Rishi Sunak UK PM : భారత్‌తో రిషి సునక్‌కు ఆత్మీయ అనుబంధం!
Rishi Sunak UK PM : బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునక్‌కు భారత్‌తో ఆత్మీయ అనుబంధం ఉంది. ఆయన ఒత్తిడిలో ఉన్నప్పుడు భగవద్ గీతను చదువుతారు.
Rishi Sunak UK PM : బ్రిటీష్ రాజ్యంలో తొలి భారత సంతతి ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన రిషి సునక్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. బ్రిటన్ ప్రధానిగా ఆయన ఎంపికైన కొన్ని క్షణాల నుంచే.. రిషిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి. భారత సంతతి వ్యక్తి.. బ్రిటన్‌లో అధికారాన్ని చేపట్టడంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. భారత్‌తో రిషి సునక్‌కు ఉన్న అత్మీయ అనుబంధాన్ని ఓసారి గుర్తుచేసుకుందాము.
క్రికెట్ అంటే ఇష్టం.. భగవద్ గీతపై ప్రమాణం..
రిషి సునక్ తల్లిదండ్రులు ఇద్దరు భారత సంతతికి చెందినవారే. వారిద్దరు ఫార్మసిస్ట్‌లు. 1960 దశకంలో తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకు వలస వెళ్లిపోయారు. రిషి సునక్ తండ్రి పేరు యశ్వీర్ సునక్. ఆయన నేషనల్ హెల్త్ సర్వీస్‌లో పనిచేసేవారు. తల్లి పేరు ఉష సునక్. ఆమె ఫార్మసి షాపు నడిపేవారు.
Rishi Sunak relation with India : ఇన్ఫోసిస్ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తితో రిషి సునక్ వివాహం జరిగింది. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు కృష్ణ, అనౌష్క.
అత్తమామలను కలిసేందుకు రిషి సునక్.. తన భార్య, పిల్లలతో కలిసి బెంగళూరుకు వస్తూ ఉంటారు.
తల్లిదండ్రులు తనకు నిత్యం భారత్ గురించి చెప్పేవారని రిషి సునక్ అనేకమార్లు చెప్పారు. అక్కడి విలువలను చెబుతూ తనను పెంచారని అన్నారు.
రిషి సునక్‌కు స్టాన్‌ఫర్డ్ వర్సిటీలో డిగ్రీ ఉంది. ఆయన ఓ మాజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కూడా. భారతీయుల్లాగే.. ఆయన తల్లిదండ్రులకు చదువు విలువు తెలుసు. అందుకే కష్టపడి రిషిని చదివించారు.
Rishi Sunak next UK PM : యార్క్‌షైర్ నుంచి ఎంపీగా గెలిచి పార్ల్మెంట్కు వెళ్లారు రిషి సునక్. అక్కడ భగవద్ గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్ పార్లమెంట్లో ఇలా జరగడం అదే తొలిసారి!
మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ హయాంలో ఛాన్స్‌లర్‌గా పనిచేసిన రిషి సునక్.. ఓ దీపావళి సందర్భంగా డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసంలో దీపాలు వెలిగించి.. భారత సంప్రదాయాలు, ఆచారాలపై తన ప్రేమను చాటుకున్నారు.
ఒత్తిడిలో ఉన్నప్పుడు భగవద్ గీత చదువుతానని, తనకు ప్రశాంతత లభిస్తుందని రిషి సునక్ చెబుతూ ఉంటారు. విధి నిర్వహణకు కట్టుబడి ఉండేందుకు భగవద్ గీత తనకు ఉపయోగపడుతుందని అంటారు. కొన్ని నెలల క్రితం.. ప్రధాని రేసులో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న సమయంలో ఆయన ఒత్తిడికి గురయ్యారు. ఆ సమయంలో భగవద్ గీత చాలా సాయం చేసిందని ఓసారి చెప్పారు.
Rishi Sunak latest news : బ్రిటన్‌లోని అత్యంత సంపన్నుల్లో రిషి సునక్ ఒకరు. ఆయనకు బ్రిటన్వ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. ఆయన నెట్ వర్త్ 700మిలియన్ పౌండ్స్‌గా ఉంది.
రిషి సునక్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఫిట్‌గా ఉండేదుకు ఆయన తరచూ క్రికెట్ ఆడతారు.
గెలుపు ఇలా..
UK PM race : 45రోజుల పాలన అనంతరం ప్రధాని పదవికి ఇటీవలే రాజీనామా చేశారు లిజ్ ట్రస్. ఫలితంగా బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం మళ్లీ తెరపైకి వచ్చింది. బ్రిటన్ ప్రధాని రేసులో ముగ్గురు ఉంటారని ఊహాగానాలు జోరందుకున్నాయి. బోరిస్ జాన్సన్.. రేసు నుంచి తప్పుకున్నారు. పెన్నీ మౌర్డంట్కు కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు లభించలేదు. ఫలితంగా 100కుపైగా ఎంపీల మద్దతు ఉన్న రిషి సునక్.. బ్రిటన్ తదుపరి ప్రధానిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
సంబంధిత కథనం