Tata Steel : టాటా స్టీల్ నికర లాభం 13శాతం పతనం- అదే కారణం!
Tata steel Q1 results 2022 : ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను టాటా స్టీల్ ప్రకటించింది. సంస్థ నికర లాభం 12.8శాతం మేర పడింది. పూర్తి వివరాలు..
Tata steel Q1 results 2022 : 2022-23 ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది టాటా స్టీల్ సంస్థ. ఏకీకృత నికర లాభం 12.83శాతం మేర పతనమై.. రూ. 7,764.96కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో టాటా స్టీల్ ప్యాట్(ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) రూ. 8,907కోట్లుగా ఉంది. ఇక జనవరి- మార్చ్ త్రైమాసికంతో పోల్చుకుంటే.. ప్యాట్ 20.4శాతం పడిపోయింది.
ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో టాటా స్టీల్ ఏకీకృత ఆదాయం.. 18.6శాతం పెరిగి, రూ. 63,430కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆ విలువ రూ. 53,465కోట్లుగా ఉంది. గత త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఇది 8.5శాతం తక్కువ.
కారణం ఇదే..
పెట్ కోక్ ధరలు పెరగడంతో నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయి. ఫలితంగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్ ఫైనాన్షియల్స్పై ప్రభావం పడింది. ఎగుమతులపై కేంద్రం సుంకాలు విధించడం కూడా పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపించింది.
"వడ్డీ రేట్ల పెంపు, చైనాలో కొవిడ్ లాక్డౌన్ వల్ల ఈ త్రైమాసికంలో అంతర్జాతీయ, భారత ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. వీటన్నింటినీ ఛేదిస్తూ.. టాటా స్టీల్ మంచి ప్రదర్శన చేస్తోంది. ప్రభుత్వం విధించిన సుంకాలను ఎదుర్కొనే విషయంలో మా వ్యవస్థ మెరుగ్గా పనిచేసింది," అని టాటాస్టీల్ సీఈఓ టీవీ నరేంద్రన్ వెల్లడించారు.
ఇదే సమయంలో టాటాస్టీల్కి చెందిన యూరోప్ వ్యాపారాలు అనుహ్యంగా వృద్ధిచెందాయి.
మరోవైపు ఈ త్రైమాసికంలో 7.74మిలియన్ టన్నుల స్టీల్‌ని సంస్థ ఉత్పత్తి చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే ఇది 1.8శాతం తక్కువ. ఎగుమతులపై సుంకాల కారణంగా అమ్మకాల వాల్యూంలు 7శాతం(ఇయర్ ఆన్ ఇయర్) తగ్గిపోయాయి.
ఇండియాలో.. ఒక్క టన్ను స్టీల్‌కు సంస్థ సంపాదిస్తున్న ఆదాయం.. గత త్రైమాసికంతో పోల్చుకుంటే రూ. 8,534కోట్లు పెరిగి.. రూ. 83,625కి చేరింది.
టాటాస్టీల్ కన్సాలిడేటెడ్ ఎబిట్డా.. ఈ త్రైమాసికంలో రూ. 15,047కోట్లుగా ఉంది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఇది 7శాతం తక్కువ.
కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్‌తో పోల్చుకుంటే.. ఎబిట్డా మార్జిన్.. 24శాతం మేర వృద్ధిని నమోదు చేసింది. ఇక జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి.. టాటా స్టీల్‌కు రూ. 54,504కోట్ల అప్పులు ఉన్నాయి.
సోమవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి.. టాటా స్టీల్ స్టాక్ రూ. 964 వద్ద స్థిరపడింది.
సంబంధిత కథనం