Abortion rights of minors: అబార్షన్ కోరే మైనర్లకు గోప్యత హక్కు కల్పించిన సుప్రీం
SC protects minors seeking abortion: అబార్షన్ కోరుకున్న మైనర్ బాలికల వివరాలను, వారి గుర్తింపును వైద్యులు బహిర్గతపరచాల్సిన అవసరం లేదని, పోలీసులకు వెల్లడించాల్సిన పనిలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 30: పరస్పర అంగీకారం ద్వారా లైంగికంగా దగ్గరైన సందర్భాల్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబార్షన్ కోరుకునే మైనర్ బాలికల గుర్తింపును పోలీసులకు వెల్లడించకుండా వైద్యులకు మినహాయింపు ఇస్తూ సుప్రీం కోర్టు ఉపశమనం ఇచ్చింది. తద్వారా మైనర్లకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం ప్రయోజనాలను సుప్రీంకోర్టు పొడిగించింది.
20-24 వారాల మధ్య గర్భస్రావం కోసం అవివాహిత మహిళలను అనుమతిస్తూ వారిని ఎంటీపీ చట్టం కింద చేర్చుతూ సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాహిత మహిళలను మాత్రమే కవర్ చేసే నిబంధనను పరిమితం చేయడం వివక్షేనని, ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
ఎంటీపీ చట్టం నియమాల ప్రకారం ‘లైంగిక దాడి’ లేదా ‘రేప్’ అనే పదాల అర్థంలో వైవాహిక అత్యాచారం కూడా వస్తుందని అని పేర్కొంది. అంటే భర్త తన భార్యపై లైంగిక వేధింపు లేదా అత్యాచారానికి పాల్పడడం కూడా వస్తుందని పేర్కొంది.
న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ జె.బి.పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. రూల్ 3 బి (బి) యొక్క ప్రయోజనం లైంగిక కార్యకలాపాలలో పాల్గొనే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళలందరికీ వర్తిస్తుందని నిర్ధారించడానికి.. పిల్లలపై లైంగిక నేరాల నిరోధక (POCSO) చట్టం, ఎంటీపీ చట్టం రెండింటినీ సామరస్యంగా చూడడం అవసరం అని పేర్కొంది.
‘ఎంటీపీ చట్టం ప్రకారం వైద్యపరమైన గర్భస్రావాన్ని అందించే పరిమిత ప్రయోజనాల కోసం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు మైనర్ యొక్క సంరక్షకుల అభ్యర్థనపై గుర్తింపు, ఇతర వ్యక్తిగత వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని మేం స్పష్టం చేస్తున్నాం. పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) కింద అందించే సమాచారంలో మైనర్ వివరాలు (స్థానిక పోలీసులకు సమాచారం) అందించడంపై మినహాయింపు ఇస్తున్నాం..’ అని ధర్మాసనం పేర్కొంది.
పోక్సో చట్టం కింద వెలువడే చట్టపరమైన చర్యలలో మైనర్ గుర్తింపును బహిర్గతం చేయకుండా ఆర్ఎంపీలను మినహాయించడం ద్వారా ఇది మైనర్లకు భద్రతను అందించినట్టయింది. మైనర్లకు సురక్షితమైన అబార్షన్‌ను దూరం చేయడం చట్టసభ ఉద్దేశం కాబోదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
‘రూల్ 3B(b)లో 24 వారాల వరకు గర్భం గల స్త్రీల జాబితాలో మైనర్లు కూడా ఉంటారు. వారు ఏకాభిప్రాయంతో లైంగిక చర్యలో పాల్గొన్నప్పటికీ కౌమార దశలో వారికి లైంగిక సంపర్కం గురించిన పర్యవసనాలు తెలియకపోవచ్చు. ప్రెగ్నెన్సీ వస్తుందని వారికి తెలియకపోవచ్చు. లేదా ప్రెగ్నెన్సీ సంకేతాలను గుర్తించలేకపోవచ్చు..’ అని ధర్మాసనం పేర్కొంది.
పోక్సో చట్టం 18 ఏళ్లలోపు వారి లైంగిక కార్యకలాపాలను నేరంగా పరిగణిస్తున్నదని ధర్మాసనం పేర్కొంది. ‘పోక్సో చట్టం ప్రకారం మైనర్ల మధ్య సంబంధంలో పరస్పర సమ్మతి అసంబద్ధం. పోక్సో చట్టంలో ఉన్న ఈ నిషేధం వాస్తవానికి - కౌమారదశలో ఉన్నవారు ఏకాభిప్రాయంతో లైంగిక చర్యలో పాల్గొనకుండా నిరోధించదు. అటువంటి కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే సత్యాన్ని మనం విస్మరించలేం. కొన్నిసార్లు ఇది ప్రెగ్నెన్సీ వంటి పరిణామాలకు దారి తీస్తుంది..’ అని పేర్కొంది.
దేశంలో లైంగిక ఆరోగ్య విద్య లేకపోవడం వల్ల చాలా మంది కౌమారదశలో ఉన్నవారికి పునరుత్పత్తి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, అలాగే గర్భధారణను నివారించడానికి గర్భ నిరోధక పరికరాలు, పద్ధతులు ఎలా ఉపయోగించాలో తెలియదని పేర్కొంది.
‘వివాహానికి ముందు సెక్స్ చుట్టూ ఉన్న నిషేధాలు యువతను గర్భనిరోధక సాధనాలను ఉపయోగించకుండా నిరోధిస్తాయి. గర్భవతిగా ఉన్నారనే వాస్తవాన్ని కనుగొన్న యువతులు.. అబార్షన్ కోసం వైద్య సహాయాన్ని పొందడంలో కీలకపాత్ర పోషించే తమ తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు ఈ విషయాన్ని వెల్లడించడానికి వెనుకాడతారు..’ అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
‘రూల్ 3B(c)ని దాని ప్రయోజనాలు వివాహిత మహిళలకు మాత్రమే విస్తరింపజేసేలా అన్వయించినట్లయితే, అది వివాహిత స్త్రీలు మాత్రమే లైంగిక కార్యకలాపాల్లో ఉంటారనే మూస, సామాజికంగా ఉన్న భావనను శాశ్వతం చేస్తుంది. సంభోగం, తత్ఫలితంగా చట్టంలోని ప్రయోజనాలు వారికి మాత్రమే విస్తరించాల్సి వస్తుంది. వివాహితులు, ఒంటరి మహిళల మధ్య ఈ కృత్రిమ వ్యత్యాసం రాజ్యాంగపరంగా స్థిరమైనది కాదు. చట్టంలోని ప్రయోజనాలు అవివాహిత, వివాహిత మహిళలకు సమానంగా ఉంటాయి..’ అని బెంచ్ పేర్కొంది.
సంబంధిత కథనం