China| కొవిడ్ నెగిటివ్ వచ్చినా.. వేలాది మందికి 'క్వారంటైన్' తిప్పలు!
చైనా రాజధాని బీజింగ్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తోంది. కొవిడ్ నెగిటివ్ రిపోర్టులు ఉన్న వేలాది మందిని కూడా క్వారంటైన్‌కు తరలిస్తుండటం ఇప్పుడు వార్తలకెక్కింది.
China covid news | చైనాలో ఉండే కఠిన ఆంక్షల గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక కొవిడ్ పేరుతో అక్కడి యంత్రాంగం అరాచకాలే సృష్టిస్తోంది. ఆ ఆంక్షలతో చైనావాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న దృశ్యాలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఇక ఇప్పుడు.. చైనా యంత్రాంగం మరో అడుగు ముందుకేసింది. బీజింగ్‌లో కరోనా సంక్షోభం వేళ.. కొవిడ్ నెగిటివ్ రిపోర్టులు ఉన్న వేలాది మంది కూడా క్వారంటైన్లో పెట్టింది!
ఆ 26మంది వల్ల..
షాంఘై తర్వాత.. ప్రస్తుతం బీజింగ్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. రంగంలోకి దిగిన ప్రభుత్వం.. అక్కడ 'జీరో కొవిడ్' విధానాన్ని అమలు చేసింది. కఠిన ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే నాన్క్సిన్యువాన్ ప్రాంతంలో లాక్డౌన్ విధించింది. అంతటితో ఆగకుండా.. శుక్రవారం రాత్రి వేలాది మందిని అప్పటికప్పుడు క్వారంటైన్ హొటళ్లకు తరలించింది. వారందరికీ కొవిడ్ నెగిటివ్ రిపోర్టులు ఉన్నా.. క్వారంటైన్లో పెట్టడం ఇప్పుడు వార్తలకెక్కింది.
ఇందుకు కారణం ఓ 26మంది! గత కొన్ని రోజులుగా.. ఆ ప్రాంతంలోని 13వేల మందిలో 26మందికి వైరస్ సోకింది. అంతే! కఠిన ఆంక్షలను అమలు చేస్తూ.. వేలాది మందిని క్వారంటైన్ చేసేసింది అక్కడి యంత్రాంగం.
Beijing coronavirus restrictions | ఈ క్వారంటైన్.. శుక్రవారం నుంచి ఏడు రోజుల పాటు అమలులో ఉంటుంది. తమ నిబంధనలకు సహకరించాలని, లేకపోతే న్యాయపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాత్రికి రాత్రి.. బట్టలు సద్దుకుని, క్యూలో నిలబడి వాహనాలు ఎక్కుతున్న చైనావాసుల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
"మాలో చాలా మంది.. ఏప్రిల్ నుంచే లాక్డౌన్లో ఉన్నారు. మాకు కొవిడ్ నెగిటివ్ వచ్చింది. అయినా మమ్మల్ని విడిచిపెట్టడం లేదు. ఇక్కడున్న వారిలో చాలా మంది వృద్ధులు, చిన్నారులే. మేము యుద్ధభూమిలో ఉన్నట్టు అనిపిస్తోంది," అని ఓ స్థానికుడు చైనా సామాజిక మాధ్యమం విబోలో పోస్ట్ చేశాడు.
కాగా.. ప్రజల ఆందోళనలు తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. శుక్రవారం రాత్రి వరకు ఉన్న అనేక పోస్టులు.. శనివారం ఉదయం నాటికి మాయమైపోయాయి!
సంబంధిత కథనం