UPSC Civil Service Prelims: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీలో మార్పు; కారణం ఏంటంటే?
UPSC Civil Service Prelims: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 వాయిదా పడింది. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసుల్లో ఉద్యోగులను సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
UPSC Civil Service Prelims Exam postponed: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వాయిదా వేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లోని అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు. సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష ద్వారా యూపీఎస్సీ వివిధ సర్వీసుల్లో 1,056 ఖాళీలను భర్తీ చేయనుంది.
లోక్ సభ ఎన్నికల కారణంగా
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2024 పరీక్ష రాబోయే సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ ప్రిలిమినరీ (UPSC Civil Service Prelims) పరీక్షను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం స్క్రీనింగ్ పరీక్షగా కూడా పరిగణిస్తారు. లోక్ సభ ఎన్నికలు (lok sabha elections 2024) 2024 ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్న నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేశారు.
మే 26న కాదు.. జూన్ 16వ తేదీన
రాబోయే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కారణంగా సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష - 2024 ను మొదట 2024, మే 26వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, అదే తేదీన లోక్ సభ ఎన్నికల ఆరో విడత ఎన్నికలు జరగనున్నాయి. దాంతో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను 26-05- 2024 నుండి 16-06-2024 కు వాయిదా వేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది.
ఇలా చెక్ చేయండి..
సివిల్స్ ప్రిలిమ్స్ 2024 (UPSC Civil Service Prelims 2024) పరీక్ష వాయిదాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించవచ్చు. అందుకు గానూ, వారు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024 నోటీసు లింక్ పై క్లిక్ చేయండి.
- కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్ 2024 కు సంబంధించిన సమాచారాన్ని చూడవచ్చు.
- ఆ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
- తదుపరి అవసరాల కోసం హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.