Excise case row: బీజేపీపై సిసోడియా సంచలన ఆరోపణలు
Excise case row: మనీష్ సిసోడియా బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 22: తమ పార్టీలో చేరితే తనపై ఉన్న కేసులన్నీ మూసేస్తామన్న ప్రతిపాదనతో బీజేపీ తనను సంప్రదించిందని న్యూఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం ప్రకటించారు.
తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని పేర్కొన్న సిసోడియా ‘కుట్రదారులు మరియు అవినీతిపరుల’ ముందు తాను ఎప్పటికీ తల వంచబోనని అన్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో జరిగిన అవకతవకలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15 మంది వ్యక్తులు, సంస్థలలో సిసోడియా కూడా ఉన్నారు.
‘నాకు బీజేపీ నుండి సందేశం వచ్చింది. ఆప్‌ని వదిలి బీజేపీలో చేరండి. మీపై సీబీఐ, ఈడీ ద్వారా ఉన్న అన్ని కేసులను మూసివేసేలా మేం చూస్తాం అన్న ప్రతిపాదన వచ్చింది..’ అని సిసోడియా ఆరోపించారు.
‘బీజేపీకి నా సమాధానం ఇదే. నేను మహారాణా ప్రతాప్, రాజ్‌పుత్ వారసుడను. నేను తల తెగినా సరే. కానీ కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎన్నటికీ తలవంచలేను. నాపై ఉన్న కేసులన్నీ అబద్ధం. మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి…’ అంటూ హిందీలో ట్వీట్ చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ శుక్రవారం ఆప్ నేత ఇంటిపై సీబీఐ దాడులు చేసింది.
‘ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ఆపడానికి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన ఆప్ అధినేత మార్గంలో అడ్డంకులు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నమే తనపై కేసు ..’ అని ఆయన విమర్శించారు.