Woman Killed Husband: భర్త, అత్తను చంపిన మహిళ.. శరీర భాగాలను పక్క రాష్ట్రంలో పడేసి..
Woman Killed Husband, Mother-in-law: తన భర్త, అత్తను ఓ మహిళ దారుణంగా చంపింది. శరీర భాగాలను ఫ్రిడ్జ్‌లో దాచి.. ఆ తర్వాత పక్క రాష్ట్రంలో పడేసింది. ఇద్దరు స్నేహితుల సాయంతో ఆమె ఇదంతా చేసింది.
Woman Killed Husband, Mother-in-law: అసోం(Assam)లో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్త, తన అత్తను కిరాతకంగా హతమార్చింది. ఆ తర్వాత వారి శరీర భాగాలను ముక్కలు చేసి, ఫ్రిడ్జ్‌లో దాచింది. రోజుల వ్యవధిలో పక్క రాష్ట్రమైన మేఘాలయలో శరీర భాగాలను పడేసింది. ఇద్దరు పురుష స్నేహితుల సాయంతో ఈ కిరాతకానికి పాల్పడింది. గతేడాది జూలై - ఆగస్టు మధ్య ఈ హత్యలు జరిగాయి. పోలీసులు ఈ కేసు మిస్టరీని తాజాగా ఛేదించారు. నేడు (ఫిబ్రవరి 20) ఈ హత్య కేసు వివరాలను వెల్లడించారు.
శరీర భాగాలను ముక్కలుగా చేసి..
Woman Killed Husband, Mother-in-law: అసోంలోని గువహటి సమీపంలోని నూన్‍మతి (Noonmati)లో ఈ ఘటన జరిగింది. ఈ హత్యలకు పాల్పడిన నిందితురాలు బందన కలిత (Bandana Kalita)ను గువహటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన ఫ్రెండ్స్ అయిన ఓ ట్యాక్సీ డ్రైవర్, కూరగాయల వ్యాపారితో కలిసి భర్త, అత్తను కలిత చంపేసింది. గతేడాది జూలై 26న తన అత్త శంకరి (62)ని, ఆగస్టు 17న భర్త అమర్‌జ్యోతి దే(35)ను తన స్నేహితులతో కలిసి కలిత హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత భర్త, అత్త శరీరాలను ముక్కలు, ముక్కలుగా నరికి పక్క రాష్ట్రమైన మేఘాలయలోని చెర్రపుంజిలో వివిధ ప్రాంతాల్లో పడేసినట్టు వెల్లడించారు. మహిళ శరీర భాగాలు దొరికాయని, కలిత భర్త శరీర భాగాల కోసం గాలింపు చేపడుతున్నట్టు పోలీసులు చెప్పారు.
చంపేసి.. మిస్సింగ్ కేసు..
భర్త, అత్తను చంపిన తర్వాత.. వారు కనిపించడం లేదంటూ గతేడాది ఆగస్టు 29న గువహటి పోలీసులకు కలిత ఫిర్యాదు చేసింది. అయితే అప్పుడు పోలీసులు తీవ్రంగా గాలింపు జరిపినా ఫలితం లేకపోయింది. నవంబర్ 21న శంకరి మేనల్లుడు నిర్మల్యా దేవ్ (Nirmalya Dev) పోలీసులకు మరోసారి మిస్సింగ్ కంప్లైట్ ఇచ్చారు. అప్పుడు కూడా పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు.
విషయం బయటికి వచ్చిందిలా..
కేసు పురోగతి ఎలా ఉందంటూ గువహటి పోలీస్ కమిషనర్ ఆఫీస్‍కు కలిత ఈ నెల 14వ తేదీన వెళ్లారు. అదే రోజు నిర్మల్యా కూడా సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులను డీసీపీ కల్యాణ్ పాతక్ నేతృత్వంలోని స్పెషల్ టీమ్‍కు అప్పగించారు పోలీసులు.
కలితతో పాటు నిర్మల్యాను స్పెషల్ టీమ్ విచారించింది. ఈ క్రమంలో కలిత పొంతన లేని సమాధానాలు చెప్పింది. అలాగే తన అత్త ఏటీఎం కార్డును వినియోగించి కలిత సుమారు రూ.5లక్షలను డ్రా చేసింది. పోలీసులు ఈ వివరాలను కూపీ లాగగా.. కలితను డ్రా చేసినట్టు స్పష్టమైంది. ఇంతకు ముందు ఇచ్చిన స్టేట్‍మెంట్లకు విరుద్ధంగా కలిత సమాధానాలు చెప్పింది. పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో పోలీసులు తమ స్టైల్‍లో ప్రశ్నించగా.. తన భర్త, అత్తను తానే చంపినట్టు కలిత అంగీకరించిందని గువహటి పోలీస్ కమిషనర్ దిగంత బరా (Diganta Barah) వెల్లడించారు. హత్య చేసిన రోజుల్లో తన స్నేహితుల సాయంతో శరీరాలను ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో దాటిపెట్టినట్టు కలిత చెప్పింది. ఆ తర్వాత రోజుల వ్యవధిలో 150 కిలోమీటర్ల దూరంలో మేఘాలయలో శరీర భాగాలను పడేసినట్టు అంగీకరించింది.