`రామ భక్తుల 500 ఏళ్ల వేదనకు అంతం ఇది...!`
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం ప్రతిష్టాత్మక అయోధ్య రామాలయ గర్భ గుడి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని భారత్‌పై దండయాత్రలు చేసి, ఆక్రమించిన వారిపై సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గర్భాలయ శంకుస్థాపన కార్యక్రమం బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 5, 2020న ప్రారంభించిన విషయం తెలిసిందే. అంతకుముందు, దశాబ్దాల రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదానికి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుతో తెర దించింది.
ఐక్యతకు ప్రతీక
రామాలయ నిర్మాణం భారత్‌పై దండెత్తి వచ్చిన ఆక్రమణ దారులపై విజయమని గర్భగుడి శిలాపూజ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. అలాగే, భారతీయ ఐక్యతకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఆలయ నిర్మాణం 2024 సంక్రాంతి నాటికి ముగుస్తుందని భావిస్తున్నారు. అదే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఎన్నికల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేసి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. 2019 ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో అయోధ్యలో రామాలయ నిర్మాణ హామీ కూడా ఉంది.
భారతీయులందరికీ గర్వకారణం
అయోధ్యలో రామాలయ నిర్మాణం భారతీయులందరికీ గర్వకారణమని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. భారతీయులంతా గర్వించే క్షణమన్నారు. ఇది భారతీయులందరి మందిరమని, ప్రజల విశ్వాసానికి ప్రతీక అని యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. ఆలయాన్ని పునర్నిర్మించడం ద్వారా 500 ఏళ్లుగా భక్తులు అనుభవిస్తున్న వేదనకు అంతం పలకనున్నామన్నారు. భారత్‌పై దండయాత్రలు చేసినవారు దేశవాసుల విశ్వాసాలను ధ్వంసం చేశారని, కానీ, అంతిమంగా భారతదేశమే విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. రామ మందిర ట్రస్ట్ సభ్యులు, ఉప ముఖ్యమంత్రి కేశవప్రసాద్ మౌర్య తదితరులు ఈ రామాలయ గర్భగుడి శిలాపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వేలాది కార్యకర్తల కృషి ఫలితం
`ఎంతో మంది సాధు సన్యాసులు, అశోక్ సింఘాల్ వంటి వీహెచ్‌పీ నాయకులు, లక్షలాది కరసేవకులు, ఆరెస్సెస్ కార్యకర్తల పోరాట ఫలితంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం సాధ్యమైంది` అని యోగి ఆదిత్యనాథ్ వివరించారు. సత్యమేవ జయతే అనేది మరోసారి నిర్ధారణ అయిందని, సత్యం, ధర్మం, న్యాయం.. మార్గంలో ఈ విజయం సాధించామని తెలిపారు. గర్భాలయ శిలా పూజ సందర్భంగా అయోధ్యను సర్వాంగ సుందరంగా అలంకరించారు.
టాపిక్