దేశ్యాలు ఏమైనప్పటికీ ముందు రోజు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపి, మరుసటి రోజు లోక్‌సభ, తరువాత రాజ్యసభలో ఆమోదానికి పెట్టారు. లోక్‌సభలో ఇద్దరున్న మజ్లిస్‌ మినహా మిగిలిన పార్టీలేవీ వ్యతిరేకంగా ఓటు వేయలేదు. రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తరువాత లోక్‌సభ, ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఈ పరిణామాన్ని ఎలా ఉపయోగించుకుంటుందో, ప్ర‌జ‌ల‌కు ఏం చెబుతుందో, ఓటర్లు ఎలా స్వీకరిస్తారో ? చూడాలి.

27 ఏళ్లుగా పెండింగ్‌

మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. మొదట ఈ బిల్లుని 1996లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఆ బిల్లును రూపొందించినప్పుడు గీతా ముఖర్జీ నాయకత్వంలోని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏడు సూచనలు చేసింది. ఆ తరువాత‌ 1998, 1999తో పాటు 2008, 2010లో పార్లమెంట్‌లోకి వచ్చింది. కానీ చట్టంగా మారలేదు. 1996లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన ఏడు సూచనల్లో ఐదింటిని 2008 బిల్లులో చేర్చారు. వీటితో పాటు ఆంగ్లో ఇండియన్లకు 15 ఏళ్ల పాటు రిజర్వేషన్, సబ్ రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదన కూడా ఉంది. 1996 సెప్టెంబర్ 12న దేవేగౌడ ప్రభుత్వం తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టింది. కానీ అది ఆమోదం పొందలేదు. ఈ బిల్లును 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టారు.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం 1998లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో మళ్లీ ప్రవేశపెట్టింది. అయితే, ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్న కొన్ని పార్టీలు బిల్లుని వ్యతిరేకించాయి. దీంతో బిల్లు ఆమోదం పొందలేకపోయింది. వాజ్‌పేయి ప్రభుత్వం 1999, 2002లతో పాటు 2003-2004లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించడానికి ప్రయత్నించింది. కానీ, అవేవీ సఫలం కాలేదు. 2004లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన త‌రువాత‌ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లును 2008లో 108వ రాజ్యాంగ సవరణ బిల్లుగా రాజ్యసభలో ప్రవేశపెట్టింది. 2010 మార్చి 9న రాజ్యసభ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు బీజేపీ, వామపక్షాలు, జేడీయూ మద్దతు తెలిపాయి. యూపీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేదు. అప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లుని సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్‌ వ్యతిరేకించాయి. ఈ రెండు పార్టీలు యూపీఏలో భాగం కావడంతో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెడితే తమ ప్రభుత్వం ప్రమాదంలో పడుతుందని కాంగ్రెస్‌ భయపడింది.

2008లో బిల్లుని స్టాండిగ్ కమిటీ ఆన్ లా అండ్ జస్టిస్‌ పరిశీలనకు పంపారు. అయితే ఈ సంఘంలో ఇద్దరు సభ్యులు వీరేంద్ర భాటియా, శైలేంద్ర కుమార్ సమాజ్ వాదీ పార్టీ నాయకులే. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాకున్నప్పటికీ బిల్లును రూపొందించిన తీరుతో వారు ఏకీభవించలేదు. పార్టీలు అభ్యర్థుల ఎంపికలో 20 శాతం మహిళలకు టిక్కెట్లు ఇవ్వాలని, మహిళా రిజర్వేషన్ 20 శాతం దాటకూడదని వాళ్లిద్దరూ సిఫార్సు చేశారు. 2014లో లోక్‌సభ రద్దయిన తర్వాత ఈ బిల్లు ఆటోమేటిక్‌గా రద్దయింది. కానీ రాజ్యసభ శాశ్వత సభ కావడంతో అది ఇప్పటికీ సజీవంగానే ఉంది.

వాగ్ధానం అమ‌లులో బిజెపి జాప్యం

రాజ్యసభలో 2010లోనే ఆమోదం పొందిన రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందితే సరిపోతుంది. యుపిఏ ఏలుబడిలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని పార్టీల వ్యతిరేకత, అభ్యంతరాల కారణంగా అది లోక్‌సభలోకి రాలేదు. తాము అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లుకి మోక్షం కల్పిస్తామని బీజేపీ ఎన్నికల మేనిపెస్టోలో ప్రకటించినప్పటికీ 2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తరువాత‌ పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ 2017లో ప్రధానికి లేఖ రాస్తూ ఈ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడైన తరువాత‌ 2018 జూలై 16న ప్రధాని మోడీకి రాసిన లేఖలో తమ పార్టీ మద్దతును పునరుద్ఘాటించారు.

2014లో, 2019లో అవసరమైన మెజార్టీ, సగానికంటే ఎక్కువ రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలే ఉన్నందున ఆ బిల్లు ఆమోదానికి ఆటంకం లేదు. అయినప్పటికీ తొమ్మిదేళ్లుగా దాని ప్రస్తావన, అసలు చొరవే బిజెపి చూపలేదు. నిజానికి అధికారానికి వచ్చిన వెంటనే ఆమోదం పొంది ఉంటే, తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా 2011 జనాభా ప్రాతిపదికన ఉన్న సీట్లలోనే మహిళల కోటా అమలు జరిగేది. నియోజ‌క‌వ‌ర్గాల పునర్విభజనతో నిమిత్తం లేకుండా అవసరమైన రాజ్యాంగ సవరణ చేసి ఉంటే అమల్లోకి వచ్చి ఉండేది. కానీ ఆ చిత్తశుద్ధితో మోడీ స‌ర్కార్ వ్య‌వ‌హ‌రించ‌లేదు. అందుకే బిల్లు తీసుకొచ్చిన‌ప్ప‌టికీ అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. నాటకీయ పరిణామాల మధ్య నరేంద్ర మోడీ సర్కార్‌ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో 33 శాతం మహిళా రిజ‌ర్వేష‌న్‌ బిల్లును తీసుకొచ్చింది. అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని అమలుకు బాటపడుతుంది.

ఎన్నో ఏళ్లు...ఎన్నెన్నో పోరాటాలు

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు కోసం దేశంలో ఎన్నో ఏళ్ల‌గా, ఎన్నెన్నో పోరాటాలు జ‌రిగాయి. ఇందులో రెండు ర‌కాలుగా పోరాటాలు జ‌రిగాయి. రోడ్ల‌పైన అలుపెర‌గ‌ని ప్ర‌జా పోరాటం, మ‌రోవైపు న్యాయస్థానాల్లో పోరాటాలు జ‌రిగాయి. మ‌హిళా సంఘాలు, మ‌హిళా నేత‌లు పోరాట ఫ‌లితంగా ఈ బిల్లు పార్ల‌మెంట్ వ‌ర‌కు వ‌చ్చింది. ద‌శాబ్దాలుగా ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు అనేక పోరాటాలు జ‌రిగాయి. వామ‌ప‌క్షాలతో పాటు వివిధ పార్టీలు కూడా పోరాటాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తున్నాయి. మ‌రోవైపు అన్ని పార్టీలు త‌మ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు అమ‌లు చేస్తామ‌ని పెడుతున్నాయి. కానీ అమ‌లు చేయ‌డం లేదు. దీంతో మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని ఇటీవ‌లి కొంత మంది మ‌హిళా సంఘాల నేత‌లు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని కూడా ఆశ్ర‌యించారు. సుప్రీం కోర్టు కూడా రాజ‌కీయ‌పార్టీలకు, కేంద్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమాధానం ఇవ్వాల‌ని సుప్రీం కోర్టు నోటీసులు ఇస్తే, కేవ‌లం సిపిఎం మిన‌హా మ‌రే పార్టీ కూడా సుప్రీం కోర్టులో అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌లేదు. దీంతో సుప్రీం కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కానీ అమ‌లు చేయ‌డం లేదు. మ‌హిళా సంఘాల న్యాయ పోరాటంతో కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అందులో భాగంగానే ఈ బిల్లు పార్ల‌మెంట్ ఆమోదానికి నోచుకుంది.

మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల‌పై ఎందుకు వ్య‌తిరేకత‌?

1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 'సమానత్వం వైపు' పేరుతో ఒక నివేదిక వెలువడింది. ఇందులో ప్రతి రంగంలో మహిళల స్థితిగతుల వివరాలను పొందుపరిచారు. ఈ రిపోర్టులో మహిళలకు రిజర్వేషన్‌పై కూడా చర్చ జరిగింది. నివేదికను రూపొందించిన కమిటీలో మెజారిటీ సభ్యులు మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. మహిళలు స్వశక్తితో రాజకీయాల్లో ఎదగాలని, రిజర్వేషన్ల ద్వారా కాదని వాదించారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడానికి ప్రయత్నించారు. అయితే రాష్ట్ర అసెంబ్లీలు దానిని వ్యతిరేకించాయి. పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సమాజ్ వాదీ పార్టీ, జేడీయూ, ఆర్జేడీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. మహిళలకిస్తున్న 33 శాతం రిజర్వేషన్‌లో 33 శాతం వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఇవ్వాలనేది ఈ పార్టీల డిమాండ్.

1996లో దేవేగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వానికి మద్దతిస్తున్న ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ బిల్లును వ్యతిరేకించారు.

1997 జూన్‌లో ఈ బిల్లును ఆమోదించడానికి మళ్లీ ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో శరద్ యాదవ్ బిల్లును వ్యతిరేకిస్తూ.. ‘మా మహిళల గురించి అగ్రవర్ణాల మహిళలు ఏం అర్థం చేసుకుంటారు, ఏమనుకుంటారు?’ అని ప్రశ్నించారు.

1998లో 12వ లోక్‌సభలో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు న్యాయశాఖ మంత్రి ఎన్.తంబిదురై ప్రయత్నించారు. ఆ సమయంలో ఆర్జేడీ ఎంపీ ఒకరు వెల్‌లోకి దూసుకెళ్లి బిల్లు కాపీలను చించేశారు.

1999లో 13వ లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును రెండుసార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రయత్నించింది.

2003లో వాజ్‌పేయి ప్రభుత్వం మరోసారి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించింది. అయితే ప్రశ్నోత్తరాల సమయంలోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో బిల్లు ఆమోదం పొందలేదు.

2010లో యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు తాము ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని సమాజ్‌వాది పార్టీ, ఆర్జేడీ బెదిరించాయి. ఆ తరువాత బిల్లుపై ఓటింగ్ వాయిదా పడింది. తరువాత అదే ఏడాది మార్చి 9 రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 186 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఒక‌రు ఓటు వేశారు. బిల్లును వ్యతిరేకించిన ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటకు తీసుకెళ్లారు.

బిల్లులో ఏముందీ?

లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాల‌ని బిల్లులో ఉంది. ఈ 33 శాతం రిజర్వేషన్‌లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ఉప-రిజర్వేషన్లు కల్పించే నిబంధన ఉంది. కానీ ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించలేదు. ప్రతీ లోక్‌సభ ఎన్నికల తరువాత‌ రిజర్వ్‌డ్ స్థానాలను మార్చాలని బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ ప‌ద్ధ‌తితో రిజర్వ్‌డ్ సీట్లను కేటాయించవచ్చని సూచించారు. ఈ సవరణ చట్టం అమలులోకి వచ్చిన 15 ఏళ్ల తరువాత‌ మహిళలకు సీట్ల రిజర్వేషన్ ముగుస్తుంది. ఢిల్లీ అసెంబ్లీకి కూడా వ‌ర్తిస్తుంది. రాజ్యస‌భ‌కు, రాష్ట్రాల శాస‌న మండ‌లికి ఈ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించ‌దు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న త‌రువాత ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని బిల్లులో పేర్కొన్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌ర‌గాలంటే జ‌నాభా లెక్క‌లు పూర్తి కావాలి. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వం హ‌యంలో తీసుకొచ్చిన బిల్లులో ఆంగ్లో ఇండియ‌న్ల‌కు కొన్ని సీట్లు ప్ర‌తిపాదించ‌గా, ప్ర‌స్తుత బిల్లుతో ఆ నిబంధ‌న‌ తొలగించారు.

ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?

ఏ అసెంబ్లీ, లోక్‌సభ నియోజ‌క‌వ‌ర్గాల్లోని ఓటర్లలో పురుషులు ఎందరు, మహిళలు ఎందరు అనే వివరాలు ఇప్పటికే ఉన్నాయి. క‌నుక కొందరు ఆ స్థానాలను ఉటంకిస్తూ అవన్నీ మహిళలకు రిజర్వు చేయబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అసలు ఈ రిజర్వేషన్లు ఎప్పుడు అమల్లోకి వస్తాయంటే కొందరు 2029 నాటికి అని, మరికొందరు 2034 లేదా ఆ తరువాతే అని భాష్యం చెబుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పెరిగేదీ, ఎక్కడ ఎన్ని సీట్లు తగ్గేది కూడా కొన్ని అంకెలను కూడా ఉటంకిస్తున్నారు. తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం రిజర్వేషన్లు పదిహేను సంవత్సరాల పాటు అమల్లో ఉంటాయి. షెడ్యూలు కులాలు, తరగతులకు నిర్దేశించిన సీట్లలో కూడా మూడో వంతు సీట్లను మహిళలకు కేటాయిస్తారు. వెనుకబడిన తరగతుల మహిళకు రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదు.

జ‌న‌గ‌ణ‌న‌తోనే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌

పదేళ్లకు ఒకసారి జరిగే జన గణన తరువాత లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన నిర్ణయం. స్వాతంత్య్రం వచ్చాక 1952లో తొలిసారి, తర్వాత, 1962, 1972, 2002ల్లో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీన్ని అమలు చేసేందుకు ఏర్పాటు చేసే కమిషన్‌కు ఒక విశ్రాంత సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, రాష్ట్రాల ఎన్నికల అధికారులు ఉంటారు. దాని నిర్ణయాన్ని ఆమోదించటం తప్ప ఏ కోర్టులోనూ సవాలు చేసే అవకాశం లేదు. ఆ మేరకు 1952, 1963, 1973లో జరిగాయి. 1973 తరువాత పాతికేళ్ల పాటు ఆ ప్రక్రియను స్థంభింప చేస్తూ 1976లో పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేశారు. 1976లో జరిగిన రాజ్యాంగ సవరణ తర్వాత 2001 వరకు లోక్‌సభ నియోజకవర్గాల విస్తరణ నిలిపి వేశారు. అలాగే 2001లో జరిగిన రాజ్యాంగ సవరణతో మరో పాతికేళ్లపాటు 2026 వరకు లోక్‌సభ నియోజక వర్గాల పునర్విభజనను నిలిపేశారు.

2008లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి, దాని ప్రకారం 2009 నుంచి తదుపరి ఎన్నికలు జరిగాయి. కానీ సీట్ల సంఖ్య పెరగలేదు. దీంతో లోక్‌సభ సభ్యుల సంఖ్య 543గానే ఉండిపోయింది. ప్రస్తుత నియోజకవర్గాలను 2001 జనాభా లెక్కల ప్రకారం 2002లో ఏర్పాటు చేసిన కమిషన్ ద్వారా ఏర్పాటు చేశారు. 2021లో జనాభా లెక్కల జరగలేదు కాబట్టి, వాటిని నిర్వహించాలన్న ఆలోచనను ప్రస్తుత ప్రభుత్వం చేయకపోతే తదుపరి జనాభా లెక్కలు 2031లో ఉంటాయి. దీని తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. దాని నిర్ణయం ప్రకారం మహిళలకు సీట్లను కేటాయిస్తారు.

దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌

తొలి లోక్‌సభలో 494 స్థానాలుండ‌గా, తరువాత పదేళ్ల‌కు 522కు పెంచారు. మరో పదేళ్ల‌ తరువాత 542కు పెంచారు. ఆ ప్రక్రియ తరువాత సిక్కిం స్థానాన్ని పెంచడంతో 543 అయ్యాయి. వీటిలో పదమూడు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి 2026 వరకు ఆ సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు. మధ్యలో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలలో కొన్ని ప్రాంతాలూ, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు అటూ ఇటూ అయ్యాయి. కొన్ని నియోజవర్గాలు రద్దు, కొన్ని కొత్తవి వచ్చాయి.

తెలంగాణలో జనాభా పెరగటంతో ఆంధ్ర ప్రాంతంలో సీట్లు తగ్గాయి. ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించిన తరువాత ఎక్కడ ఉన్న సీట్లు అక్కడే ఉన్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ సీట్లను 119 నుంచి 153కు, ఆంధ్ర ప్రదేశ్‌లో 175ను 225కు పెంచుతామని వాగ్దానం చేసినందున 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియలో భాగంగా అవి అమల్లోకి వస్తాయి.

జ‌న‌గ‌ణ‌న వాయిదాతో రిజ‌ర్వేష‌న్ అమ‌లుకు జాప్యం

2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. గడువు ప్రకారం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి వుంది. అందువలన జనగణన జరుగుతుందా? మరుసటి ఏడాదికి వాయిదా పడుతుందా? అన్నది ప్రస్తుతానికి స్ప‌ష్టత లేదు. 2026 లోపు జనగణన జరుగుతుందనే భావనతో తరువాత జరిగే పునర్విభజన ప్రకారం 2029 లోక్‌సభ ఎన్నికలు, గడువు ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం కేటాయించాల్సి ఉంటుందని అందువలన 2029లో అమలు జరుగుతాయని కొందరు భాష్యం చెబుతున్నారు. ఇక పార్లమెంట్‌ ఆమోదించిన 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తరువాత జరిగే పునర్విభజన ప్రక్రియకు ఆ తరువాత జరిగే అంటే 2031లో జరిగే జనగణన ప్రాతిపదికన జరగాల్సి ఉంటుంది. 2021లో జరగాల్సిన జనగణన 2024 లేదా 2025లో జరిగితే పదేళ్లు గడవకుండానే మరోగణన 2031లో జరుపుతారా? లేక పదేళ్లు అంటే 2034 లేదా 2035లో జరుపుతారా? అన్నది స్ప‌ష్ట‌త లేదు.

ఒకవేళ అదే జరిగితే ఆ తరువాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అయితే భారత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం, 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ప్రకారం అంటే 2031లో జరిగే జ‌నాభా లెక్క‌ల ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అప్పటి వరకు, 2001 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలు కొనసాగుతాయి. అందుకే కపిల్‌ సిబాల్‌ వంటి న్యాయకోవిదులు 2034కు ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పారు. రెండోది పునర్విభజన ప్రక్రియకు నిర్ణీత కాలవ్యవధి లేదు. ఈ నేపథ్యంలో ఆమోదించిన బిల్లు చట్టమై ఎప్పటికి అమల్లోకి వస్తుంది? అసలు ఏం జరగబోతోంది? అనేవి ప్రస్తుతానికి జవాబుల్లేని ప్రశ్నలుగా మిగిలాయి.

అత్యధిక మహిళా ఎంపీలు ఉన్న దేశాల్లో పార్టీల్లో రిజర్వేషన్లు

థింక్ ట్యాంక్ అధ్యయనం ప్రకారం, అధిక సంఖ్యలో మహిళా ప్రతినిధులను కలిగి ఉన్న అనేక దేశాల్లో కోటాను తప్పనిసరి చేసే చట్టాలు లేవు. అయితే రాజకీయ పార్టీలలో రిజర్వేషన్లు ఉన్నాయి. పిఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ విశ్లేష‌ణ ప్ర‌కారం స్వీడన్‌లో 46 శాతం, నార్వేలో 46 శాతం, దక్షిణాఫ్రికాలో 45 శాతం, ఆస్ట్రేలియాలో 38 శాతం, ఫ్రాన్స్‌లో 35 శాతం, జర్మనీలో 35 శాతం ప్రజా ప్రతినిధులలో మహిళలు ఉన్నారు. 21 శాతం మహిళా ఎంపీలు ఉన్న బంగ్లాదేశ్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చట్టం ఉంది. బంగ్లాదేశ్ పార్లమెంట్‌లోని 300 సీట్లలో 50 మహిళలకు రిజర్వు చేయబడ్డాయి.

పార్ల‌మెంట్‌లో మ‌హిళా ప్రాతినిధ్యం

ప్రస్తుతం పరిపాలనలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. రాజకీయాల నుండి కార్పొరేట్‌ స్థాయి వరకూ మహిళల భాగస్వామ్యం పురుషులతో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. 2021లో మహిళలలో అక్షరాస్యత రేటు 91.95 శాతం ఉంది. అయినప్పటికీ వివిధ రంగాలలో వారి భాగస్వామ్యం చాలా స్వల్పంగానే ఉంటోంది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలలో పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా కన్పిస్తోంది. మహిళలకు తాము కోరుకున్న రంగాలలో ప్రవేశం లభించడం లేదు. స్వాతంత్య్రానంతరం కొలువుదీరిన మంత్రివర్గాలలో మహిళల సంఖ్య ఎన్నడూ 20శాతం దాటలేదు.

దేశంలో ప్ర‌స్తుతం 82 మంది (15 శాతం) మ‌హిళా ఎంపిలు మాత్ర‌మే ఉన్నారు. రాజ్యస‌భలో 31 మంది (14.05 శాతం) మంది మ‌హిళ ఎంపిలు మాత్ర‌మే ఉన్నారు. లోక్‌సభలో 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా గెలిచే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది. కానీ బీజేపీలో కేవ‌లం 14 శాతం, కాంగ్రెస్‌లో కేవ‌లం 12 శాతం మంది మ‌హిళా ఎంపీలు ఉన్నారు. వీటితో పోల్చితే ప్రాంతీయ పార్టీలైన బీజేడీలో 42 శాతం, టీఎంసీలో 39 శాతం మ‌హిళా ఎంపీలు ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టిఎంసి, బిజెడి అత్యధిక మహిళా అభ్యర్థులను నిలబెట్టాయి. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో అయితే మహిళల ప్రాతినిధ్యం పది శాతం కంటే తక్కువగా ఉంది.

రాష్ట్రాల అసెంబ్లీలో మ‌హిళా భాగ‌స్వామ్యం

ఇక రాష్ట్రాల విషయానికి వస్తే 1947 తర్వాత వివిధ రాష్ట్రాలలో 350 మంది పురుష ముఖ్యమంత్రులు పనిచేయగా, కేవలం 14 మంది మహిళలు మాత్రమే ముఖ్యమంత్రులు అయ్యారు. శాసనసభలో మహిళా ప్రజా ప్రతినిధుల సంఖ్య సింగిల్ డిజిట్‌లో ఉన్న రాష్ట్రాల్లో అరుణాచల్‌ప్రదేశ్ (4), అస్సాం (5), ఢిల్లీ (6), గోవా (3), హిమాచల్ ప్రదేశ్ (1), మణిపుర్ (5), మేఘాలయ (3), నాగాలాండ్ (2), సిక్కిం (3), తెలంగాణ(6), హర్యానా (9), త్రిపుర (9), ఉత్తరాఖండ్ (9) ఉన్నాయి. డ‌బుల్ డిజిట్‌లో ఆంధ్రప్రదేశ్ (14), కేరళ (12), తమిళనాడు (12), కర్ణాటక (10), బిహార్ (28), ఛ‌త్తీస్‌గ‌ఢ్ (16), గుజరాత్ (15), జార్ఖండ్ (11), మధ్యప్రదేశ్ (25), మహారాష్ట్ర (24), ఒరిస్సా (18), పంజాబ్ (13), రాజస్థాన్ (28), ఉత్తర ప్రదేశ్ (48), ప‌శ్చిమ బెంగాల్ (41) అసెంబ్లీల్లో మహిళల మ‌హిళ ఎమ్మెల్యే ఉన్నారు. శాసనసభలో మహిళా ప్రజా ప్రతినిధుల శాతం సింగిల్ డిజిట్‌లో ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, ఒరిస్సా, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, పాండిచ్చేరి ఉన్నాయి. బిహార్, హ‌ర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, దిల్లీ అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం 10 నుంచి 12 శాతం మధ్య ఉందని గతేడాది డిసెంబర్‌లో ప్రభుత్వం వెల్లడించిన వివరాలు చెబుతున్నాయి. దేశంలో మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల విషయానికొస్తే చత్తీస్‌గఢ్ (14.44 శాతం), పశ్చిమబెంగాల్ (13.7 శాతం), జార్ఖండ్ (12.35 శాతం) రాష్ట్రాలు ముందున్నాయి.

ప్ర‌స్తుత అంచ‌నా ప్రకారం మ‌హిళ‌ల‌కు ఎన్ని సీట్లు వ‌స్తాయి

చట్టం అమలులోకి వస్తే లోక్‌సభలో 545 స్థానాలుండగా మహిళల సంఖ్య 181 స్థానాలకు పెరుగుతుంది. ప్రస్తుతం లోక్‌సభలో 81 మంది మహిళా ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. ఏపీలో 175 నియోజకవర్గాల్లో 58, తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో 39 స్థానాలు మహిళలకు కేటాయించే అవ‌కాశ‌ముంది. అయితే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రిగితే, నియోజ‌క‌వ‌ర్గాలు పెరిగితే, అప్పుడు మ‌హిళ రిజ‌ర్డ్వ్ స్థానాలు కూడా పెరుగుతాయి.

అన్నింటిలోనూ వెనక్కి

రాజ‌కీయాల్లో ప్రాతినిధ్యం దొర‌క‌లేదంటే, పోనీ బ్యూరోక్ర‌సీలో స‌రైనా ప్రాధాన్య‌త దొరికిందా అంటే అదీలేదు. ముఖ్యమైన అధికారులుగా మహిళలు గణనీయమైన సంఖ్యలో లేరు. సీబీఐ, ఈడీ, ఐబీ వంటి సంస్థలకు మహిళలు నేతృత్వం వహించలేదు. ఎన్నికల కమిషన్‌, సాయుధ దళాలు, సుప్రీంకోర్టు, ఆర్‌బీఐ వంటి వాటిలో కూడా ఇప్పటి వరకూ మహిళా బాస్‌లు లేరు. దేశంలోని 200 ప్రభుత్వ రంగ కంపెనీలలో ఓ డజను కంపెనీలకు మాత్రమే మహిళా సీఈఓలు ఉన్నారు. క్యాబినెట్‌ కార్యదర్శి, రక్షణ కార్యదర్శి, హోం కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి వంటి కీలక పదవులేవీ మహిళలను వరించలేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌హిళా సాధికారిత సాధ్య‌మా? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తున్నాయి.

-జె.జ‌గ‌దీశ్వ‌ర‌రావు,

పీపుల్స్ ప‌ల్స్ రీసెర్చ్ సంస్థ‌

జె.జగదీశ్వరరావు, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
జె.జగదీశ్వరరావు, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
Whats_app_banner