Madhya Pradesh: ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై గొడవ తర్వాత.. బాయ్‍ఫ్రెండ్‍పై రేప్ కేసు పెట్టిన యువతి-woman lodged rape case on boyfriend after fight over the kerala story movie says police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Woman Lodged Rape Case On Boyfriend After Fight Over The Kerala Story Movie Says Police

Madhya Pradesh: ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై గొడవ తర్వాత.. బాయ్‍ఫ్రెండ్‍పై రేప్ కేసు పెట్టిన యువతి

Chatakonda Krishna Prakash HT Telugu
May 23, 2023 08:05 AM IST

Madhya Pradesh: ది కేరళ స్టోరీ సినిమా చూసిన తర్వాత బాయ్‍ఫ్రెండ్‍తో గొడవ జరగగా.. అతడిపై ఆ యువతి కేసు పెట్టింది. తనను మతం మారాలంటూ అతడు వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Madhya Pradesh: అత్యాచార ఆరోపణలపై ఓ 23 ఏళ్ల యువకుడిని మధ్యప్రదేశ్‍లోని ఖజ్రానా (Khajrana) పోలీసులు అరెస్ట్ చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, రిలేషన్‍లో ఉంటూ ఇప్పుడు మతం మారాలని అతడు ఒత్తిడి చేస్తున్నాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. తనను రేప్ చేశాడని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ది కేరళ స్టోరీ (The Kerala Story) సినిమా చూసిన తర్వాత ఆ ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగిందని.. ఆ తర్వాత ఆ యువతి.. అతడిపై అత్యాచార కేసు పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. వివరాలు ఇవే.

Madhya Pradesh: మోసపూరితంగా/బలవంతంగా మతమార్పిడిని నిషేధించే మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021, ఐపీసీ సెక్షన్ల కింద ఆ యువకుడిని అరెస్టు చేసినట్టు ఖజ్రానా పోలీస్ స్టేషన్ ఇన్‍చార్జ్ దినేశ్ వర్మ.. రిపోర్టర్లకు చెప్పారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమలో పడి, సహజీవనం చేసిన తర్వాత మతం మారాలని అతడు ఒత్తిడి చేస్తున్నాడని ఆ యువతి ఫిర్యాదు చేసినట్టు దినేశ్ తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మతం మారాల్సిందేనని తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆ ఆమె ఫిర్యాదు చేసింది.

Madhya Pradesh: “అతడితో కలిసి తాను కేరళ స్టోరీ సినిమాను చూసేందుకు ఇటీవల వెళ్లినట్టు ఆ మహిళ చెప్పారు. సినిమా చూసిన తర్వాత, ఇద్దరి మధ్య వాదన జరిగింది. అతడు.. ఆమెపై దాడి చేసి వెళ్లిపోయాడు. మే 19వ తేదీన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఎఫ్ఐఆర్ నమోదైంది” అని ఆ పోలీసు అధికారి చెప్పారు.

నిందితుడు ప్రస్తుతం నిరుద్యోగిగా ఉండగా.. ఆ యువతి ఉన్నత చదువులు చదివి ప్రస్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోందని ఆయన తెలిపారు. ఓ కోచింగ్ సెంటర్‌లో అతడితో తనకు నాలుగేళ్ల క్రితం పరిచయం అయిందని ఆమె చెప్పినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ మహిళ చేసిన అన్ని ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని దినేశ్ వర్మ చెప్పారు.

భారీ కలెక్షన్లు

కాగా, కేరళలోని అమ్మాయిను కొందరు ట్రాప్ చేసి.. మతమార్పిడులకు పాల్పడి ఉగ్రవాదంలో చేరుస్తున్నారనే కథాంశంతో ది కేరళ స్టోరీ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తీవ్ర వివాదాస్పదమైంది. అయితే, భారీ హిట్ దిశగా కూడా ముందుకు సాగుతోంది. ది కేరళ స్టోరీ సినిమా దేశవ్యాప్తంగా 17 రోజుల్లో ఏకంగా రూ.181 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించారు.

IPL_Entry_Point