United Kingdom: బ్రిటన్‌కు మనకూ తేడా ఇదే..
United Kingdom: భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ యూకే ప్రధాని అవుతున్న వేళ ఆ దేశపు విశేషాలు.. మనకూ ఆ దేశానికి ఉన్న సారూపత్యలు ఆసక్తి కలిగిస్తాయి.
తొలి భారత సంతతి వ్యక్తి, తొలి శ్వేతజాతీయేతర వ్యక్తి, తొలి హిందూ వ్యక్తి, 200 ఏళ్లలో అత్యంత పిన్న వయస్కుడైన వ్యక్తిగా రిషి సునాక్ ప్రధాన మంత్రి పదవికి ఎన్నికై సంచలనం సృష్టించారు. ఆయన తల్లిదండ్రులు ఇండియా నుంచి వలస వెళ్లి ఈస్ట్ ఆఫ్రికాలో స్థిరపడ్డారు. రిషి సునాక్ ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన యూకే ప్రధానిగా ఎన్నికవడం మన దేశంలో అందరూ గర్వించదిగన క్షణంగా మారింది. ముఖ్యంగా మన దేశాన్ని ఆక్రమించుకుని పాలించిన బ్రిటన్‌కే ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. ఇదే సందర్భంలో మనకూ యూకే దేశానికి ఉన్న సారూప్యతలు ఆసక్తి కలిగిస్తాయి.
యునైటెడ్ కింగ్‌డమ్ భౌగోళిక స్వరూపం ఇదీ:
నార్తర్న్ ఐర్‌లాండ్స్, స్కాట్‌లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ దేశాలను కలిపి యునైటెడ్ కింగ్‌డమ్ అని పిలుస్తారు. ఇంగ్లాండ్, స్కాట్‌లాండ్, వేల్స్ కలిపి గ్రేట్ బ్రిటన్‌గా పిలుస్తారు. ఇంగ్లాండ్, వేల్స్ దేశాలను కలిపి బ్రిటన్‌గా పిలుస్తారు. డిసెంబరు 31, 2020న యురోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చింది. ఈ ప్రక్రియను బ్రెగ్జిట్‌గా పిలుచుకునే వారు. ఆ సమయంలో బ్రెగ్జిట్ నిర్ణయానికి రిషి సునాక్ మద్దతుగా నిలిచారు. రిషి సునాక్ ఫిబ్రవరి 2020లో ఆర్థిక మంత్రి అయ్యారు. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రిషి రాజీనామా చేశారు. ఈయన బాటలోనే పలువురు మంత్రులు రాజీనామా చేశారు. బ్రిటన్‌లో ఆర్థిక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వాదిస్తూ వచ్చారు.
యూకే ప్రభుత్వ స్వరూపం ఇదీ..
యూకే గణతంత్ర దేశం కాదు. రాచరిక వ్యవస్థను అనుసరిస్తుంది. ఎన్నికైన రాజ్యాధినేత ఉంటేనే అది గణతంత్ర దేశం అవుతుంది. యూకేలో రాజ్యాధినేత పదవి వారసత్వంగా వస్తుంది. ప్రస్తుతం బ్రిటన్ రాజుగా ఛార్లెస్ ఉన్నారు. అక్కడ రాజ్యాధినేతకు నామమాత్రపు అధికారాలు ఉంటాయి. ఎన్నికైన వ్యక్తి ప్రభుత్వాధినేతగా ఉంటారు. ఆయనే ప్రధాన మంత్రి. అందువల్ల దీనిని ప్రజాస్వామ్య దేశంగా కూడా పిలుస్తారు. బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థను అనుసరిస్తుంది. ఎగువ సభ (హౌజ్ ఆఫ్ లార్డ్స్), దిగువ సభ (హౌజ్ ఆఫ్ కామన్స్) అనే రెండు సభలు ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఉంటాయి. ఈ ద్విసభా విధానాన్నే ఇండియా కూడా అనుసరించింది.
యూకే రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగం స్వీకరించినవివే..
పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఇండియా స్వీకరించింది. అలాగే ద్విసభ విధానాన్ని అనుసరించింది. అంటే పార్లమెంటులో ఉభయ సభలు ఉంటాయి. అక్కడ ఎగువ సభను హౌజ్ ఆఫ్ లార్డ్స్‌గా పిలుస్తారు. దీనికి వంశపారపర్యంగా ఎన్నికవుతారు. ఇక్కడ ఎగువ సభను రాజ్యసభగా పిలుస్తారు. సభ్యులను వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అక్కడ దిగువ సభను హౌజ్ ఆఫ్ కామన్స్‌గా పిలుస్తారు. ఇక్కడ లోక్‌సభగా పిలుస్తారు. వీటికి ప్రజల నుంచి ఎన్నికైన సభ్యులు (ఎంపీలు) ఉంటారు.
మన సుప్రీం కోర్టు పవర్ ఫుల్..
యూకే తరహాలోనే మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అంతకుమించిన శక్తిమంతమైన వ్యవస్థ మనది. పార్లమెంటు చేసిన చట్టాన్ని కూడా కొట్టివేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉంది. కానీ బ్రిటన్‌లో న్యాయ సమీక్షకు అంతగా అధికారాలు లేవు. ఆర్టికల్ 32 ద్వారా సుప్రీం కోర్టు, ఆర్టికల్ 226 ద్వారా హైకోర్టు రిట్స్ జారీచేసే అధికారాలను మనం అక్కడి నుంచే స్వీకరించాం. అయితే బ్రిటన్‌లో మంత్రులు కూడా వారి చేసిన పనులకు లీగల్ రెస్పాన్సిబులిటీని ఎదుర్కొంటారు. అంతేకాకుండా మంత్రులు చేసే ప్రతిపనిని ప్రతిపక్షం నిరంతరం పరిశీలించేలా ఒక వ్యవస్థ ఉంటుంది. దీనినే షాడో కాబినెట్‌గా కూడా పిలుస్తారు.
భారత రాజ్యాంగం అనుసరించిన మరో వ్యవస్థ రూల్ ఆఫ్ లా. చట్టం ముందు అందరూ సమానులే అన్న భావనను మనం యూకే రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. చట్టం నుంచి అందరికీ సమానమైన రక్షణ అన్న భావనను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఇక శాసన వ్యవస్థను కూడా మనం బ్రిటన్ రాజ్యాంగం నుంచే స్వీకరించారు. చట్టాలు తేవడంలో బిల్లుల రూపకల్పన, ఉభయ సభల్లో ఆమోదం పొందడం వంటి ప్రక్రియలను అనుసరిస్తాం. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న వేళ ఎంపీలకు ప్రత్యేక హక్కులు కూడా బ్రిటన్ రాజ్యాంగం నుంచి అనుసరించినవే.
భారత రాజ్యాంగాన్ని లిఖిత రాజ్యాంగం అని అంటే.. యూకే రాజ్యాంగాన్ని అలిఖిత రాజ్యాంగం అని అంటారు. అంటే కాలక్రమంలో అవసరాలకు అనుగుణంగా ఏర్పడుతూ వచ్చింది. కానీ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు రూపకల్పన చేసింది.
సమాఖ్య వ్యవస్థ కాదు..
ఇండియాలో రాష్ట్రాల మాదిరిగా యూకేలో షైర్స్ ఉంటాయి. రాష్ట్రాలకు అధికారాలు ఉండవు. అధికారం అంతా కేంద్రం చేతిలోనే ఉంటుంది. మనం మాత్రం సమాఖ్య స్వరూపం కలిగి ఉన్నాం. అంటే కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరుగా, అలాగే ఉమ్మడిగా కొన్ని అధికారాలు కలిగి ఉంటాయి. ఈ భావనను మనం కెనడా నుంచి తీసుకున్నాం. రాష్ట్రాలకు అధికారాలు ఉన్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ అధికారాలు కలిగి ఉంటుంది.
మన దేశంలో ప్రధాన మంత్రి రాజ్యసభ నుంచి గానీ, లోక సభ నుంచి గానీ ఉండొచ్చు. కానీ బ్రిటన్‌లో కచ్చితంగా దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్ నుంచే రావాలి. అంటే ప్రజలచే ఎన్నికవ్వాలి. ఇక సభాపతిగా ఎన్నికైన ఎంపీ కచ్చితంగా వారి పార్టీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మన దేశంలో ఆ పరిస్థితి లేదు.
బ్రిటన్ అధికారిక రిలీజియన్ క్రైస్తవం. భారత దేశం సెక్యులర్ విధానాన్ని అనుసరిస్తోంది. అక్కడ 60 శాతం జనాభా క్రైస్తవులే.
మన దేశం ఆర్టికల్ 9 ద్వారా ద్వంద్వ పౌరసత్వాన్ని నిషేధించి ఏకపౌరసత్వాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది కూడా బ్రిటన్ రాజ్యాంగాన్ని అనుసరించిందే.