Sonia Gandhi-Smriti Irani face-off: సోనియా గాంధీ, స్మృతీ ఇరానీ వాగ్వాదం-sonia gandhi smriti irani face off in ls post adjournment ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sonia Gandhi-smriti Irani Face-off: సోనియా గాంధీ, స్మృతీ ఇరానీ వాగ్వాదం

Sonia Gandhi-Smriti Irani face-off: సోనియా గాంధీ, స్మృతీ ఇరానీ వాగ్వాదం

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 03:37 PM IST

న్యూఢిల్లీ, జూలై 28: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే రగులుతున్న దుమారానికి గురువారం లోక్‌సభ ఛాంబర్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీల మధ్య జరిగిన వాగ్వాదం మరింత ఆజ్యం పోసింది.

పార్లమెంటు వద్ద సోనియా గాంధీ
పార్లమెంటు వద్ద సోనియా గాంధీ (ANI)

భారతదేశపు మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్మును "రాష్ట్రపత్ని"గా అధిర్ రంజన్ చౌదరి ప్రస్తావించడం, దీనికి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేయడంతో పాలక బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.

లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాయిదా పడడంతో.. సోనియా గాంధీ అధికార పార్టీ సభ్యుల సీట్ల వద్దకు వెళ్లి బీజేపీ సభ్యురాలు రమాదేవిని పలుకరించారు.. ఈ వివాదంలోకి తనను ఎందుకు లాగారో తెలుసుకోవాలనుకుంటున్నానని అడిగారు.

ఇదే సమయంలో స్మృతీ ఇరానీ రంగంలోకి దిగి సోనియా గాంధీ వైపు సైగ చేస్తూ అధిర్ రంజన్ చౌదరి వ్యాఖ్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సోనియా గాంధీ మొదట స్మృతీ ఇరానీ నిరసనలను పట్టించుకోకుండా ఉండేందుకు ప్రయత్నించారు.. కానీ ఆ వెంటనే మంత్రి వైపు సైగ చేయడం, కోపంగా మాట్లాడటం కనిపించింది.

తనతో మాట్లాడవద్దని బీజేపీ సభ్యురాలికి సోనియా గాంధీ వ్యాఖ్యానించారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే సదరు బీజేపీ ఎంపీ ఎవరో నిర్మలా సీతారామన్ వెల్లడించలేదు.

ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే, తృణమూల్ సభ్యురాలు అపరూప పొద్దార్‌లు కాంగ్రెస్ అధ్యక్షురాలి వెంట నిలుచోగా, బీజేపీ సభ్యులు రమా దేవి, సోనియా గాంధీ చుట్టూ చేరారు.

చౌదరి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సభలో నిరసనలకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ మహిళా సభ్యులు లోక్‌సభలో ముందు వరుసలో కూర్చున్నారు.

అనంతరం రమా దేవి మీడియాతో మాట్లాడుతూ తన పేరును ఎందుకు ఈ ఇష్యూలోకి లాగారో తెలుసుకోవాలని సోనియా గాంధీ కోరినట్లు తెలిపారు. ‘నా తప్పేంటి’ అని సోనియా గాంధీ ప్రశ్నించినట్టు తెలిపారు.

చౌదరిని లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా ఎంపిక చేయడమే తన తప్పు అని సోనియా గాంధీకి చెప్పానని రమా దేవి చెప్పారు.

పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడిన సీతారామన్.. బీజేపీ సభ్యులతో గాంధీ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు.

చర్చిస్తున్న అంశం ఏమిటో తెలుసుకుందామని కోరినప్పుడు ‘మీరు నాతో మాట్లాడకండి’ అని సోనియా గాంధీ బీజేపీ సభ్యులతో అన్నారని సీతారామన్ పేర్కొన్నారు.

‘క్షమాపణ చెప్పడానికి బదులుగా అధిర్ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారని ఆమె తప్పుదోవ పట్టిస్తున్నారు. క్షమాపణ చెప్పడానికి బదులుగా ఆమె బెదిరింపులకు పాల్పడుతున్నారు..’ అని సీతారామన్ లోక్‌సభ ఛాంబర్‌లో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ అన్నారు.

కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఇరానీ ప్రవర్తన ‘దౌర్జన్యం’ అని వ్యాఖ్యానించారు. ‘ఈరోజు లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దారుణంగా ప్రవర్తించారు. అయితే స్పీకర్ ఆమెపై చర్యలు తీసుకుంటారా? లేక నిబంధనలు ప్రతిపక్షాలకు మాత్రమే ఉద్దేశించినవా?’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కేంద్ర మాజీ మంత్రి మిలింద్ దేవ్‌రా మాట్లాడుతూ సోనియా గాంధీని రెచ్చగొట్టినా కూడా దురుసుగా గానీ, అమర్యాదగా ప్రవర్తించడం గానీ ఎప్పుడూ చూడలేదని అన్నారు.

‘"పార్లమెంటు లోపల, వెలుపల ఆమెను వ్యక్తిగతంగా, అన్యాయంగా టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఆమె ఎప్పుడూ భరిస్తూ వచ్చారు. ఎప్పటికీ భరిస్తారు..’ అని దేవ్‌రా ట్వీట్‌లో పేర్కొన్నారు.

IPL_Entry_Point