Viral: ప్రయాణికుడి బాధ విని, కిడ్నీ దానం చేసిన ఉబెర్ డ్రైవర్
Viral: ప్రయాణికుడి కష్టానికి చలించిన ఓ ఉబెర్ డ్రైవర్ ఏకంగా తన కిడ్నీనే దానం చేశారు. ఆ ప్యాసింజర్‌కు మరో జన్మనిచ్చారు.
Uber driver donates Kidney: ప్రస్తుత కాలంలో మానవత్వమే లేదని నిరాశతో ఉన్నారా.. అయితే ఈ స్టోరీ మీ ఆలోచనను మార్చేస్తుంది. కొన్ని రూపాల్లో మానవత్వం ఇంకా ఉందని మీకు నమ్మకం కల్పిస్తుంది. కిడ్నీ దానం ఇవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఎంతో కావాల్సిన వారికైనా సరే కిడ్నీ ఇవ్వాలంటే చాలా మంది జంకుతారు. అలాంటిది ఓ క్యాబ్ డ్రైవర్.. తన ప్యాసింజర్ కష్టానికి చలించిపోయి తన కిడ్నీని దానం చేశాడు. 72 సంవత్సరాల వ్యక్తికి మళ్లీ ప్రాణం పోశారు. వివరాలివే..
కష్టం తెలుసుకొని..
Uber driver donates Kidney: టిమ్ లెట్స్ (Tim Letts).. అమెరికన్ ఆర్మీలో పని చేసి రిటైర్ అయ్యారు. వారాంతాల్లో ఉబెర్ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ రోజు 72 సంవత్సరాల వయసు ఉన్న బిల్ సుమియెల్ (Bill Sumiel) అనే వ్యక్తి టిమ్ నడుపుతున్న క్యాబ్ ఎక్కారు. డయాలసిస్‍కు బిల్ వెళుతున్నారు.
ఈ క్రమంలో డ్రైవర్ టిమ్, ప్యాసింజర్ బిల్ సుమియెల్ మధ్య మాటామాటా కలిసింది. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. తాను సుమారు 30 సంవత్సరాల నుంచి తాను డయాబెటిస్‍తో బాధపడుతున్నానని, తన కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని టిమ్‍తో బిల్ సుమియెల్ చెప్పారు. తనకు కిడ్నీ ఇచ్చే వారి కోసం తీవ్రంగా వెతుకున్నానని తెలిపారు.
కిడ్నీ ఇస్తానని హామీ
Uber driver donates Kidney: బిల్ చెప్పిన మాటలతో టిమ్ లెట్స్ కరిగిపోయారు. తానే ఒక కిడ్నీని దానంగా ఇస్తానని అంగీకరించారు. బిల్‍కు తన పేరు, ఫోన్ నంబర్ ఇచ్చి కిడ్నీ దానం చేస్తానని మాటిచ్చారు.
అయితే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‍కు మాత్రం సుమారు మూడున్నర సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. అనంతరం బిల్‍కు ఇచ్చేందుకు టిమ్ కిడ్నీ.. ‘అవుట్‍స్టాండింగ్ మ్యాచ్’ అయింది. కిడ్నీ దానం చేసేందుకు సరిగ్గా సూటయ్యే దశకు వచ్చింది. దీంతో టిమ్ కిడ్నీని బిల్‍కు అమర్చారు.
తనకు కిడ్నీ ఇచ్చిన టిమ్ లెట్స్‌ను గతేడాది డిసెంబర్‌లో కలిశారు బిల్ సుమియెల్. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో జనవరిలో పోస్ట్ చేశారు బిల్. అప్పటి నుంచి ఇది వైరల్‍గా మారింది. సోషల్ మీడియాలో వీరి స్టోరీ ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు మనసులను గెలుచుకుంటోంది.
“నేను అతడికి ధన్యవాదాలు చెప్పాను. టిమ్‍ను కొడుకులా నా భార్య భావిస్తోంది. అతడు నా పాలిట దేవుడు. నాకు ఇప్పుడు డయాలసిస్ అవసరం లేదు. తెల్లవారుజామున 3 గంటలకు లేవాల్సిన అవసరం లేదు” అని బిల్ సుమియెల్ అన్నారు.