Tamil Nadu news: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 10 మంది దుర్మరణం-tamil nadu news 10 killed 10 injured in virudh nagar firecracker factory blast ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tamil Nadu News: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 10 మంది దుర్మరణం

Tamil Nadu news: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 10 మంది దుర్మరణం

HT Telugu Desk HT Telugu
Feb 17, 2024 08:29 PM IST

Tamil Nadu blast: తమిళనాడులోని విరుధ్ నగర్ జిల్లాలో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి, అందులో పని చేస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

భారీ పేలుడు జరిగిన బాణాసంచా ఫ్యాక్టరీ
భారీ పేలుడు జరిగిన బాణాసంచా ఫ్యాక్టరీ (PTI)

తమిళనాడులోని విరుధ్ నగర్ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి 10 మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. విరుధ్ నగర్ జిల్లాలోని నిబంధనలను వ్యతిరేకంగా, అక్రమంగా నిర్వహిస్తున్న బాణాసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించింది.

బూడిద కుప్పగా మారిన ఫ్యాక్టరీ

బాణాసంచా కార్మాగారంలో శనివారం మధ్యాహ్నం ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించిందని, ఆ తరువాత వరుసగా చాలా సేపు పేలుళ్లు జరిగాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మరో 10 మంది గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడుతో ఆ ఫాక్టరీ మొత్తం బూడిద కుప్పగా మారింది. ప్రాథమిక వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో గ్రామంలోని బాణసంచా తయారీ యూనిట్ లోని కెమికల్ మిక్సింగ్ రూమ్ లో ఈ ప్రమాదం జరిగింది.

సమగ్ర విచారణ

విరుద్ నగర్ జిల్లా కలెక్టర్ జయశీలన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ రోజు మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. 10 మంది మృతి చెందగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. క్షతగాత్రులను శివకాశి ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ ప్లాంటుకు లైసెన్స్ ఉందా? లేదా అనే విషయాన్ని విచారణ లో తేలుస్తామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి నేతృత్వంలో సమగ్ర విచారణకు ఆమె ఆదేశించారు. ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే పోలీసు, అగ్నిమాపక శాఖ, కార్మిక సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖతో పాటు 4 బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో అంబులెన్స్ లు కూడా ఉన్నాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి

విరుధ్ నగర్ జిల్లాలోని బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను సమన్వయం చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇద్దరు రాష్ట్ర మంత్రులను ఆదేశించారు. తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి కేకేఎస్ ఎస్ ఆర్ రామచంద్రన్, కార్మిక శాఖ మంత్రి సీవీ గణేశన్ ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు.

IPL_Entry_Point