NPK fertiliser subsidy: ఈ రబీ సీజన్ లో రైతులకు రూ. 22,303 కోట్ల మేర ఎరువుల సబ్సీడీని కేంద్రం అందిస్తోంది. ఈ ప్రతిపాదనకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఎరువుల్లో పాస్ఫరస్, పొటాషియం (PK), నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం (NPK) ఎరువులపై పోషకాధారిత సబ్సీడీ ఎన్బీఎస్ (nutrient-based subsidy NBS) ఉన్నాయి. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో ఈ పోషకాల ధరలు విపరీతంగా పెరిగాయి. రైతులకు అందుబాటు ధరల్లో ఈ ఎరువులను అందిస్తున్నామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కేంద్ర కేబినెట్ భేటీ వివరాలను బుధవారం సాయంత్రం ఆయన వెల్లడించారు.
కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ప్రధానంగా రెండు ప్రయోజనాలున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ రబీ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో.. చవకగా, అందుబాటు ధరలో రైతులకు అవసరమైన ఎరువులు లభ్యం కావడం ఒక ప్రయోజనమని చెప్పారు. పొటాషియం, పాస్ఫరస్ ఎరువలకు ఇచ్చే సబ్సీడీలో నియంత్రణ ఉండడం వల్ల అనవసర అధిక వినియోగం ఉండకపోవడం మరో ప్రయోజనమని వివరించారు.
ఈ రబీ సీజన్ లో రైతులు నైట్రోజన్ ఎరువును కేజీ కి రూ. 47.02 కి పొందుతారు. అలాగే, ఫాస్పరస్ ఎరువును కేజీకి రూ. 20.82 లకు, పొటాషియం ఎరువును కేజీకి రూ. 2.38 లకు పొందుతారు. 2023-24 సంవత్సర ఖరీఫ్ సీజన్ లో ఎరువుల సబ్సీడీ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 30 వేల కోట్లను కేటాయించింది. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ నెలతో ముగిసింది. పోషకాధారిత సబ్సీడీ ఎన్బీఎస్ (nutrient-based subsidy NBS) కార్యక్రమాన్ని 2010 లో ప్రారంభించారు. రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులు, ఇతర పంట పోషకాలను అందించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు.