Solar Eclipse 2023: సూర్య గ్రహణాన్ని ఎప్పుడు, ఎలా చూడాలి?.. మన దగ్గర కనిపిస్తుందా?.. ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అంటే ఏంటి?
Solar Eclipse 2023: రేపు, అంటే, అక్టోబర్ 14 న సూర్యగ్రహణం సంభవించనుంది. సూర్య గ్రహణాన్ని కంటికి ప్రమాదం వాటిల్లకుండా, సురక్షితంగా ఎలా చూడాలో తెలుసుకోండి.
Solar Eclipse 2023: అంతరిక్షంలో చోటు చేసుకునే వింతలు, విశేషాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం వంటి దృగ్విషయాల కోసం అంతరిక్ష ప్రేమికులు ఎదురు చూస్తుంటారు.
అక్టోబర్ 14న..
ఈ సంవత్సరంలో రెండోది, చివరిదైన సూర్యగ్రహణం (Solar Eclipse) అక్టోబర్ 14 వ తేదీన, శనివారం సంభవిస్తోంది. ఇదే రోజు మహాలయ కూడా వస్తోంది. ఈ సారి సూర్య గ్రహణం సమయంలో ‘రింగ్ ఆఫ్ ఫైర్ (Ring Of Fire)’ ను కూడా చూడవచ్చు. సూర్యుడు పూర్తిగా గ్రహణం ప్రభావంలో ఉన్నప్పుడు సూర్యుడి చుట్టూ కనిపించే అత్యంత ప్రకాశవంతమైన వెలుగునే ‘రింగ్ ఆఫ్ ఫైర్ (Ring Of Fire)’ అంటారు. సూర్యుడి చుట్టూ ఒక మండుతున్న రింగ్ లా ఇది కనిపిస్తుంది.
ఎక్కడ కనిపిస్తుంది?
ఈ సారి సూర్య గ్రహణం భారత్ లో కనిపించదు. దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లోని దేశాల్లో ఈ సూర్య గ్రహణం, రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తాయి. అంటే, భారతీయులు నేరుగా ఈ సూర్య గ్రహణాన్ని చూడలేరు. కానీ వర్చువల్ గా, వివిధ మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు. అమెరికా, కెనడా, నికరాగ్వా, బ్రెజిల్, హోండురస్, కొలంబియా, కోస్టారికా, అర్జెంటీనా, పనామా తదితర దేశాల ప్రజలు ఈ సూర్య గ్రహణాన్ని చూడవచ్చు. భారతీయ కాలమానం ప్రకారం అక్టోబర్ 14 రాత్రి 8.14 గంటల నుంచి అక్టోబర్ 15 తెల్లవారు జామున 2.35 గంటల వరకు సూర్య గ్రహణం ఉంటుంది.
సూర్య గ్రహణం అంటే..?
సూర్య గ్రహణం (Solar Eclipse) సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు సంభవిస్తుంది. అంటే, సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వస్తాడు. దాంతో, సూర్యుడు భూమిపై ఉన్నవారికి కనిపించడు. దీన్నే సూర్య గ్రహణం అంటారు. చంద్రుడు సూర్యుడిని అడ్డుకునే భాగం ఆధారంగా పాక్షిక సూర్య గ్రహణం, సంపూర్ణ సూర్య గ్రహణం, రింగ్ ఆఫ్ ఫైర్ ఏర్పడుతాయి. రింగ్ ఆఫ్ ఫైర్ 5 నిమిషాల పాటు మాత్రమే కనిపిస్తుంది.
ఎలా చూడాలి?
సూర్య గ్రహణాన్ని ప్రత్యక్షంగా, కంటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు. సూర్య గ్రహణాన్ని నేరుగా చూడడం వల్ల కళ్లు దెబ్బతింటాయి. అందువల్ల, సరైన ఫిల్టర్ ఉపయోగించి సూర్య గ్రహణాన్ని చూడాలి. అంతేకాదు, కెమెరా లెన్స్ ద్వారా కానీ, బైనాక్యులర్ ద్వారా కానీ, టెలీ స్కోప్ ద్వారా కానీ సూర్య గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. వారు కూడా ప్రత్యేకంగా రూపొందించిన సరైన సోలార్ ఫిల్టర్ ను మాత్రమే ఉపయోగించాలి. భారత్ లోని వారు Great American Eclipse website ద్వారా, TimeandDate.com వెబ్ సైట్ ద్వారా సూర్య గ్రహణాన్ని చూడవచ్చు. నాసా (NASA) తమ వెబ్ సైట్ లో ఈ సూర్య గ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ (live stream) చేస్తుంది.