Viral video | మృత్యువు అంచు వరకు వెళ్లిన మహిళ.. ఆ ఒక్కటే కాపాడింది!
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మరణం అంచువరకు వెళ్లొచ్చింది.స్కూటీ మీద రోడ్డు దాటుతుండగా.. అతివేగంతో వస్తున్న ఓ ట్రక్కు ఆమెను ఢీకొట్టింది. ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తలకు హెల్మెట్ ధరించడంతో ఆ మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది.
Road accidents in India | దేశంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర సమస్యగా మారాయి. ఎవరో ఒకరి తప్పుతో అనేక మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరికొంత మందికి తీవ్ర గాయాలై మంచానికే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే.. లక్ అనాలో లేక దేవుడి అనుగ్రహం అనాలో కానీ.. కొంతమంది రోడ్డు ప్రమాదాలతో మరణం అంచు వరకు వెళ్లి సురక్షితంగా బయటపడుతున్నారు. కర్ణాటకలోని మనిపాల్లో ఓ మహిళకు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. ద్విచక్రవాహనంతో రోడ్డు దాటుతుండగా.. ఓ ట్రక్కు వచ్చి అమెను ఢీకొట్టింది.
అసలేం జరిగిందంటే..
మనిపాల్కు సమీపంలో గత మంగళవారం జరిగింది ఈ ఘటన. పేరంపల్లి పరిసరాల్లో ఓ మహిళ స్కూటీ మీద రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. కాగా ఓ లారీ వస్తోందని కొంతసేపు ఆగింది. కొన్ని క్షణాల తర్వాత.. ఆ లారీ నెమ్మదించడంతో ఈ మహిళ ముందుకు కదిలింది. ఇంతలో లారీ వెనక నుంచి అతివేగంతో వస్తున్న ఓ పాల ట్రక్కు.. మహిళ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఫలితంగా వాహనంతో పాటు ఆమె గాలిలో ఎగిరి రోడ్డు మధ్యలో పడింది. ఒళ్లుగరగుర్పొడిచే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
మహిళను ఢీకొట్టిన తర్వాత ట్రక్కు ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే ఆమెవైపు పరుగులు తీశారు. ఆమెను లేపి, కుర్చీలో కూర్చోబెట్టి నీళ్లు అందించారు.
అయితే ఆ మహిళ తలకు హెల్మెట్ పెట్టుకోవడంతో పెద్ద దెబ్బలు తగలలేదు. స్వల్ప గాయాలతో ఆమె బయటపడింది.
హెల్మెట్ ధరించడం ఎంతో ముఖ్యమని ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. ప్రాణాలకు హెల్మెట్ రక్షణ ఇస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వీడియోను మంగళూరు సిటీ అనే ట్విట్టర్ ఖాతా.. ట్వీట్ చేసింది. 'హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా డ్రైవ్ చేయండి,' అని రాసుకొచ్చింది.
ఘటనకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడండి:
సంబంధిత కథనం
టాపిక్