SSB jawan shot dead : సైనికుడిని కాల్చిచంపిన దోపిడి దొంగలు
సశస్త్ర సీమా బల్ (SSB) విభాగానికి చెందిన సైనికుడిని దోపిడి దొంగలు తుపాకీతో కాల్చి చంపారు. ఈ దారుణ ఘటన బిహార్ లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో జరిగింది.
సశస్త్ర సీమా బల్ (SSB) లోని 18వ బెటాలియన్ లో ధర్మేంద్ర కుమార్ సైనికుడిగా పని చేస్తున్నారు. రాజ్ నగర్ క్యాంప్ లో విధుల్లో ఉన్నారు. తన తల్లి సన్వారి దేవి కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో బిహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఉన్న తన స్వగ్రామం బగాహాకు వచ్చాడు.
డబ్బులు ఇవ్వమని..
తమ్ముడితో కలిసి తల్లిని తన గ్రామానికి 30 కిమీల దూరంలో ఉన్న టౌన్‌లోని ఆసుపత్రిలో చూపించి బుధవారం రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. తన దగ్గర ఉన్న పర్స్, నగదు, ఇతర విలువైన వస్తువులు ఇవ్వమని, తుపాకీ చూపి బెదిరించారు. అవి ఇవ్వడానికి ధర్మేంద్ర కుమార్ నిరాకరించడంతో అతి దగ్గర నుంచి అతడిపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే ధర్మేంద్ర కుమార్ తమ్ముడు మనోజ్ కుమార్ పోలీసులకు సమాచారమిచ్చి, వెంటనే తన అన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అయితే, అప్పటికే ధర్మేంద్ర కుమార్ చనిపోయాడని వైద్యులు చెప్పారు. అత్యంత దగ్గర నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్లు గుండెలో, తలలో దూసుకుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడని వివరించారు.
స్వగ్రామం సమీపంలోనేౌ
ఈ ఘటన తమ స్వగ్రామానికి సమీపంలోనే జరిగిందని మనోజ్ కుమార్ వెల్లడించారు. రోడ్డుపై వెళ్తున్న తమను మొదట ఇద్దరు అడ్డుకున్నారని, తుపాకీతో బెదిరించారని, మరో ఇద్దరు కొద్ది దూరంలో నిల్చున్నారని వివరించాడు. తన అన్న వారిని ఎదిరించడంతో కాల్పులు జరిపి పారిపోయారని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఒక నిందితుడిని అరెస్ట్ చేశామని, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.